సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచీకరణ, ఆర్థిక సరళీకరణ విధానాలతో ప్రపంచం కుగ్రామంగా మారితే కోవిడ్-19 ప్రభావంతో ఈ భావన మసకబారనుంది. కరోనా మహమ్మారికి ముందు ప్రపచం గ్లోబల్ విలేజ్‌గా రూపుమార్చుకోగా..ఈ మహమ్మారి నెమ్మదించిన తర్వాత దేశాలు తమ ప్రజలను కాపాడుకునేందుకు రక్షణాత్మక విధానాలతో సరిహద్దుల్లో గిరిగీసుకునే పరిస్థితి నెలకొంది. ఈ వాతావరణం అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం చూపనుంది. కోవిడ్-19తో ఇప్పటికే సాధారణ జనజీవనం, ఆర్థిక కార‍్యకలాపాలు స్తంబించడంతో ప్రపంచ వాణిజ్యం 2020లో 13 నుంచి 32 శాతం పడిపోతుందని డబ్ల్యూటీఓ అంచనా వేస్తుండగా మహమ్మారి పురోగతి చూస్తుంటే అంతర్జాతీయ వాణిజ్యంపై కోవిడ్-19 ప్రభావం అంచనాలకు మించి ఉండనుంది. బారత్ సహా పలు దేశాలు ఇప్పటికీ లాక్‌డౌన్‌లో కొనసాగుతుంటే ఈ సంక్షోభం 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని మించిన స్ధాయిలో ప్రబావం చూపుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సీమాంతర వాణిజ్యమే మార్గాంతరం
లాక్‌డౌన్ అమలుతో రవాణా నిలిచిపోవడంతో డిమాండ్, సరఫరాల వ్యవస్థకు తీవ్ర ప్రతిబంధకాలు ఎదురయ్యాయి. మహమ్మారి నుంచి ప్రపంచం కోలుకున్న అనంతరం అంతర్జాతీయ వాణిజ్యానికి ఆయా దేశాలు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నాయి. అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్ వాటా పరిమితంగా ఉన్న క్రమంలో స్ధానిక మార్కెట్లు , వ్యాపారులకు ఊతమిచ్చేందుకు ముందుకు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జమ్ము కశ్మీర్‌లో సీమాంతర వాణిజ్య పునరుద్ధరణకకు బారత్ చొరవ చూపాలి. ఏడాది కిందట 2019 ఏప్రిల్ 18న సలామాబాద్, చకన్ ద బాగ్‌ల ద్వారా సాగే సీమాంతర వాణిజ్యాన్ని నిలిపివేసింది. పాకిస్తాన్‌కు చెందిన విద్రోహ శకక్తులు ఈ మార్గం దా్వరా దేశంలోకి అక్రమ ఆయుధాలు, నార్కోటిక్స్, నల్లధనం చేరవేస్తాయనే ఆందోళనతో భారత్ ఈ నిర్ణయం తీసకుంది.
ఇరు దేశాల మధ్య విశ్వాసపూరిత వాతావరణం నెలకొల్పే ఉద్దేశంతో 2008లో సీమాంతర వాణిజ్యాన్ని ప్రారంభించారు. వారానికి నాలుగు రోజుల పాటు రోజుకు 70 ట్రక్కుల సరుకు రవాణాకు ఇరు దేశాల ప్రజలు, వ్యాపారులకు అనుమతించారు. 2008 నుంచి 2019 మధ్య నియంత్రణ రేఖ వెంబడి రూ 7500 కోట్ల వాణిజ్య కార్యకలాపాలు నమోదయ్యాయి. దాదాపు 1,70,000 పనిదినాలు, జమ్ము కశ్మీర్‌కు చెందిన ట్రాన్స్‌పోర్టర్లకు రూ 66 కోట్లు సరుకు రవాణా రాబడి సమకూరింది. జమ్ము కశ్మీర్ ఆర్థిక వ్యవస్థలో ఈ గణాంకాలు నామమాత్రమైనా దీనిపై పెద్దసంఖ్యలో స్ధానిక వ్యాపారులు, ట్రాన్స్‌పోర్టర్లు, రోజువారీ కార్మికులు తమ జీవనం వెళ్లదీస్తున్నారు. జాతీయ భద్రతపై ఆందోళనలు, ఈ వర్తకంపై అనిశ్చితి ఇలాంటి ఎన్నో సందిగ్ధతలున్నా సీమాంతర వాణిజ్యం పదేళ్లకు పైగా నిరాటంకంగా కొనసాగింది.
చదవండి : నేటి ‘కరోనా శుభ్రత’ నాడే ఉంది!
2019లో సీమాంతర వాణిజ్యాన్ని ప్రభుత్వం నిలిపివేసినప్పటి నుంచీ దీనిపై ఆధారపడిన వేలాది కుటుంబాల మనుగడ ప్రశ్నార్ధకమైంది. ఇతర రంగాలకు మళ్లాలనుకునే వర్తకులు, కార్మికులు, ట్రాన్స్‌పోర్టర్లకు కోవిడ్-19 రూపంలో పెను విఘాతం ఎదురైంది. మహమ్మారి నెమ్మదించిన తర్వాత పరిమితంగానైనా సీమాంతర వాణిజ్యానికి అనుమతిస్తే ఆర్థిక కార్యకలాపాలు పుంజకుంటాయని చెబుతున్నారు. భద్రతాపరమైన సమస్యలు తలెత్తకకుండా నియంత్రణ పద‍్ధతులు పాటిస్తూ పూర్తి పారదర్శకతతో, ఆడిటింగ్ ప్రమాణాలతో, భద్రతా సిబ్బంది నీఘా నీడన సీమాంతర వాణిజ్యానికి అనుమతించాలన్న అబిప్రాయం వ్యక్తమవుతోంది. కోవిడ్-19 నుంచి కోలుకున్న అనంతరం అంతర్జాతీయ వాణిజ్యం స్వరూం మారుతుందనే అంచనాల నేపథ్యంలో స్ధానిక మార్కెట్లకు ఊతమిచ్చేలా ఆయా దేశాలు సరిహద్దుల్లో పొరుగుదేశాలతో బోర్డర్ ట్రేడ్‌కు ప్రాధాన్యతను ఇచ్చే పరిస్థితులు నెలకొన్నాయి. అదే సమయంలో బారత్ సైతం ఇదే బాటన నడవాలని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment