సైయంట్ లాభం రూ. 74 కోట్లు
ఆదాయం 14% అప్.. రూ. 830 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఐటీ ఇంజినీరింగ్ సేవలు అందించే సైయంట్ (గతంలో ఇన్ఫోటెక్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 74 కోట్ల నికర లాభం ప్రకటించింది. క్రితం క్యూ1లో నమోదైన రూ. 76 కోట్లతో పోలిస్తే లాభం సుమారు 2 శాతం తగ్గింది. మరోవైపు ఆదాయం మాత్రం రూ. 726 కోట్ల నుంచి 14 శాతం వృద్ధితో రూ. 830 కోట్లకు చేరిందని సంస్థ ఎండీ కృష్ణ బోదనపు గురువారం తెలిపారు. ఏరోస్పేస్ .. రక్షణ, రవాణా, కమ్యూనికేషన్స్ బిజినెస్ విభాగాల ఊతంతో సేవల వ్యాపార విభాగం 5 శాతం వృద్ధి చెందిందని ఆయన పేర్కొన్నారు. యుటిలిటీ, జియోస్పేషియల్, డిజైన్ ఆధారిత తయారీ (డీఎల్‌ఎం) విభాగాల మినహా మిగతా అన్ని వృద్ధి చెందినట్లు కృష్ణ తెలిపారు. వేతనాల పెంపు కారణంగా మార్జిన్లపై కొంత ప్రభావం పడి ందన్నారు. వ్యాపార స్వభావం కారణంగా డీఎల్‌ఎంలో కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ.. ఆర్డర్లు పుష్కలంగా ఉండటం వల్ల ద్వితీయార్ధంలో ఇది పుంజుకోగలదని చెప్పారు. క్యూ2లో పటిష్టమైన పనితీరు కనపర్చగలమని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సర్వీసుల విభాగంలో రెండంకెల స్థాయి, డీఎల్‌ఎంలో 50 శాతం వార్షిక ఆదాయ వృద్ధి సాధించగలమని కృష్ణ ధీమా వ్యక్తం చేశారు.
డాలర్ మారకంలో చూస్తే క్యూ1లో నికర లాభం 7.2 శాతం తగ్గుదలతో 11 మిలియన్ డాలర్లకు క్షీణించగా, ఆదాయం 8.7 శాతం వృద్ధితో 124 మిలియన్ డాలర్లకు చేరింది. ఏరోస్పేస్ విభాగం 5%, రవాణా 9%, మెడికల్..హెల్త్‌కేర్ 16 శాతం, కమ్యూనికేషన్ విభాగం 13 శాతం పెరిగాయి. క్యూ1లో కొత్తగా 22 క్లయింట్స్ జత కాగా, ఉద్యోగుల సంఖ్య 12,965గా ఉంది.