
రూపాయి పతనం, క్రూడ్ పెరగడం, ఎన్‌బీఎఫ్‌సీల సంక్షోభం నేపథ్యంలో క్షీణిసున్న మార్కెట్‌ను గత వారం రోజుల్లో వెలువడిన మూడు నిర్ణయాలు మరింత దెబ్బతీసాయి. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ను ప్రభుత్వం టేకోవర్ చేయడం, పెట్రోల్, డీజిల్‌పై ఎక్సయిజు సుంకాల్ని తగ్గించడం, ఆర్‌బీఐ వడ్డీ రేట్లను యధాతథంగా అట్టిపెట్టడం... ఈ మూడు అంశాలూ మార్కెట్‌కు రుచించకపోవడంతో ఈక్విటీలు అనూహ్యంగా పతనమయ్యాయి. మరోవైపు అమెరికా బాండ్ ఈల్డ్ జోరుగా పెరగడంతో ప్రపంచ మార్కెట్లు, ఇతర వర్థమాన కరెన్సీలు కూడా అతలాకుతలం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్పొరేట్ల ద్వితీయ త్రైమాసిక ఫలితాల వెల్లడి ప్రారంభంకానున్నది. తొలుత ఫలితాల్ని వెల్లడించబోయే ఐటీ కంపెనీల లాభదాయకతపై ఇప్పటికే మార్కెట్లో మంచి అంచనాలు వున్నాయి. అందుకు అనుగుణంగా ఈ షేర్లు ఇటీవలి మార్కెట్ పతనంలో కూడా స్థిరంగా ట్రేడయినందున, రాబోయే రోజుల్లో ఈ షేర్ల కదలికలు మార్కెట్‌కు కీలకం.
సెన్సెక్స్ సాంకేతికాలు..
గత మార్కెట్ పంచాంగంలో సూచించిన 36,060–35,985 కీలక మద్దతు శ్రేణిని మంగళవారం గ్యాప్‌డౌన్‌తో కోల్పోయిన బీఎస్‌ఈ సెన్సెక్స్...అటుతర్వాత 200 డీఎంఏ స్థాయిని కూడా మరో గ్యాప్‌డౌన్‌తో నష్టపోయి 34,202 వద్దకు భారీ పతనాన్ని చవిచూసింది. చివరకు అక్టోబర్ 5తో ముగిసిన నాలుగురోజుల ట్రేడింగ్‌వారంలో అంతక్రితం వారంతో పోలిస్తే 1850పాయింట్ల భారీ నష్టంతో 34,377 వద్ద ముగిసింది. నాలుగువారాలుగా జరుగుతున్న లోయర్ టాప్, లోయర్ బోటమ్ ఫార్మేషన్‌లో మార్పు జరిగేంతవరకూ సెన్సెక్స్ కరెక్షన్ బాటలోనే వుంటుందని ఛార్టులు సూచిస్తున్నాయి. ఈ వారం సైతం గ్యాప్‌డౌన్‌తో సెన్సెక్స్ మొదలైతే 32,968–32,483 మద్దతు శ్రేణి వరకూ పతనం కొనసాగవచ్చు. ఈ స్థాయి దిగువన ముగిస్తే 32,371 వద్ద మరో కీలక మద్దతు లభిస్తున్నది. ఈ లోపున కొద్ది వారాల్లో 30,810 స్థాయికి కూడా సెన్సెక్స్ పడిపోయే ప్రమాదం వుంటుంది. ఈ వారం తొలి మద్దతుస్థాయిని పరిరక్షించుకోగలిగితే 35,119–35,022 వరకూ బౌన్స్ అయ్యే అవకాశం వుంటుంది. అటుపైన 200 డీఎంఏ రేఖ కదులుతున్న 35,366 స్థాయి వద్ద గట్టి అవరోధం కలగవచ్చు. ఈ నిరోధాన్ని దాటితే 35,820–35,912 శ్రేణిని అందుకునే అవకాశం వుంటుంది.
నిఫ్టీ తక్షణమద్దతు 10,097, తొలి నిరోధం 10,540
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సూచీ గత కాలమ్‌లో సూచించిన 10,880–10,850 పాయింట్ల మద్దతు శ్రేణిని కోల్పోయినంతనే 10,262 పాయింట్ల కనిష్టస్థాయికి పతనమయ్యింది. చివరకు 10,316 పాయింట్ల వద్ద ముగిసింది. వారంలో మొత్తంమీద 614 పాయింట్లు నష్టపోయింది. ఈ వారం నిఫ్టీ పతనం కొనసాగితే 10,097–9,952 పాయింట్ల శ్రేణి వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది.ఈ శ్రేణిని కోల్పోతే 9,826 పాయింట్ల వరకూ నిఫ్టీ పడిపోవొచ్చు. ఈ లోపున కొద్దివారాల్లో 9,370 పాయింట్ల వరకూ పతనం కొనసాగవచ్చు. ఈ వారం తొలి మద్దతుశ్రేణిని పరిరక్షించుకోగలిగితే 10,540–10,547 పాయింట్ల శ్రేణికి పెరగవచ్చు. ఈ శ్రేణిపైన 200 డీఎంఏ రేఖ కదులుతున్న 10,777 పాయింట్ల స్థాయి నిఫ్టీని నిరోధించవచ్చు. ఈ స్థాయిని సైతం దాటితే 10,844 పాయింట్ల వరకూ రిలీఫ్ ర్యాలీ కొనసాగే అవకాశం వుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment