‘వడ్డి’oచిన విస్తరి ఏదీ? | Declining rates of return on deposits with the cut | Sakshi
Sakshi News home page

‘వడ్డి’oచిన విస్తరి ఏదీ?

Published Mon, Jun 22 2015 12:06 AM | Last Updated on Sun, Sep 3 2017 4:08 AM

‘వడ్డి’oచిన విస్తరి ఏదీ?

‘వడ్డి’oచిన విస్తరి ఏదీ?

రేట్ల కోతతో డిపాజిట్లపై తగ్గుతున్న రాబడి
రుణ గ్రహీతలకు వరమే కానీ వీరికి ఇబ్బందే
ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్న పొదుపరులు
కార్పొరేట్ బాండ్లు సహా పలు పథకాలు అందుబాటులో

 
 వడ్డీరేట్లు తగ్గుతున్నాయి. ఇంకా తగ్గించాలనే డిమాండ్లూ వస్తున్నాయి. దీంతో ఆర్‌బీఐ మరో విడత రెపో రేటు కోతపెట్టే అవకాశాలూ లేకపోలేదు. ఇక బ్యాంకులేమో ఆర్‌బీఐ తగ్గించిన వెంటనే డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటిస్తున్నాయి. కాకపోతే ఆ స్పీడును రుణాలపై వడ్డీరేట్ల తగ్గింపులో మాత్రం చూపించటం లేదన్నది అందరికీ తెలిసిందే. ఒకరకంగా ఇలా వడ్డీ రేట్లు తగ్గుతుండటమన్నది రుణాలు తీసుకున్నవారికి శుభవార్తే. వారికిది మంచికాలమే. మరి డిపాజిట్లు చేసుకుని వడ్డీపై వచ్చే ఆదాయంతోనే బతుకుతున్నవారి సంగతో? వారి పరిస్థితేంటి? ఇలాంటపుడు వాళ్లేం చేయాలి? ఇదే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ కథనం...

 ఉదాహరణకు కృష్ణమూర్తి రిటైరయి దాదాపు మూడేళ్లు కావస్తోంది. ఉన్న డబ్బులు అక్కడా ఇక్కడా ఇన్వెస్ట్ చేయకుండా భద్రంగా ఉంటుందని బ్యాంకునే నమ్ముకున్నారాయన. ఏడాది కిందటిదాకా పరిస్థితి బాగానే ఉంది. అప్పట్లో ఐదేళ్ళ కాలానికి బ్యాంకులో డిపాజిట్ చేస్తే 9.5 శాతం తక్కువ కాకుండా వడ్డీ వచ్చేది. ఇప్పుడు అదే కాలానికి డిపాజిట్ చేస్తే 8-8.5 శాతానికి మించి వడ్డీ రావడం లేదు. దీంతో ఆయన కూడా ప్రత్యామ్నాయాలు అన్వేషించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
 పోస్టాఫీసు పథకాలు
 బ్యాంకు డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గుతున్న తరుణంలో పలు పోస్టాఫీసు పథకాల వడ్డీరేట్లు కాస్త ఆకర్షణీయంగా ఉన్నాయి. ప్రస్తుతం బ్యాంకుల్లో మూడేళ్ల నుంచి ఐదేళ్ళ కాలపరిమితి గల డిపాజిట్లపై 8-8.5 శాతానికి మించి వడ్డీ ఇవ్వడం లేదు. కానీ ఇదే సమయంలో పలు పోస్టాఫీసు పథకాల్లో ఇంతకంటే ఎక్కువ వడ్డీ లభిస్తోంది.

 ఎన్‌ఎస్‌సీ: నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్స్ (ఎన్‌ఎస్‌సీ)పై 8.5 శాతం నుంచి 8.8 శాతం వడ్డీ లభిస్తోంది. అంతేకాదు ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్న మొత్తంపై సెక్షన్ 80సీ పన్ను మినహాయింపులు కూడా ఉన్నాయి. ఇవి ఐదేళ్లు, పదేళ్ల కాలపరిమితిలో లభిస్తున్నాయి.

 కేవీపీ: ఇన్వెస్ట్ చేసిన ఎనిమిది సంవత్సరాల నాలుగు నెలల్లో రెట్టింపు అయ్యే విధంగా కిసాన్ వికాసపత్రాలను తిరిగి ప్రవేశపెట్టడం జరిగింది. దీనిపై 8.7 శాతం వడ్డీరేటు గిట్టుబాటు అవుతుంది.

 పీపీఎఫ్: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్ సాధనం. ఈ పథకం కాలపరిమితి 15 ఏళ్లు. దీనిపై ప్రస్తుతం 8.7 శాతం వడ్డీ లభిస్తోంది. ఇందులో ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై సెక్షన్ 80సీ పన్ను మినహాయింపులు లభిస్తాయి.

 మంత్లీ ఇన్‌కమ్ : నెలవారీ వడ్డీ కావాలనుకునే వారి కోసం ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. ఈ పథకంపై ప్రస్తుతం 8.4 శాతం వడ్డీ లభిస్తోంది.

 సీనియర్ సిటిజన్స్ స్కీం: 60 ఏళ్లు దాటిన వారు ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ పథకంపై 9.3 శాతం వడ్డీరేటు అందిస్తున్నారు. కాలపరిమితి ఐదేళ్లు.

 సుకన్య సమృద్ధి...
 అమ్మాయిల కోసం కేంద్ర ప్రభుత్వం గతేడాది ఈ ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సేవింగ్ పథకాల్లో అత్యధిక కాలపరిమితి కలిగిన పథకమిదే.  ఈ పథకం కాలపరిమితి అమ్మాయికి 21 ఏళ్లు లేదా వివాహ తేదీ ఏది ముందైతే అది. ఈ పథకంపై అందించే వడ్డీ ఏటా మారుతుంటుంది. ఈ ఏడాది వడ్డీరేటును 9.2 శాతంగా ప్రకటించారు. అంతేకాదు ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై సెక్షన్ 80సీ పన్ను మినహాయింపులు లభిస్తాయి. ఒక అమ్మాయి పేరిట ఒక ఖాతాను మాత్రమే ప్రారంభించగలరు. ఇలా గరిష్టంగా ఇద్దరు అమ్మాయిల పేరిట ప్రారంభించొచ్చు. దగ్గర్లోని పోస్టాఫీసులో  ఈ పథకాన్ని ప్రారంభించొచ్చు.

 డెట్ ఫండ్స్
 కొద్దిగా రిస్క్ చేస్తే బ్యాంకు, పోస్టాఫీసు పథకాల కంటే ఎక్కువ రాబడిని డెట్ ఫండ్స్ ద్వారా పొందచ్చు. కానీ వీటి రాబడిపై కచ్చితమైన హామీ ఉండకపోవడమే వీటిలోని ప్రధానమైన రిస్క్. వడ్డీరేట్లు తగ్గుతున్న సమయంలో గిల్ట్ వంటి ఫండ్స్ మంచి రాబడులను అందిస్తాయి. గడిచిన సంవత్సర కాలంలో మీడియం టర్మ్ గిల్ట్ ఫండ్స్ 14 నుంచి 16 శాతం వరకు రాబడిని అందిస్తే షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్ అన్నీ 10 శాతం రాబడిని అందించాయి.

 ప్రైవేటు కంపెనీల బాండ్లు
 వివిధ కంపెనీలు బాండ్స్ లేదా డిపాజిట్ల ద్వారా నిధులను సేకరిస్తుంటాయి. ఇవి అందించే వడ్డీరేట్లు  కంపెనీని బట్టి మారుతుంటాయి.  ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రైవేటు కంపెనీలు డిపాజిట్లపై (ట్రిపుల్ ఏ రేటింగ్) 9-9.5 శాతం వడ్డీని అందిస్తున్నాయి. ఈ కంపెనీ బాండ్స్ అనేవి పూర్తి రిస్క్‌తో కూడుకున్నవి. మెచ్యూర్టీ సమయంలో కంపెనీ చెల్లింపులు చేయలేని పరిస్థితులు కూడా ఎదురుకావచ్చు. కాబట్టి ఈ రిస్క్‌కు సిద్ధపడ్డవారు అధిక వడ్డీ కోసం కంపెనీ డిపాజిట్ల వైపు చూడవచ్చు. ప్రస్తుతం శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్, బీఎన్‌పీపారిబాస్‌లు 9.5 శాతం వడ్డీని ఆఫర్ చేస్తుంటే, పీఎన్‌బీ హౌసింగ్, ఎంఅండ్‌ఎం ఫైనాన్షియల్స్, బజాజ్ ఫైనాన్స్‌లు 9.25 శాతం వడ్డీని అందిస్తున్నాయి.

 ఇన్‌ఫ్రా బాండ్లు
 మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టుల కోసం జారీ చేసే వాటిని ట్యాక్స్ ఫ్రీ ఇన్‌ఫ్రా బాండ్స్‌ని ఈ ఏడాది తిరిగి ప్రవేశపెడుతున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. ఇవి సాధారణంగా 10, 15 సంవత్సరాల కాలపరిమితిని కలిగి ఉంటాయి. ఈ బాండ్స్ విధివిధానాలను ఇంకా ప్రకటించాల్సి ఉంది. సాధారణంగా బ్యాంకు డిపాజిట్ల కంటే వడ్డీరేటు తక్కువగా ఉంటుంది. కానీ ఈ పథకాల్లో వచ్చే వడ్డీని ఆదాయంగా పరిగణించకపోవడం కలిసొచ్చే కాలం. ఉదాహరణకు బ్యాంకు డిపాజిట్లో 9 శాతం వడ్డీ లభిస్తుంటే దానిపై వచ్చే వడ్డీని ఆదాయంగా పరిగణిస్తారు. 30 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి అప్పుడు నికర వడ్డీ 6.3 శాతమే అవుతుంది. ఇన్‌ఫ్రా బాండ్స్ ఇంతకంటే ఎక్కువ వడ్డీని అందిస్తాయి. వచ్చే ఒకటి రెండు నెలల్లో ఇన్‌ఫ్రా బాండ్స్ మార్కెట్లోకి రావచ్చని అంచనా వేస్తున్నారు.
 - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement