సాక్షి, న్యూఢిల్లీ : కల్తీ మద్యానికి చెక్ పెట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు మద్యం వ్యాపారులకు షాక్ ఇస్తున్నాయి. ఎనిమిది రోజులకు మించి పాతబడిన మద్యం నిల్వలను ఆగస్ట్ 31 నుంచి ధ్వంసం చేయాలని ఢిల్లీ సర్కార్ స్పష్టం చేసింది. కస్టమర్లకు నాణ్యతతో కూడిన మద్యాన్ని అందుబాటులోకి తేవడంతో పాటు కల్తీ మద్యం, పాత, కొత్త ఆల్కహాల్‌ను మిక్స్ చేసే వ్యాపారుల ఆగడాలకు కళ్లెం వేసేందుకు ఎక్సైజ్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. మద్యం వ్యాపారులు తరచూ గడువు ముగిసే బీర్లను పెద్దసంఖ్యలో తక్కువ ధరలకు కొనుగోలు చేసి వాటిని కస్టమర్లకు అందిస్తున్నారు. తొలుత కొనుగోలు చేసిన మద్యం నిల్వలను ముందుగా విక్రయించాలని బీర్, వైన్, షాంపేన్ వంటివి మూడు రోజుల వరకే కౌంటర్లలో ఉంచాలని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. రూ 1500 ఖరీదు కలిగిన విస్కీ, జిన్, వోడ్కా, రమ్, స్కాచ్‌లను ఐదు రోజుల్లోగా విక్రయించాలని, రూ 1500 నుంచి రూ 6000 విలువైన మద్యాన్ని ఎనిమిది రోజుల్లోగా అమ్మకాలు జరిపి మిగిలిన నిల్వలను ధ్వంసం చేయాలని పేర్కొంది. ఆయా గడువులోగా స్టాక్స్ మిగిలితే వాటిని అమ్మినట్టుగానే భావించి కౌంటర్ల నుంచి పక్కనపెట్టాలని తెలిపింది.
ఈ నిల్వలను వారం రోజుల్లో నిర్వీర్యం చేయాలని పేర్కొంటూఈ ఉత్తర్వులను పాటించని బార్లు, పబ్‌లు, రెస్టారెంట్‌లు, హోటళ్లు, డిస్కోథెక్‌ల లైసెన్లను రద్దు చేసేందుకూ ప్రభుత్వం వెనుకాడబోదని ఢిల్లీ ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అజయ్ కుమార్ గంభీర్ స్పష్టం చేశారు. వినియోగదారుల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తామని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై పబ్‌లు, హోటల్స్, బార్ యజమానులు భగ్గుమంటున్నారు. ఈ నిర్ణయంతో అవినీతి మరింత పెరుగుతుందని, మద్యం కల్తీని అరికట్టాలంటే ఎక్సైజ్ శాఖ తమ అవుట్‌లెట్లను తనిఖీ చేయవచ్చని ఇలా తమను టార్గెట్ చేయడం సరికాదని ఆర్ధర్ 2 పబ్ యజమాని సువీత్ కార్లా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయం తమ వ్యాపారాన్ని దెబ్బతీస్తుందని అన్నారు. ప్రీమియం బ్రాండ్స్ వ్యాపారంపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతుందని మద్యం వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కస్టమర్లు ఢిల్లీ సర్కార్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందని, నాణ్యమైన మద్యం తమకు అందుబాటులోకి వచ్చేలా ఈ నిర్ణయం వెసులుబాటు కల్పిస్తుందని థామస్ కుక్‌లో పనిచేసే పర్వ్ పేర్కొన్నారు. కల్తీ మద్యం నివారించకపోతే పలు అనారోగ్య సమస్యలు వెంటాడుతాయని సీనియర్ వైద్యులు విక్రంజిత్ సింగ్ అన్నారు. బార్లలో తరచూ పాత, కొత్త మద్యాలను మిక్స్ చేసి కస్టమర్లకు ఇవ్వడం తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కల్తీ మద్యం పలు అనారోగ్య సమస్యలకు దారితీస్తోందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment