సాక్షి, న్యూఢిల్లీ : కొత్తగా ప్రవేశపెట్టిన రూ 50, రూ 200 నోట్లు, కాయిన్స్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కంటిచూపు సరిగాలేని వారు ఈ నోట్లు, కాయిన్స్‌ను గుర్తించి వాడటంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని..వీటిని పరిశీలించాలని ఆర్‌బీఐని హైకోర్టు కోరింది. నోట్ల సైజు, వాటిపై ఉన్న చిహ్నాలు, ప్రమాణాలను గుర్తించడంలో వారు సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ప్రభుత్వం, ఆర్‌బీఐ ఈ అంశాలపై కూలంకషంగా చర్చించి పరిష్కరించాలని సూచించింది.
కంటిచూపు సమస్యలున్న నిపుణులు, ఈ రంగంలో అనుభవం ఉన్న ఇతరులతో అధికారులు సంప్రదింపులు జరపాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్, జస్టిస్ సీ హరిశంకర్‌తో కూడిన బెంచ్ కోరింది. గతంలో ఆయా నోట్ల కరెన్సీ సైజ్‌లోనే ఎందుకు తయారుచేయడం లేదని కేంద్రం తరపున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ సంజయ్ జైన్‌ను హైకోర్టు బెంచ్ ప్రశ్నించింది. అన్ని కోణాల్లో పరిశీలించిన మీదటే కరెన్సీ డిజైన్‌ను ఖరారు చేశామని ఆయన కోర్టుకు నివేదించారు. దీంతో ఫిబ్రవరి 16కు తదుపరి విచారణను వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment