ధన్‌తేరస్‌కు నాణేల మెరుపులు..
న్యూఢిల్లీ: బంగారం కొనుగోళ్లకు శుభప్రదమైన దినంగా భావించే.. ధన్‌తేరస్‌లో వినియోగదారులు పసిడి, వెండి నాణేల కొనుగోళ్లకు అధికంగా మొగ్గుచూపారు. ఆభరణాల కొనుగోళ్లు మందగించాయి. ఆశోకచక్రతో కూడిన నాణేలుసహా పసిడి, వెండి నాణేల కొనుగోళ్లు దేశవ్యాప్తంగా భారీగా ఉన్నట్లు ఎంఎంటీసీ-పీఏఎంపీ ఇండియా, ఆభరణాల వర్తకులు తెలిపారు.
10 గ్రాముల వరకూ డిమాండ్
‘10 గ్రాముల వరకూ పసిడి, వెండి నాణాలకు డిమాండ్ కనబడింది. గత ధన్‌తేరస్‌తో పోల్చి 10 గ్రాముల పసిడి ధర రూ.1,000 తక్కువగా ఉన్నా, ఆభరణాల డిమాండ్ భారీగా కనిపించలేదు’ అని బొంబాయి బులియన్ అసోసియేషన్, మాజీ ప్రెసిడెంట్ సురేష్ హూండియా పేర్కొన్నారు. పసిడి, వెండి నాణేలకే అధిక డిమాండ్ కనపడిందని జీజేఎఫ్ చైర్మన్ జీవీ శ్రీధర్ చెప్పారు. మొత్తంగా గత ఏడాది తరహాలోనే ఇంచుమించు కొనుగోళ్ల పరిమాణం ఉంది. తక్కువ ధర ఉండడం కొనుగోళ్లకు ఊపునిచ్చిన పరిణామమని ఆయన పేర్కొన్నారు.
ధరల ధోరణి ఇదీ...
బొంబాయి బులియన్ స్పాట్ మార్కెట్‌లో పసిడి ధర 24, 22 క్యారెట్ల ధరలు సోమవారం వరుసగా... రూ.25,950, రూ.25,800గా ఉన్నాయి. ఇక వెండి ధర కేజీ రూ.35,980 పలికింది.
ఇంకా తగ్గుతుందనే...
10 గ్రాముల పసిడి ధర రూ.22,000 వరకూ పడిపోతుందన్న ఊహాగానం వల్ల భారీ ఆభరణాలకు పసిడి కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు. వెరసి పసిడి ఆభరణాల డిమాండ్ 30 శాతం వరకూ పడిపోతుందని భావిస్తున్నా. ఆభరణాలకు ఉన్న డిమాండ్‌ను నాణాల డిమాండ్ ఈ దఫా దాటిపోయింది.
- సంతోష్ శ్రీవాస్తవ, ఎండీ, సన్వీ జ్యూవెల్స్
అశోకచక్ర నాణేలకు డిమాండ్..
పర్వదినం సందర్భంగా కొనుగోళ్ల డిమాండ్ భారీగా ఉంది. అయితే ఆభరణాలకన్నా... పసిడి, వెండి నాణేలకు డిమాండ్ బాగా కనిపించింది. గత ఏడాది ధన్‌తేరస్‌తో పోల్చితే 25 శాతం పసిడి నాణేల అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది. వెండి నాణేల అమ్మకాలు రెట్టింపు కావచ్చు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 5వ తేదీన ఆవిష్కరించిన అశోకచక్ర నాణేలకు కూడా డిమాండ్ భారీగా ఉంది. నిజానికి గడచిన కొన్ని రోజుల నుంచే పసిడి, వెండి నాణేలకు డిమాండ్ ఉంది. భారీగా తగ్గిన ధరలే దీనికి కారణం.
- విపిన్ రైనా, ఎంఎంటీసీ-పీఏఎంపీ
ఇండియా ప్రెసిడెంట్ (మార్కెటింగ్)