సాక్షి, గుజరాత్ : ఓ పక్క బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతుంటే మరోపక్క డైమండ్ పరిశ్రమ రాను రాను సంక్షోభంలో కూరుకుపోతోంది. మరోసారి మాంద్యం పరిస్థితులు, అటు పరిశ్రమను, ఇటు కార్మికులను చుట్టుముడుతోంది. ప్రధానంగా సూరత్‌లోని వజ్రాల పరిశ్రమ మాంద్యం కారణంగా అత్యంత ఘోరమైన దశలను ఎదుర్కొంటోంది. ఆభరణ పరిశ్రమ రంగంలో సూరత్ భారత దేశానికి మార్గదర్శిగా ఉన్న విషయం తెలిసిందే. ఆర్థిక మాంద్యానికి తోడు డైమండ్ వ్యాపారుల స్కాంలు బ్యాంకులను భయపెడుతున్నాయి. డైమండ్ కింగ్, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ, జతిన్ మెహతాల కుంభకోణాల తరువాత బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. దీంతోపాటు నోట్ల రద్దు, జీఎస్‌టీ పరిశ్రమపై ప్రతికూలంగా ప్రభావితం చేశాయి. దీంతో డిమాండ్ తగ్గి భారీగా నష్టపోతున్న డైమండ్ వ్యాపారం దాదాపు మరణశయ్యపై కునారిల్లుతోంది.
ఇప్పటికే ఉద్యోగాన్నికోల్పోయిన సూరత్ వజ్రాల కార్మికుడు సుభాష్ మన్సూరియా స్పందిస్తూ తాను ఉద్యోగం వదిలి రెండు నెలలయిందని తన కుటుంబాన్ని ఎలా పోషించాలో అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఆరు సంవత్సరాలుగా ఇదే రంగాన్ని నమ్ముకున్న తనకు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదన్నారు. కనీసం తాను చేసిన పనికి సరైన వేతనం కూడా చెల్లించలేదని యూనియన్ల సహకారంతో తాను వేతనం పొందానని అన్నారు. ఇదంతా తమ దురదృష్టమని వాపోయారు. తేజస్ పటేల్ అనే మరో వజ్ర ఉద్యోగి మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా ఇదే రంగాన్ని నమ్ముకున్నానని అన్నారు. ప్రస్తుతం 18,000తో తన కుటుంబాన్ని పోషిస్తున్నానన్నారు. తాను పెద్దగా చదువుకోలేదని ఏ రంగంలో నైపుణ్యం లేదని భవిష్యత్ గురించి తలచుకుంటేనే భయమేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులు సంఘటితం కాకపోవడం బాధాకరమని తమ హక్కుల గురించి పోరాడే వారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా 60 వేల మంది ఉపాది కోల్పోగా కేవలం సూరత్ నుంచే13వేల మంది ఉండడం గమనార‍్హం. గత జనవరినుంచి చాలా కంపెనీల యజమానులు ఉద్యోగులను, పని గంటలను తగ్గించుకుంటున్నాయని చెప్పారు.
కఠిన పరీక్షలను ఎదుర్కొంటున్నాం
నీరవ్ మోడీ, చోక్సీ, జతిన్ మెహతాల అవినీతి ఆరోపణల కారణంగానే బ్యాంకులు వజ్ర పరిశ్రమకు రుణాలు ఇవ్వట్లేదని శ్రేయాన్ బిజినెస్ పేర్కొంది. అందుకే వజ్ర వ్యాపారాన్ని వృద్థిలోకి తీసుకురావడమే లక్ష్యంగా మూడు రోజుల ఎగ్జిబిషన్‌ను నిర్వహించామని సూరత్ డైమండ్ అసోసియేషన్ వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని డైమండ్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ రన్‌మల్ జిలారియా తెలిపారు. ఇప్పటికే 900 మందికి పైగా ఉద్యోగాలు కోల్పాయన్నారు. కంపెనీలు కనీసం నోటీసులు ఇవ్వకుండా తొలగిస్తున్నాయన్నారు. ఉపాధి కోల్పోయిన వారి వివరాలను సేకరిస్తున్నామని, ప్రభుత్వమే తమ ఉద్యోగాలకు రక్షణ కల్పించాలని కోరారు.
కాగా సూరత్‌లో భారీ, సూక్ష్మ స్థాయి పరిశ్రమలు వజ్రాల వ్యాపారంలో ప్రముఖంగా ఉండగా దాదాపు 6 లక్షల మందికిపైగా ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారు. గత పదేళ్ళ కాలంలో రెండవసారి మాంద్యం ముప్పు ముంచుకొస్తుండడం ఆందోళన పుట్టిస్తోంది. 2017 దీపావళి తరువాత, అనేక వజ్రాల పరిశ్రమలు పనిచేయడం మానేశాయి. వాటిలో 40 శాతం మూతపడ్డాయి. 2018లో సుమారు 750 మంది ఉద్యోగులను తొలగించారు. గుజరాత్ డైమండ్ వర్కర్స్ యూనియన్ లెక్కల ప్రకారం, 2018లో 10 మందికి పైగా డైమండ్ ఆభరణాల చేతివృత్తులవారు ఉద్యోగం కోల్పోయిన తరువాత ఆత్మహత్య చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment