యాభైవేల రూపాయలు... 60 ఏళ్లలో ఎంతవుతాయి? ఈ ప్రశ్నకు పెట్టుబడులపై ఎవరికున్న అవగాహన బట్టి వారు సమాధానమిస్తారు. కానీ ధీరూభాయ్ అంబానీ, ఆయన కుమారులు మాత్రం... దాన్ని కొన్ని లక్షల కోట్లు చేసి చూపించారు.. చేతల్లో!!. 60 ఏళ్ల కిందట రూ.50వేలతో ధీరూభాయ్ ఆరంభించిన రిలయన్స్ ట్రేడింగ్ కార్పొరేషన్... ఆ తరవాత రిలయన్స్ టెక్స్‌టైల్ కార్పొరేషన్‌గా... చివరికి రిలయన్స్ ఇండస్ట్రీస్‌గా మారి.. 1978లో స్టాక్ మార్కెట్లలో అడుగుపెట్టింది. ఇప్పటికి 40 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఇదిగో ఈ 40 ఏళ్ల ఉత్సవాల్లోనే ముకేశ్ అంబానీ తన తండ్రి సృష్టిని గుర్తుచేశారు. కానీ అప్పటి రిలయన్స్ ఇపుడు రెండు ముక్కలయి అన్నదమ్ములిద్దరి చేతుల్లోకి వచ్చింది. ముకేశ్ అంబానీ ఎన్ని విభాగాల్లో విస్తరించినా మొత్తం వ్యాపారాన్ని ఏకైక లిస్టెడ్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ పేరిటే కొనసాగిస్తున్నారు. తమ్ముడు అనిల్ మాత్రం వ్యాపారాలను విడదీసి... రిలయన్స్ క్యాపిటల్, హోమ్‌ఫైనాన్స్, పవర్, కమ్యూనికేషన్స్, ఇన్‌ఫ్రా... ఇలా రకరకాల లిస్టెడ్ కంపెనీలుగా కొనసాగిస్తున్నారు. చిత్రమేంటంటే... 2006 నాటి విభజన తరవాత ముకేశ్ సంపద ఎన్నో రెట్లు పెరిగింది. అనిల్ సంపదలో మెజారిటీ ఆవిరైపోయింది. ఆ వివరాలు చూస్తే...
సాక్షి, బిజినెస్ విభాగం : రిలయన్స్ గ్రూపు విభజన జరిగే నాటికి ముకేశ్, అనిల్ అంబానీల రెండు గ్రూపు సంస్థల విలువా దాదాపుగా చెరో రూ.లక్ష కోట్లుగా ఉంది. ఈ 11 ఏళ్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ ఆరు రెట్ల వృద్ధితో దాదాపు రూ.6 లక్షల కోట్లకు చేరగా... అనిల్ అంబానీ గ్రూపు కంపెనీలైన రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ ఇన్‌ఫ్రా, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఇతర సంస్థల ఉమ్మడి మార్కెట్ విలువ దారుణంగా క్షీణించి రూ.50వేల కోట్లకు పరిమితమైంది. అంతేకాదు!! అనిల్ రిలయన్స్ కమ్యూనికేషన్స్ బాండ్ల చెల్లింపుల్లో విఫలం కాగా, ముకేశ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ డాలర్ బాండ్లను అతి తక్కువ రేటుకు విక్రయించి చరిత్ర సృష్టించింది.
ఆర్‌కామ్ వల్లేనా!!
అనిల్ దుర్దశకు ప్రధాన కారకం రిలయన్స్ కమ్యూనికేషన్స్ అనే చెప్పాల్సి ఉంటుంది. 2010లో టెలికం రంగంలో 17% వాటాతో రెండో స్థానంలో ఉన్న ఈ కంపెనీ 2016కు వచ్చే సరికి 10% లోపు వాటాతో దిగువకు జారిపోయింది. పైపెచ్చు మార్కెట్ వాటా తగ్గటమే కాక... కంపెనీ రుణ భారమూ కొండలా పెరిగిపోయింది. 2009–10లో రూ.25,000 కోట్లుగా ఉన్న రుణాలిపుడు రూ.45వేల కోట్లయ్యాయి. ఈ అధిక రుణ భారమే ఒక విధంగా ఆర్‌కామ్ కొంప ముంచింది. ఇవేకాదు. అనిల్ గ్రూపులోని రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్‌ఫ్రా కంపెనీలూ అధిక రుణ భారంతో సతమతమవుతున్నవే. చివరికి ఆర్‌కామ్‌కు టెలికం, స్పెక్ట్రమ్, టవర్ ఆస్తులను అమ్మేసి వచ్చే ఏడాది మార్చికి రూ.25,000 కోట్ల మేర అప్పులు తీర్చనున్నట్టు అనిల్ తాజాగా ఓ ప్రకటన కూడా చేశారు. దీన్ని బట్టి అర్థమయ్యేదేమిటంటే... వ్యాపార వృద్ధి కోసం అప్పులు చేశారు. చివరికి వాటిని తీర్చటానికి ఆ వ్యాపారాలను విక్రయిస్తున్నారు. ఇది జరిగింది ఒక్క ఆర్‌కామ్ విషయంలోనే కాదు. గత కొన్ని సంవత్సరాల్లో మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్, సిమెంట్, రోడ్ల నిర్మాణం తదితర వ్యాపారాలను కూడా రుణ భారం తగ్గించుకోవటానికి అనిల్ విక్రయించారు. తాజాగా రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ముంబైలోని విద్యుత్ పంపిణీ వ్యాపారాన్ని అదానీ ట్రాన్స్‌మిషన్‌కు విక్రయించేందుకు ఒప్పందం చేసుకుంది కూడా. ఈ పరిణామాలన్నీ కలిసి అనిల్ వ్యాపారాల విలువను దారుణంగా కుదించేశాయి.
ముకేశ్‌కు కలిసొచ్చింది...
అనిల్‌కు భిన్నంగా ముకేశ్ అంబానీకి చేసిన వ్యాపారాలన్నీ దాదాపు కలిసొచ్చాయనే చెప్పాలి. రిటైల్ రంగంలోకి రిలయన్స్ దిగినపుడు అదంత ఈజీ కాదనుకున్నారు. కానీ ఆ రిటైల్‌ను నిత్యావసరాలతో పాటు దుస్తులు, ఫుట్‌వేర్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ఆభరణాలు.. ఇలా అన్ని రకాలకూ విస్తరించి రకరకాల ఫార్మాట్లు తెరిచారు. కేజీ బేసిన్లో కనుగొన్న కొత్త నిక్షేపాలతో పెట్రోలియం వ్యాపారం మరింత వృద్ధి చెందింది. పాలిమర్స్ బిజినెస్ షరామామూలే. తాజాగా ఆరంగేట్రం చేసిన జియో సైతం... పేమెంట్స్ బ్యాంక్, పేమెంట్స్ యాప్, న్యూస్, మూవీస్, ఫైబర్ ఇంటర్నెట్, గాడ్జెట్స్ తదితర రకరకాల ఫార్మాట్లకు అవకాశమిస్తోంది. టీవీ–18 నెట్‌వర్క్ కొనుగోలుతో మీడియాలోనూ సత్తా చాటారు ముకేశ్. ఇవన్నీ కలిసిరాబట్టే ఆర్‌ఐఎల్ విలువ అన్ని రెట్లు పెరిగింది మరి!!. మున్ముందు వీటిని విడదీస్తే వృద్ధికి ఆకాశమే హద్దని వేరే చెప్పనక్కర్లేదేమో!!
Comments
Please login to add a commentAdd a comment