సాక్షి, హైదరాబాద్: పదేళ్ల తర్వాత హైదరాబాద్ పట్టణం ఎలా ఉండబోతుందో ముందుగానే ఊహించాం. అప్పటి పరిస్థితులు, అవసరాలను తీర్చే ప్రాజెక్ట్‌ను నిర్మించాలనుకున్నాం. అందుకే ఒకే ప్రాజెక్ట్‌లో నివాస, వాణిజ్య సముదాయాలే కాకుండా కేజీ నుంచి పీజీ స్థాయి వరకు విద్యా సంస్థలు, ఆసుపత్రులు, షాపింగ్ మాళ్లు, ఐటీ, ఫార్మా వంటి అనేక రంగాల కార్యాలయాలు, ఇండోర్, అవుట్ డోర్ ఆట స్థలాలు, థీమ్ పార్క్ వంటివెన్నో కొలువుదీరే సరికొత్త సిటీని నిర్మించనున్నాం. దక్షిణ భారతదేశంలోనే తొలి స్మార్ట్ సిటీ అవార్డ్‌ను సొంతం చేసుకున్న డిస్కవరీ సిటీ ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ ప్రాజెక్ట్ వివరాలను రాంకీ ఎస్టేట్స్ అండ్ ఫామ్స్ లిమిటెడ్ జీఎం (సేల్స్, మార్కెటింగ్) కేవీ రాజ్‌నారాయన్ ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు.
ఇంకా ఏమన్నారంటే..
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేవలం 10 నిమిషాల ప్రయాణ దూరంలోనే ఉన్న మహేశ్వరం మండలంలోని శ్రీనగర్ అనే గ్రామంలో 600 ఎకరాల్లో డిస్కవరీ సిటీ ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ను నిర్మిస్తున్నాం. రూ.5 వేల కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న డిస్కవరీ సిటీ ప్రాజెక్ట్‌ను 4 ఫేజుల్లో పదేళ్ల లోపు పూర్తి చేస్తాం. ఫేజ్-1లో రూ. 300 కోట్ల పెట్టుబడితో 30 ఎకరాల్లో ‘గార్డెనియా గ్రూవ్ విల్లా’ను నిర్మిస్తున్నాం. ఇందులో విల్లాలు, ఫ్లాట్లలతో పాటు పాఠశాల కూడా ఉంటుంది. ఇప్పటికే 5 ఎకరాల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ పాఠశాల నడుస్తోంది.
గార్డెనియా గ్రూవ్‌లో మొత్తం 228 విల్లాలొస్తాయి. 200 గజాల నుంచి 300 గజాల విస్తీర్ణాల్లో ఉంటాయి. ధర రూ.57 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 2, 3 పడక గదుల ఫ్లాట్లు 400 నిర్మిస్తున్నాం. వీటి విస్తీర్ణం 730 చ.అ. నుంచి 1,800 చ.అ. మధ్య ఉంటుంది. సింగిల్ బెడ్‌రూమ్ ఫ్లాట్లు 150 వరకు నిర్మిస్తున్నాం. వీటి విస్తీర్ణం 350 చ.అ. నుంచి 550 చ.అ. మధ్య ఉంటుంది. ఇప్పటికే 32 విల్లాలు, 60 ఫ్లాట్లు విక్రయించేశాం.
పుణెలోని మగర్‌పట్టా, అహ్మదాబాద్‌లోని శాంతిగ్రామ్, చెన్నై, జైపూర్లలోని మహీంద్రా వరల్డ్ సిటీలతో పాటు దుబాయ్, కౌలాలంపూర్ వంటి విదేశాల్లోని స్మార్ట్ సిటీలను రెండేళ్ల పాటు క్షేత్ర స్థాయిలో క్షుణ్నంగా పరిశీలించాకే హైదరాబాద్‌లోనూ అలాంటి స్మార్ట్ సిటీని నిర్మించేందుకు ముందుకొచ్చాం. విమానాశ్రయం చుట్టూ కనీసం 25 కి.మీ. వరకు అభివృద్ధి అనేది ఎల్లవేళలా ఉంటుంది. అందుకే శ్రీనగర్ ప్రాంతాన్ని ఎంచుకున్నాం. ప్రాజెక్ట్ వెనుక భాగంలో 3 వేల ఎకరాల్లో కొంగరకలాన్ రిజర్వ్ ఫారెస్ట్ ఉండటం కలిసొచ్చే అంశం. ఎందుకంటే చుట్టూ చక్కని ప్రకృతి, పుష్కలమైన నీటి వనరులు ప్రాజెక్ట్ సొంతం. డిస్కవరీ సిటీ ప్రాజెక్ట్‌లో ఎకరం, అర ఎకరం విస్తీర్ణంలో కూడా విల్లాలను నిర్మిస్తున్నాం. అయితే ఇవి ఫేజ్-4లో వస్తాయి.
రూ.5 వేల కోట్లతో ‘డిస్కవరీ సిటీ’
Published Sat, Apr 19 2014 2:05 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement