రేటింగ్ ఏజెన్సీలపై ఆధారపడొద్దు
ముంబై: పెట్టుబడులకు పోర్ట్‌ఫోలియోలను ఎంపిక చేసుకునేటప్పుడు పూర్తిగా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు ఇచ్చిన గ్రేడింగ్‌లపై ఆధారపడకుండా రిస్కులను సొంతంగా మదింపు చేయాలని మ్యూచువల్ ఫండ్ సంస్థలకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ యూకే సిన్హా సూచించారు. ఇందుకోసం తగిన వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. ఎక్సెలెన్స్ ఎనేబ్లర్స్ సంస్థ కార్పొరేట్ గవర్నెన్స్‌పై ఏర్పాటు చేసిన సెమినార్‌లో పాల్గొన్న సందర్భంగా విలేకరులతో ఆయన ఈ విషయాలు తెలిపారు.
వివిధ పెట్టుబడి సాధనాలను ఫండ్ సంస్థలు సొంతంగా పరిశోధించాలన్నారు. అలాగే ఏయే రంగాల సంస్థల్లో ఎంత ఎంత పెట్టుబడులు పెట్టవచ్చన్న పరిమితులకు సంబంధించి మరిన్ని మార్గదర్శకాలు త్వరలో విడుదల చేయనున్నట్లు సిన్హా పేర్కొన్నారు. మరోవైపు స్టాక్ ఎక్స్చేంజీల లిస్టింగ్ అంశంలో ఎదురవుతున్న కొన్ని సమస్యలను పరిష్కరించి త్వరలో మార్గదర్శకాలు ప్రకటించగలమని సిన్హా చెప్పారు.
కార్పొరేట్ గవర్నెన్స్‌పై ఆందోళన వద్దు
కంపెనీలు కార్పొరేట్ గవర్నెన్స్‌ను అంశాన్ని ప్రభుత్వం తమపై బలవంతంగా రుద్దుతోందని భావించరాదని సిన్హా చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఈ విధానాలు అమలవుతూనే ఉన్నాయన్నారు.
ఆర్థిక ఫలితాల వెల్లడికి మార్గదర్శకాలు..
డెట్ సెక్యూరిటీలు, నాన్ క్యుములేటివ్ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్లు మొదలైన వాటిని లిస్ట్ చేసిన కంపెనీలు తమ ఆర్థిక ఫలితాలను వెల్లడించడానికి నిర్దిష్ట ఫార్మాట్‌ను సెబీ విడుదల చేసింది. ఈ లిస్టెడ్ కంపెనీలు క్రితం సంవత్సరంతో పోలుస్తూ నికర అమ్మకాలు, లాభాలు తదితర వివరాలతో అర్థ సంవత్సర ఫలితాలను సమర్పించాల్సి ఉంటుంది.
బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు తమ మొండి బకాయిలు, క్యాపిటల్ అడిక్వసీ నిష్పత్తి తదితర వివరాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఇవి తోడ్పతాయని సర్క్యులర్‌లో తెలిపింది.