డ్రైవర్లెస్ కార్లు రయ్! | driver less car special story | Sakshi
Sakshi News home page

డ్రైవర్లెస్ కార్లు రయ్!

Published Fri, Aug 26 2016 12:20 AM | Last Updated on Mon, Sep 4 2017 10:52 AM

డ్రైవర్లెస్ కార్లు రయ్!

డ్రైవర్లెస్ కార్లు రయ్!

సింగపూర్‌లో వీటితో ప్రయోగాత్మక ట్యాక్సీ సేవలు షురూ
అమెరికాలో ప్రారంభానికి ఉబెర్ సన్నాహాలు   
రేసులో గూగుల్, ఫోర్డ్, జీఎం, యాపిల్, టెస్లా
2021 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి!     
హై సైబర్ సెక్యూరిటీ ముఖ్యమంటున్న నిపుణులు

మనకు ట్రాన్స్‌ఫార్మర్స్ సినిమా గుర్తుండే ఉంటుంది. అది పిల్లలతోపాటు పెద్దలను కూడా విపరీతంగా ఆకర్షించింది. ఇందులో కార్లు కార్లు మాట్లాడుకుంటాయి. అలాంటి పరిస్థితే ఇప్పుడు నిజజీవితంలో మనకు ఎదురు కాబోతుంది. వచ్చే ఐదేళ్లలో డ్రైవర్ల అవసరం లేకుండానే కార్లు మనల్ని గమ్యస్థానాలకు చేర్చబోతున్నాయి. పలు పెద్ద పెద్ద కంపెనీలు డ్రైవర్‌లెస్ కార్ల అభివృద్ధికి ఎప్పటి నుంచో కృషి చేస్తున్నాయి. ఆ కంపెనీల్లో మనకుముందుగా గుర్తొచ్చే పేరు గూగుల్. ఇదే మొదటిగా డ్రైవర్‌లెస్ కార్ల తయారీకి శ్రీకారం చుట్టింది. తర్వాత టెస్లా మోటార్స్, జీఎం, ఫోర్డ్ వంటి కంపెనీలు గూగుల్‌ను అనుసరించాయి. ఇప్పుడు ఉబెర్ వీటికి జత కలిసింది. దీంతో కంపెనీల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. కాగా న్యూటానమీ అనే స్టార్టప్ గురువారం డ్రైవర్‌లెస్ కార్ల ట్యాక్సీ సర్వీసులను సింగపూర్‌లో ట్రయల్స్ విధానంలో ప్రారంభించింది.

అమెరికాలో ఉబెర్ సెల్ఫ్‌డ్రైవింగ్ రైడ్స్
రైడ్ షేరింగ్ సర్వీసెస్ సంస్థ ఉబెర్ ప్రయాణికుల రవాణా కోసం కొన్ని వారాల్లో సెల్ఫ్‌డ్రైవింగ్ కార్లను ఉపయోగించనున్నది. ఈ సేవలను తొలిగా అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో ప్రారంభించనున్నది. తర్వాత వీటిని ఇతర ప్రాంతాలకు విస్తరించన్నుది. ఇక్కడ అత్యవసర పరిస్థితులను నియంత్రించడానికి కారులో ఒక డ్రైవర్ కూడా ఉంటాడు. కాగా ఉబెర్ 2021 నాటికి పూర్తిస్థాయి అటానమస్ కార్లను మార్కెట్‌లోకి తెచ్చే అవకాశముంది. డ్రైవర్‌లెస్ కార్ల అభివృద్ధి, తయారీకి స్వీడన్ కార్ల  కంపెనీ వోల్వోతో కలిసి 300 బిలియన్ డాలర్ల డీల్‌కు తెరలేపింది.

 గూగుల్, ఫోర్డ్, జీఎం, యాపిల్, టెస్లా...
గూగుల్ 2009 నుంచి అటానమస్ కార్లను రోడ్లపై ప్రయోగాత్మకంగా తిప్పుతూనే ఉంది. ప్రస్తుతం ఇది బ్రేక్ పెడల్స్, స్టీరింగ్ ఉండని కార్లపై పరీక్షలు నిర్వహిస్తోంది. ఇది తన సాఫ్ట్‌వేర్‌ను ఇతర వాహన తయారీ కంపెనీలకు విక్రయించుకోవచ్చు లేదా షేర్ రైడింగ్ సంస్థలతో జతకట్టొచ్చు.

ఉబెర్ లాగానే సెల్ఫ్‌డ్రైవింగ్ ట్యాక్సీ సర్వీసులను వచ్చే ఏడాది ప్రారంభించడానికి జీఎం ప్రయత్నిస్తోంది. ఇది ప్రస్తుతం శాన్‌ఫ్రాన్సిక్సో, ఆరిజోనాల్లో వంటి ప్రాంతాల్లో అటానమస్ షెవర్లే బోల్ట్ కారును పరీక్షిస్తోంది.

మెర్సిడెస్ కూడా డ్రైవర్‌లెస్ కార్ల తయారీలో నిమగ్నమైంది.

రైడ్ షేరింగ్ సర్వీసుల ద్వారా పూర్తి స్థాయి అటానమస్ వెహికల్స్‌ను 2021 నాటికల్లా మార్కెట్‌లోకి తీసుకొస్తామని ఫోర్డ్ ప్రకటించింది.

ఇక టెస్లా కూడా అటానమస్ కార్ల అభివృద్ధికి తీవ్రంగా కృషి చేస్తోంది. ఇది ఇటీవలే (మే నెలలో) డ్రైవర్‌లెస్ కార్లపై పరీక్షలు నిర్వహించింది. కానీ అందులో ప్రమాదం జరిగి డ్రైవర్ మరణించారు.

యాపిల్ కూడా డ్రైవర్‌లెస్ కార్ల అభివృద్ధికి ప్రయత్నిస్తోంది. ఇది ఇప్పటికే కొన్ని వందల మంది ఇంజినీర్లకు టైటాన్ ప్రాజెక్టులో భాగంగా నియమించుకుంది.

టయోటా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, ఎంఐటీ, డెల్ఫి ఆటోమోటివ్, కాంటినెంటల్, సౌత్‌వెస్ట్ రీసెర్చ్, బైదూ వంటి సంస్థలు కూడా డ్రైవర్‌లెస్ కార్ల ఏర్పాటుకు నియామకాలను చేపట్టాయి.
600 బిలియన్ గంటలు వాహనాల్లోనే
కాలం విలువైంది. సమయానికి అత్యంత ప్రాధాన్యమిస్తోన్న ఈ కాలంలో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు మంచి ఆదరణ లభిస్తుందని విశ్లేషకుల మాట. ప్రస్తుతం జనాలు వాహనాల్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ప్యాసెంజర్ వాహనాలు వార్షికంగా 10 ట్రిలియన్ మైళ్ల దూరం ప్రయాణిస్తున్నాయని అంచనా. వీటి సగటు వేగం గంటకు 40 కిలోమీటర్లుగా ఉంది. అలాగే ప్రజలు 600 బిలియన్ గంటలు వాహనాల్లోనే గడిపేస్తున్నారు. డ్రైవర్‌లెస్/అటానమస్ వెహికల్స్ సర్వీస్ ప్రొవైడర్లు, తయారీదారులు ఈ సమయాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారని సైబర్‌మీడియా రీసెర్చ్ హెడ్, సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ థామస్ జార్జ్ తెలిపారు.

డేటా ప్రధానం..
ఏ అటానమస్ వెహికల్‌కు అయినా డేటా ప్రధానమని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) రీసెర్చ్ మేనేజర్ (ఎంటర్‌ప్రైజ్) గౌరవ్ శర్మ అభిప్రాయపడ్డారు. దీంతో సురక్షితమైన సులభమైన ప్రయాణం సాధ్యమౌతుందన్నారు. సమాచారాన్ని స్వీకరించి, ప్రాసెసింగ్  చేసుకొని, దీని ద్వారా ఇతర భాగాలను నియంత్రించడం క్లిష్టమైన ప్రక్రియని వివరించారు. డ్రైవర్‌లెస్ కార్లు విజయవంతమవ్వాలంటే.. చట్టాలు, నిబంధనలు, నియంత్రణలు, ట్రాఫిక్ సిస్టమ్, ఇన్‌ఫ్రా, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్స్, మాన్యుఫాక్చరింగ్, డేటా అండ్ ఇన్‌ఫర్మేషన్ నిర్వహణ, ప్రాసెసింగ్ వ్యవస్థ వంటి అంశాలు వేగంగా మారాల్సి ఉందని పేర్కొన్నారు. భారత్‌లో చాలా మందికి వాహన రంగం ఉపాధిని కల్పిస్తోందని, వారు కూడా కొత్త టెక్నాలజీకి అలవాటు పడాల్సి ఉంటుందని,  నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సి ఉందన్నారు. వచ్చే దశాబ్ద కాలంలో డ్రైవర్‌లెస్ కార్లు జనాలకు సుపరిచితం కావొచ్చన్నారు.

హ్యాక్ అయితే అంతే!
ఆటోమెటిక్, సెల్ఫ్‌డ్రైవింగ్ కార్లు హ్యాకింగ్‌కు గురైతే సంభవించే పరిణామాలు మామూలుగా ఉండబోవని నిపుణులు పేర్కొన్నారు. చాలా అనర్థాలను ఎదుర్కోవలసి వస్తుందన్నారు. డ్రైవర్‌లెస్ కార్లను తయారుచేసే వారు హై సెక్యూరిటీ, సైబర్ భద్రతలకు అధిక ప్రాధాన్యమివ్వాలని సూచించారు. టెస్లా/గూగుల్ కార్ల ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఇవీ ప్రయోజనాలు...
పార్కింగ్ సమస్యను తప్పించుకోవచ్చు.
కంపెనీలు భద్రతకు అధిక ప్రాధాన్యంఇస్తున్నాయి.
సాధారణంగా డ్రైవర్లకు వేతనాలు ఇవ్వాలి. ఇక్కడ వాటితో పని ఉండదు. అలాగే వారు 24 గంటలూ పనిచేయరు. ఇవి అలా కాదు. వీటిల్లో ఎప్పుడైనా.. ఎక్కడికైనా వెళ్లొచ్చు.
పిల్లలను స్కూళ్లకు పంపొచ్చు. పిక్‌అప్ చేసుకోవచ్చు. మనం ఆఫీస్‌కు రావొచ్చు. ఇంట్లోని అందరూ ఒకే కారును వాడొచ్చు.
కంపెనీలు వారి స్టాఫ్, ఉద్యోగుల రవాణాకు వాటిని వినియోగించుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement