‘ఈజీ కమ్యూట్’తో హ్యాపీ ప్రయాణం | easy commute services in hyderabad | Sakshi
Sakshi News home page

‘ఈజీ కమ్యూట్’తో హ్యాపీ ప్రయాణం

Published Sat, Apr 2 2016 1:19 AM | Last Updated on Sun, Sep 3 2017 9:01 PM

‘ఈజీ కమ్యూట్’తో హ్యాపీ ప్రయాణం

‘ఈజీ కమ్యూట్’తో హ్యాపీ ప్రయాణం

ఉద్యోగుల కోసం హైదరాబాద్‌లో ఏసీ బస్ సర్వీసులు
జీపీఆర్‌ఎస్ వాహనాలు, ఏసీ, ఉచిత వైఫై కూడా..
ఈ ఏడాది చివరి నాటికి ముంబై,
బెంగళూరుకు విస్తరణ
రూ.50 లక్షల నిధుల సమీకరణపై దృష్టి
‘సాక్షి స్టార్టప్ డైరీ’తో ఈజీ కమ్యూట్ కో-ఫౌండర్ రాహుల్ జైన్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : హైదరాబాద్‌లో ప్రయాణం.. అది కూడా బస్సులో అంటే మాములు విషయం కాదు. బస్సు ఎప్పుడొస్తుందో తెలియదు. వచ్చినా సీటు దొరుకుతుందన్న గ్యారంటీ లేదు! పోనీ ఆటోలో వెళదామంటే మీటర్ పేరుతో జేబుగుల్ల! బైక్ మీదో కారులోనో వెళదామంటే ట్రాఫిక్ చిక్కులు!!

 ఈ కష్టాలన్నీ నగరవాసులకు నిత్యం ఎదురయ్యేవే. వీటి నుంచి బయటపడేయడానికి వచ్చిన స్టార్టప్ కంపెనీయే... ఈజీ కమ్యూట్. ఇంట్రా సిటీ ఏసీ బస్ సర్వీసెస్‌లను అందిస్తున్న ఈ స్టార్టప్ సేవల గురించి క్లుప్తంగా చెప్పాలంటే.. జీపీఆర్‌ఎస్‌తో వాహనం ఎప్పుడొస్తుందో తెలుసుకునే వీలు.. సౌకర్యవంతమైన సీటు, ఫుల్లీ లోడెడ్ ఏసీతో పాటూ ఉచిత వైఫై!! ఉద్యోగ రీత్యా కొన్నేళ్ల పాటు స్వయంగా ఎదుర్కొన్న ప్రయాణ కష్టాలే ఈజీ కమ్యూట్ స్టార్టప్ స్థాపనకు కారణమంటున్నారు సంస్థ సహ వ్యవస్థాపకుడు రాహుల్ జైన్. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే..

 నా స్వస్థలం బెంగళూరు. ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డా. హైటెక్‌సిటీలో కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్‌గా పనిచేసేవాణ్ణి. లింగంపల్లిలోని కొత్తగూడలో నివాసం. ఇంటి నుంచి ఆఫీసుకు రోజూ 15 కి.మీ. ప్రయాణం. దీనికోసం అష్టకష్టాలు పడేవాణ్ణి. లింగంపల్లి నుంచి ఆల్విన్ చౌరస్తా వరకు షేర్ ఆటోలో ప్రయాణం. అది కూడా డ్రైవర్ పక్కన కడ్డీలకు ఆనుకొను వేలాడుతూ!!. ఆ వేలాడే ప్రయాణం ఎంత కష్టమో మాటల్లో చెప్పలేం. సీటులో ఇమడలేక శరీరం పిప్పి అయ్యేది. దాని తాలుకు ప్రభావం ఆఫీసు పనిపై పడేది. ఇలా మూడేళ్లు ప్రయాణ నరకం అనుభవించా. ఓ రోజు టెక్నాలజీ మీటప్‌లో భాగంగా ట్రిపుల్ ఐటీ విద్యార్థి మయాంక్ చావ్లాను కలిశా. మా ఇద్దరికీ ఎదురైన కామన్ సమస్య.. ప్రయాణ కష్టాలే. దీనికి టెక్నాలజీతో పరిష్కారం చూపించాలనుకున్నాం. ఇంకేముంది రూ.10 లక్షల పెట్టుబడితో 2015 అక్టోబర్‌లో మొబైల్ ఆధారిత ఇంట్రా సిటీ ఏసీ బస్ సర్వీసెస్ సేవలైన ఈజీ కమ్యూట్‌ను ప్రారంభించాం.

 ఎలా వినియోగించుకోవాలంటే..
ఈజీ కమ్యూట్ సేవల్ని మూడు స్టెప్పులో వినియోగించుకోవచ్చు. ముందుగా అందుబాటులో ఉన్న రూట్లలో పికప్ మరియు డ్రాప్‌ల స్థానాన్ని ఎంచుకోవాలి. తర్వాత  సమయాన్ని, సీట్‌ను నిర్ధారించుకోవాలి. ఆ తర్వాత యూజర్ తన ఈ-వ్యాలెట్ నుంచి డబ్బులు చెల్లిస్తే సరి. వెంటనే యూజర్‌కు బుకింగ్ ఐడీ, సీట్, వాహనం నంబర్, సమయం ఎస్‌ఎంఎస్ రూపంలో వస్తాయి. వాహనం బయలుదేరిన సమయం? ప్రస్తుతం ఎక్కడుంది? నిర్ధారిత స్థానానికి ఎప్పుడొస్తుంది? గమ్యస్థానానికి ఎప్పుడు చేరుకుంటుంది? వంటి విషయాల్ని జీపీఆర్‌ఎస్ ఆధారంగా యూజర్ తన మొబైల్ నుంచే తెలుసుకోవచ్చు కూడా.

 కి.మీ.కు రూ.3-5 చార్జీ..
ప్రస్తుతం ఉదయం 14, సాయంత్రం 10 రూట్లలో మొత్తం 24 రూట్లలో ప్రయాణ సేవలందిస్తున్నాం. సంబంధిత రూట్లలో కొన్ని.. ఎల్బీనగర్, ఈసీఐఎల్, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్, రాంనగర్, రామాంతపూర్, ప్రగతినగర్, నిజాంపేట్, నాగోల్, కొండాపూర్, ఏఎస్‌రావ్ నగర్, మారెడ్‌పల్లి, మాదాపూర్ ఉన్నాయి. ప్రస్తుతం 8,000 రిజిస్టర్ యూజర్లున్నారు. రోజుకు 210 మంది మా సేవల్ని వినియోగించుకుంటున్నారు. కి.మీ.కు రూ.3-5 చార్జీ ఉంటుంది. మొత్తంగా ఒక వైపు ప్రయాణానికి రూ.40-80 అవుతుంది. ఈజీ కమ్యూట్ ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో చెప్పేందుకు గాను రెండు సార్లు ఉచిత ప్రయాణాన్ని కూడా అందిస్తున్నాం.

 రూ.50 లక్షల నిధుల సమీకరణ..
వాహనాల కోసం పలువురితో ఒప్పందాలు చేసుకున్నాం. టెంపో ట్రావెలర్, వింగర్, జైలో, ఇన్నోవా, టవేరా మొత్తం 14 వాహనాలున్నాయి. వీటి సీటింగ్ సామర్థ్యం 210. వాహన ఓనర్లకు కి.మీ.కు రూ.2-4 మధ్య కమీషన్ రూపంలో చెల్లిస్తాం. 2 నెలల్లో యూజర్ల సంఖ్యను 20 వేలకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ‘‘ప్రస్తుతం నెలకు రూ.2 కోట్ల వ్యాపారాన్ని చేస్తున్నాం. ఈ ఏడాది ముగింపు లోగా బెంగళూరు, ముంబైల్లోనూ సేవల్ని విస్తరించనున్నాం. ఇందుకుగాను తొలిసారిగా నిధుల సమీకరణ చేయనున్నాం. సీడ్ రౌండ్‌లో భాగంగా రూ.50 లక్షల పెట్టుబడులు పెట్టేందుకు పలువురు ఏంజెల్ ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉన్నారు. మరో 2-3 నెలల్లో డీల్‌ను పూర్తి చేస్తాం.

అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే
startups@sakshi.com కు మెయిల్ చేయండి...

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement