శనివారాలు బ్యాంకులు మూత నిజమేనా?
చెన్నై : బ్యాంకులకు జూన్ ఒకటవ తేదీ నుంచి ఐదు పనిదినాలు మాత్రమే ఉండనున్నాయని, ప్రతి శనివారం బ్యాంకులకు సెలవని ఇటీవల వాట్సాప్లో ఓ మెసేజ్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించి ఇప్పటిదాకా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదట. ఇది కేవలం తప్పుదోవ పట్టించే మెసేజ్ మాత్రమేనని వెల్లడవుతోంది.
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇటీవల విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా డీమానిటైజేషన్ తర్వాత నగదు విషయంలో, మిగతా ఆదేశాల విషయంలో ఆర్బీఐ ప్రకటించకున్నా.. కొన్ని మెసేజ్ లు ప్రజల్లో భయాందోళన రేపుతూ పంపుతున్నారు. ప్రజలకు భయాందోళన కలిగించే మెసేజ్ లు పంపే ముందు ఒక్కసారి రిజర్వు బ్యాంకు అధికారిక ప్రకటనను చెక్ చేసుకోవాలని వాదనలు వినిపిస్తున్నాయి. బ్యాంకులు కేవలం రెండో, నాలుగో శనివారం మాత్రమే సెలవు దినాలను పాటించనున్నాయి. 2015 ఆగస్టు నుంచి బ్యాంకులు ఈ సెలవును పాటిస్తున్నాయి.