బ్యాంకులకు వరుస సెలవులు లేవు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్థిక సంవత్సరం చివర్లో బ్యాంకులకు వరుసగా నాలుగు రోజులు సెలవులు అని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని బ్యాంకు అధికారులు ప్రకటించారు. హోళీ (మార్చి 24), గుడ్‌ఫ్రైడే (మార్చి 25), నాల్గవ శనివారం, ఆదివారం వరుసగా రావడంతో నాలుగు రోజులు బ్యాంకులు పనిచేయవని వాట్సప్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం తెలుగు రాష్ట్రాలకు వర్తించదని స్థానిక బ్యాంకు అధికారులు స్పష్టం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో హోళీ సెలవును మార్చి 23 (మహారాష్ట్రలో 24)గా స్థానిక ప్రభుత్వాలు ప్రకటించాయి.
అలాగే గుడ్‌ఫ్రైడేకి ఈ రెండు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు లేవు. దీంతో ఈ వారంలో మధ్యలో ఒకరోజు (మార్చి 23) తప్ప వరుస సెలవులు లేవని, ఖాతాదారులు ఆందోళన చెందనవసరం లేదని బ్యాంకు అధికారులు తెలిపారు. వచ్చే నెలల్లో కూడా సెలవులు అధికంగా ఉన్నాయి కానీ వరుస సెలవులు లేవన్నారు. వచ్చే నెలల్లో శని, ఆదివారాలతో కలుపుకొని సుమారు పది రోజులు బ్యాంకులకు సెలవులున్నాయి. మార్చి నెలాఖరు, అధిక సెలవులను దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గట్లుగా ఏటీఎంలలో అధిక నగదు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు బ్యాంకు ఉన్నతాధికారులు వివరించారు.