శనివారాల్లో సెలవు లేదు
భారీ వర్షాల వల్ల విద్యాసంస్థలు ప్రకటించిన సెలవులను ఎంజాయ్ చేసిన విద్యార్థులకు చేదు మాత్ర. పని దినాలను భర్తీ చేసేందుకు ఇకపై వారాంతపు సెలవు దినాలను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై ప్రతి శనివారం విద్యాసంస్థలు పనిచేస్తాయని ప్రకటించింది.
చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాల ప్రభావం చెన్నైలో ప్రారంభమై జిల్లాలకు ఎగబాకి తీవ్రరూపం దాల్చింది. సముద్ర తీర, డెల్టా జిల్లాల్లో వారం రోజులుగా ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, విళుపురం, దిండుగల్లు తదితర జిల్లాల్లో విద్యాసంస్థలకు వరుసగా సెలవులు ప్రకటించేశారు. ఈ సెలవు దినాలను పని దినాలుగా మారిస్తే గానీ విద్యార్థుల పాఠ్యాంశాల పోర్షన్ పూర్తికాదని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. విద్యాశాఖ పరిధిలో పనిచేసే ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు ఏడాదికి 220 పని దినాలు, ఉన్నత, మహోన్నత పాఠశాలలకు ఏడాదికి 210 పని దినాలుగా ఉన్నాయన్నారు. వర్షాల కాలంలో సహజంగా సెలవులు ప్రకటిస్తారు, అయితే ఈ సారి ఎక్కువగా సెలవులు మంజూరు చేసినట్లు భావిస్తున్నారు. ఈ కారణంగా శనివారం సైతం విద్యాసంస్థలు పనిచేయక తప్పదని ఉన్నతాధికారులు సూచించారు. అయితే అయా విద్యాసంస్థల పరిస్థితులను బట్టి ఈ విషయంపై నిర్ణయం తీసుకోవచ్చని ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లకు వెసులుబాటు కల్పించారు.