
బడ్జెట్ రోజు మరింత అప్రమత్తం
బడ్జెట్ సందర్భంగా నేడు(శనివారం) స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల్లో ప్రత్యేక ట్రేడింగ్ జరుగుతోంది.
- స్టాక్ మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులకు అవకాశం
- మరింత పటిష్టంగా నిఘా వ్యవస్థ
న్యూఢిల్లీ: బడ్జెట్ సందర్భంగా నేడు(శనివారం) స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల్లో ప్రత్యేక ట్రేడింగ్ జరుగుతోంది. ఈ ప్రత్యేక ట్రేడింగ్‌లో తీవ్రమైన ఒడిదుడుకులు ఉండొచ్చన్న అంచనాలతో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ, స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు మరింత అప్రమత్తంగా వ్యవహరించనున్నాయి. లావాదేవీలు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ఉన్నతాధికారొకరు చెప్పారు.
బడ్జెట్ అంచనాలను అవకాశాలుగా తీసుకొని కొంతమంది ట్రేడర్లు మోసపూరితంగా వ్యవహరిస్తారేమోన్న అంచనాలతో నిఘా వ్యవస్థను పటిష్టం చేశామని పేర్కొన్నారు. విదేశీ ఇన్వెస్టర్లతో సహా పలు దేశీయ సంస్థలు ట్రేడింగ్‌లో పాల్గొంటాయని, భారీ టర్నోవర్ నమోదు కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఎలాంటి అకస్మాత్తు ఒడిదుడుకునైనా ఎదుర్కొనేలా సిస్టమ్‌లను, మౌలిక సదుపాయాలను అప్రమత్తం చేసుకోవాలని వివిధ మార్కెట్ సంస్థలకు ఆదేశాలు జారీ అయ్యాయి. మార్కెట్లో తీవ్రమైన ఒడిదుడుకులుంటాయనే అంచనాలతో ట్రేడింగ్ మార్జిన్‌ను పెంచుతున్నామని పలువురు బ్రోకర్లు ఇప్పటికే తమ తమ క్లయింట్లకు సమాచారమందించారు. విదేశాల్లో శనివారం స్టాక్ మార్కెట్లు సెలవు కాబట్టి, పలువురు విదేశీ ఇన్వెస్టర్లు నేరుగా ట్రేడింగ్‌లో పాల్గొనే అవకాశాలున్నాయి.