
సాక్షి, ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకులో కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారులు నీరవ్ మోదీ, అతని మామ మెహుల్ చోక్సీలను స్వదేశానికి రప్పించేందుకు దర్యాప్తు సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో అనారోగ్య కారణాలతో విచారణకు రాలేనంటూ కుంటిసాకులు చెబుతూ వస్తున్న చోక్సీకి షాకిచ్చేలా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక నిర్ణయం తీసుకుంది. విచారణను ఆలస్యం చేసే ఉద్దేశంతో కావాలనే సాకులు చెబుతున్నాడని, చోక్సీకి వ్యతిరేకంగా నాన్ బెయిల్‌బుల్, రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఈడీ ముంబై కోర్టును కోరింది. దర్యాప్తునకు సహకరించకుండా, భారతదేశాని తిరిగి రావడానికి నిరాకరిస్తున్నాడని సీబీఐ, ఈడీ ఆరోపించాయి. ఈ నేపథ్యంలో పరారీలో ఉన్న చోక్సీ అభ్యర్థనను కొట్టివేయాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో పీఎన్‌బీ స్కాం విచారణను ఆంటిగ్వాలో జరపాలంటూ మెహుల్ చోక్సీ పెట్టుకున్న విజ్ఞప్తిని ఈడీ శనివారం తిరస్కరించింది.
అలాగే ఆంటిగ్వా నుండి చోక్సిని తిరిగి భారతదేశానికి తీసుకురావడానికి వైద్య నిపుణులతో ఎయిర్ అంబులెన్స్‌ను అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. దేశంలో అవసరమైన అన్ని వైద్య చికిత్సలను అందుబాటులో ఉంచుతామని కూడా ఇడి కోర్టుకు తెలియజేసింది. ఈ మేరకు ముంబై కోర్టులో కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. అనారోగ్య కారణం పేరుతో చట్టపరమైన చర్యలను ఆలస్యం చేస్తూ, కోర్టును తప్పుదోవ పటిస్తున్నాడని చోక్సీ పై ఈడీ మండిపడింది. భారతదేశం తిరిగి వచ్చేలా అఫిడవిట్ దాఖలు చేయాలని చోక్సీని ఆదేశించాలని కోర్టును కోరింది. అతను తిరిగి రావడానికి ఖచ్చితమైన తేదీని పేర్కొనాలని ఈడీ కోరింది. ఆర్డర్ ఇచ్చిన తేదీ నుండి ఒక నెలలోపు రావాలని పేర్కొంది. కాగా నకిలీ పత్రాలతో పీఎన్‌బీలో 14వేల కోట్ల రూపాయల మేర రుణాలను తీసుకొని ఎగ్గొట్టి నీరవ్‌మోదీ లండన్‌కు పారిపోగా, మెహుల్ చోక్సీ ఆంటిగ్వాకు చెక్కేసి అక్కడి పౌరసత్వం తీసుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment