
ముంబై: షేరు పతనం కారణంగా ఇన్వెస్టర్లకు భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తుండటంపై జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపక చైర్మన్ నరేష్ గోయల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి తనకు ’సంకటంగా మారిందని, అపరాధ భావన’ కలిగిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. కంపెనీ వార్షిక సర్వ సభ్య సమావేశంలో షేర్‌హోల్డర్లను ఉద్దేశించి ప్రసంగించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘చాలా మంది షేర్‌హోల్డర్లు నష్టపోయారు. ఏదో అపరాధం చేసిన భావన తొలిచేస్తోంది. ఈ పరిస్థితి ఇబ్బందికరంగాను .. సంకటంగాను ఉంది‘ అని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి 5న 52 వారాల గరిష్ట స్థాయి రూ. 883.65 వద్ద ట్రేడయిన జెట్ ఎయిర్‌వేస్ షేరు ఏకంగా 67.5 శాతం పతనమైంది.
గురువారం ఇంట్రాడేలో ఏడాది కనిష్ట స్థాయి రూ. 286.10 వద్దకు పడిపోయింది. ఈ నేపథ్యంలో గోయల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఒకవైపు పోటీ తీవ్రతరమైందని, మరోవైపు ఇంధన ధరలు పెరుగుతుండటం కంపెనీ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని గోయల్ చెప్పారు. సంస్థ ఆర్థిక పరిస్థితి దిగజారడం, ఉద్యోగుల జీతాల్లో కోత ప్రతిపాదనలు వంటి అంశాలపై స్పందిస్తూ.. కంపెనీపై ప్రజల్లో ఉన్న దురభిప్రాయాన్ని తొలగించేందుకు ప్రత్యేకంగా కొత్త కమిటీని ఏర్పాటు చేసినట్లు గోయల్ తెలిపారు. ఈ కమిటీ సమావేశాలకు జెట్ ఎయిర్‌వేస్ డైరెక్టర్లయిన నసీమ్ జైదీ, అశోక్ చావ్లా సారథ్యం వహిస్తారని ఆయన చెప్పారు. కాగా, క్యూ1 ఫలితాలను కంపెనీ వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment