
ముంబై: నూతన సంవత్సరం తొలి నెలలో ఉద్యోగ నియామకాలు ఊపందుకున్నాయి. క్రితం ఏడాది ఇదే నెలలో ఉన్న గణాంకాలతో పోల్చి చూస్తే 2019 జనవరిలో ఉద్యోగ నియామకాలు 15% పెరిగాయి. ప్రధానంగా ఐటీ పరిశ్రమ ఇందుకు దోహదం చేసింది. ఈ ఒక్క రంగంలోనే నియామకాలు జనవరిలో 36 శాతం పెరిగాయి. ఈ మేరకు జనవరి నెలకు సంబంధించి నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ గణాంకాలు విడుదలయ్యాయి. జనవరిలో ఈ ఇండెక్స్ 2,251గా నమోదైంది.
2018 జనవరిలో ఇది 1,951గా ఉండటం గమనార్హం. నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ ప్రతినెలా నౌకరీ డాట్ కామ్ సైట్లో ఉద్యోగ వివరాల నమోదు ఆధారంగా విడుదలయ్యే గణాంకాలు. బెంగళూరు నగరం 27 శాతం నియామకాల వృద్ధితో అగ్రస్థానంలో ఉంది. ముంబైలో 10 శాతం, ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో 8 శాతం చొప్పున పెరుగుదల నమోదైంది. మొత్తం మీద ప్రారంభ స్థాయి (0–3 ఏళ్ల అనుభవం కలిగిన వారు)లో నియామకాలు 16 శాతం పెరగ్గా, 4–7 ఏళ్ల అనుభం కలిగిన వారి నియామకాలు 18 శాతం పుంజుకున్నాయి.