సాక్షి, న్యూఢిల్లీ: వీసా ఆంక్షలు, నియామకాల్లో కోత, లేఆఫ్‌లతో 2017లో కుదేలైన ఐటీ పరిశ్రమ కొత్త ఏడాదిలో ఎటు పయనిస్తుందన్న ఉత్కంఠ నెలకొంది. ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా 2018లో ఐటీ కుదురుకుంటుందనే అంచనాలు వెల్లడవుతున్నాయి. కంపెనీలు క్రమంగా ఐటీ వ్యయాలను పెంచుతుండటం, పోటీని తట్టుకునేందుకు నూతన టెక్నాలజీలపై దృష్టి సారించడంతో ఐటీ పరిశ్రమ 2018లో తిరిగి పుంజుకుంటుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
గడిచిన ఏడాది కాలంలో ఐటీ రంగంలో రాజకీయ, ఆర్థిక అంశాలు ప్రతికూల ప్రభావం చూపాయని, కొత్త ఏడాది వీసా స్ర్కూటినీ పెరగడం, కంపెనీలు తిరిగి ఐటీ వ్యయాలు పెంచడంతో సాధారణ పరిస్థితి నెలకొంటుందని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ ఆశాభావం వ్యక్తం చేశారు. 2017-18లో ఐటీ ఎగుమతుల వృద్ధి రేటు 7 నుంచి 8 శాతంగా ఉంటుందన్న అంచనాలను అధిగమిస్తామని చెప్పారు. వీసా ఆంక్షలు సహా పలు ప్రతికూలతలు ఎదురైనా ఆటోమేషన్, కృత్రిమ మేథ, మెషీన్ లెర్నింగ్ వంటి నూతన టెక్నాలజీల రాకతో పరిశ్రమ స్థిరంగా ముందుకెళుతుందని భావిస్తున్నారు.
ఐటీ బడ్జెట్లలో ఈ టెక్నాలజీలపై వెచ్చించే వ్యయం గణనీయంగా ఉండటంతో పరిశ్రమ వృద్ధిపై భయాందోళనలు లేవని నిపుణులు చెబుతున్నారు. ఆటోమేషన్, డిజిటల్ వంటి కొత్త టెక్నాలజీల రాకతో ఉద్యోగాలు దెబ్బతింటాయన్న ఆందోళన నెలకొన్నా ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం ద్వారా నికర ఉపాధిని కల్పించే పరిశ్రమగా ఐటీ ముందుంటుందనే సంకేతాలు వెల్లడవుతున్నాయి.
డేటా అనలిటిక్స్, రోబోటిక్స్, కృత్రిమ మేథ వంటి నూతన టెక్నాలజీలను అందిపుచ్చుకోవడంతో పాటు కంపెనీలు వినూత్న మోడల్స్‌తో ముందుకెళితే మందగమనాన్ని ఎదుర్కోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు ఐఐటీలు, ఇంజనీరింగ్ కళాశాలల్లో క్యాంపస్ నియామకాలు ఊపందుకోవడం కూడా కొత్త ఏడాది ఐటీ జోరుకు సానుకూల సంకేతాలు పంపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment