కళాకారుల వేదిక.. జిల్‌మోర్! | Entertainers booking app JilMore to raise $1 mn in pre-Series A funding | Sakshi
Sakshi News home page

కళాకారుల వేదిక.. జిల్‌మోర్!

Published Tue, Dec 22 2015 12:19 AM | Last Updated on Mon, Aug 20 2018 4:42 PM

కళాకారుల వేదిక.. జిల్‌మోర్! - Sakshi

కళాకారుల వేదిక.. జిల్‌మోర్!

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వేడుకను మరింత అందంగా మలచాలని అనుకుంటున్నారా? ఇక నుంచి కళాకారుల కోసం కాళ్లరిగేలా తిరగక్కరలేదు. సింగర్, యాంకర్, కమెడియన్, డ్యాన్సర్, మిమిక్రీ, మెజీషియన్.. ఇలా ఆర్టిస్టులెవరైనా ఒక్క క్లిక్‌తో వారిని చేరుకోవచ్చు. హైదరాబాద్‌కు చెందిన యుక్తా ఎంటర్‌టైన్‌మెంట్ సర్వీసెస్ ‘జిల్‌మోర్’ పేరుతో కళాకారుల ఆన్‌లైన్ బుకింగ్ యాప్‌ను సోమవారమిక్కడ ప్రారంభించింది. ఇటువంటి యాప్ అందుబాటులోకి రావడం భారత్‌లో ఇదే తొలిసారి అని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం 120 మందికిపైగా కళాకారులు జిల్‌మోర్‌లో తమ పేర్లను నమోదు చేసుకున్నారు.

జిల్‌మోర్ యాప్‌తోపాటు వెబ్‌సైట్ కూడా అందుబాటులో ఉంది. యూజర్లు తమకు కావాల్సిన ఆర్టిస్ట్‌ను వెబ్/యాప్ ద్వారా ఆహ్వానించాలి. కార్యక్రమం, సమయం తమకు అనుకూలమైతే యూజర్ ఆహ్వానాన్ని గెస్ట్ (కళాకారులు) అంగీకరిస్తారు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే నిర్దేశిత మొత్తాన్ని ఆన్‌లైన్‌లో చెల్లిస్తే బుకింగ్ పూర్తి అవుతుంది.
 
బాలు నేతృత్వంలో..
జిల్‌మోర్ మెంటార్, బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ గాయకులు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం వ్యవహరిస్తున్నారు. అంతేగాక ఆయన వాటాదారుగా కూడా ఉన్నారని కంపెనీ వెల్లడించింది. ప్రతిభగల వర్థమాన కళాకారులకు ఇది చక్కని వేదికగా నిలుస్తుందని ఈ సందర్భంగా ఎస్.పి.బాలు అన్నారు. ప్రస్తుతం రూ.50 లక్షల సీడ్ ఫండ్ సమీకరించామని జిల్‌మోర్ ఫౌండర్ సారథి బాబు రసాల తెలిపారు.

మార్చికల్లా రూ.6.7 కోట్లను సేకరిస్తామని చెప్పారు. అలాగే 4,000 మందికిపైగా కళాకారులు తమ వేదికపైకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కంపెనీ కార్యకలాపాలను దేశవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. ‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 10 వేలకుపైగా ఫంక్షన్ హాళ్లున్నాయి. 50 శాతం మంది కస్టమర్లు ఎంటర్‌టైనర్‌ను కోరుకుంటున్నారు. వీరికోసం కనీసం రూ.10 వేలు ఖర్చు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రూ.1,000 కోట్లకుపైగా వ్యాపార అవకాశాలు ఉన్నాయి’ అని చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement