యూరో జోన్ కు ఈసీబీ పాలసీ బూస్ట్...
ఇచ్చే రుణాలపై వడ్డీ రేటు ఇక ‘జీరో’
డిపాజిట్ రేటు మైనస్ 0.3% నుంచి మైనస్ 0.4%కి తగ్గింపు
ఫ్రాంక్‌ఫర్ట్: యూరోజోన్ ఆర్థిక వ్యవస్థను వృద్ధి బాటలో నడిపించడానికి వీలుగా యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల వడ్డీ రేట్లనూ తగ్గించింది. తాను బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వడ్డీరేటును (రిఫీ రేటు- రీఫైనాన్షింగ్ రేటు) ప్రస్తుత 0.05 శాతం నుంచి జీరో స్థాయికి తగ్గించింది. ఇక బ్యాంకులు తన వద్ద డిపాజిట్ చేసుకుంటే చెల్లించాల్సిన వడ్డీ రేటు (డిపాజిట్)ను కూడా మైనస్ - 0.3 శాతం నుంచి మైనస్ -0.4 శాతానికి తగ్గించింది. అంటే బ్యాంకులు తమ అదనపు నిధులను ఈసీబీ వద్ద ఉంచాలంటే... మరింత వడ్డీ చెల్లించాలన్నమాట. దీనివల్ల బ్యాంకులు తమ వద్ద ఉన్న అదనపు నిధులను ఈసీబీలో డిపాజిట్ చేసుకోడానికి బదులు, వృద్ధికి ఊతంగా వ్యవస్థలోకి మళ్లించే అవకాశం ఉంది. అదే సమయంలో జీరో శాతానికే వాటికి ఈసీబీ నుంచి రుణ సౌలభ్యం కూడా అందుబాటులో ఉంటుంది. వ్యవస్థలో రుణ లభ్యత, డిమాండ్ గణనీయంగా మెరుగుపడ్డానికి ఈ చర్య దోహదపడే అవకాశం ఉంది.
బాండ్ల కొనుగోలు పరిమితి పెంపు...
దీనితోపాటు వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్యలభ్యత) మెరుగునకు ఈసీబీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నెలకు 60 బిలియన్ యూరోల విలువైన బాండ్ల కొనుగోలు విలువను ఏప్రిల్ నుంచీ 80 బిలియన్ యూరోలకు పెంచుతున్నట్లు సైతం ప్రకటించింది. అనంతరం ఈసీబీ ప్రెసిడెంట్ మారియో డ్రాగీ మీడియాతో మాటాడుతూ ఈసీబీ చొరవలు యూరోజోన్ ఆర్థిక వృద్ధికి దోహదపడతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కాగా ఈసీబీ తాజా నిర్ణయం తక్షణం అమెరికా డాలర్‌తో పోలిస్తే యూరో ఒక శాతం పతనానికి దారితీసింది.