
న్యూఢిల్లీ: కరోనావైరస్ కట్టడిపరమైన లాక్‌డౌన్ కారణంగా ప్రీపెయిడ్ యూజర్లు ఇబ్బందిపడకుండా తగు చర్యలు తీసుకోవాలని టెల్కోలకు టెలికం రంగ నియంత్రణ సంస్థ(ట్రాయ్) ఆదేశించింది. సర్వీసులకు అంతరాయం కలగకుండా వ్యాలిడిటీని పొడిగించే అంశాన్ని కూడా పరిశీలించాలని సూచించింది. ‘లాక్‌డౌన్ సమయంలో ప్రీపెయిడ్ యూజర్లంతా నిరంతరాయంగా సర్వీసులు పొందేందుకు... వ్యాలిడిటీని పొడిగించడం సహా అవసరమైన చర్యలన్నీ తీసుకోవాలి. టెలికమ్యూనికేషన్ సేవలను నిత్యావసర సర్వీసుల కింద పరిగణించి, మినహాయింపు ఇచ్చినప్పటికీ.. లాక్‌డౌన్ కారణంగా కస్టమర్ సర్వీస్ సెంటర్లు, పాయింట్ ఆఫ్ సేల్స్ స్టోర్లు పనిచేయకపోవడం వల్ల సర్వీసులకు విఘాతం కలగవచ్చు. దీంతో ఆఫ్‌లైన్ విధానాల్లో ప్రీపెయిడ్ బ్యాలెన్స్‌లను టాప్ అప్ చేయించుకునేవారికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి‘ అని ట్రాయ్ సూచించింది.
వ్యాలిడిటీ పొడిగించిన ఎయిర్‌టెల్..
లాక్‌డౌన్‌పరమైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అల్పాదాయ వర్గాలకు చెందిన సుమారు 8 కోట్ల పైగా ప్రీపెయిడ్ కస్టమర్ల ప్యాకేజీల వేలిడిటీని ఏప్రిల్ 17 దాకా పొడిగిస్తున్నట్లు ఎయిర్‌టెల్ వెల్లడించింది. ప్లాన్ గడువు తీరిపోయినా 17 దాకా వీరంతా ఇన్‌కమింగ్ కాల్స్ పొందవచ్చని తెలిపింది. అలాగే, ఈ 8 కోట్ల మంది ప్రీ–పెయిడ్ అకౌంట్స్‌లోకి ఉచితంగా రూ. 10 టాక్‌టైమ్ క్రెడిట్‌గా ఇస్తున్నట్లు వివరించింది. దీన్ని టాక్‌టైమ్, ఎస్‌ఎంఎస్‌ల కోసం ఉపయోగించుకోవచ్చని, ఈ మొత్తాన్ని రికవర్ చేయబోమని ఎయిర్‌టెల్ పేర్కొంది. వచ్చే 48 గంటల్లో ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని తెలిపింది.
బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ కూడా..
ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ కూడా ఇదే తరహాలో ఏప్రిల్ 20 దాకా ప్రీపెయిడ్ ప్యాక్‌ల వేలిడిటీ పెంచుతున్నట్లు ప్రకటించాయి. బ్యాలెన్స్ అయిపోయినప్పటికీ కనెక్టివిటీ దెబ్బతినకుండా రూ. 10 అదనపు టాక్‌టైమ్ అందిస్తున్నట్లు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment