
న్యూఢిల్లీ: సెప్టెంబర్ నెలకు సంబంధించి జీఎస్‌టీ రిటర్నుల దాఖలు గడువును ఈ నెల 25 వరకు పొడిగిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయాన్ని వెలువరించింది. దీంతో 2017 జూలై–2018 మార్చి కాలానికి ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందాలనుకునే వ్యాపార సంస్థలు ఈ నెల 25 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చని తెలిపింది. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌కు సంబంధించి గడువు ఈ నెల 20వరకే ఉండటం పట్ల వాణిజ్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేసినట్టు కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల మండలి (సీబీఐసీ) పేర్కొంది.
‘‘ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నెలకు సంబంధించి జీఎస్‌టీఆర్–3బి దాఖలు గడువును అక్టోబర్ 25వరకు పొడిగింపు ఇవ్వడం జరిగింది’ అని సీబీఐసీ తెలిపింది. గడిచిన నెలకు సంబంధించి జీఎస్‌టీఆర్–3బిని మరుసటి నెల 20వరకు దాఖలు చేయాలన్నది నిబంధన. ఇక జీఎస్‌టీలోకి ఇటీవలే వచ్చి చేరిన వారు, 2017 జూలై–2018 మార్చి కాలానికి ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను పొందేందుకు ఈ ఏడాది డిసెంబర్ 31వరకు లేదా వార్షిక రిటర్నులు దాఖలు చేసే వరకు... వీటిలో ఏది ముందు అయితే అంతవరకు గడువు ఉంటుందని సీబీఐసీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment