అక్కడ ఫేస్బుక్, ట్విట్టర్లపై నిషేధం
అల్జీరియాలో ఫేస్బుక్, ట్విట్టర్, ఇతర సోషల్ మీడియా సైట్లను తాత్కాలికంగా బ్లాక్ చేశారు. హైస్కూల్ ఎగ్జామ్ పేపర్లను ఆన్ లైన్లలో పోస్టు చేస్తుండటంతో వీటిని అరికట్టడానికి ఆ దేశ ప్రభుత్వం ఆదివారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆదివారం నుంచి జరుగుతున్న ఈ ఎగ్జామ్స్ కోసం సోషల్ మీడియాను అక్కడ బ్లాక్ చేశారు. సోషల్ మీడియాలో పోస్టు చేసే తప్పుడు పేపర్ల వల్ల విద్యార్థులు నష్టపోకుండా ఉండటానికి నిషేధం విధించామని అధికారులు వెల్లడించారు.
3జీ మొబైల్ నెట్ వర్క్ ద్వారా యాక్సెస్ అయ్యే ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు. ప్రశ్నాపత్రాల పేపర్ల చీటింగ్ దేశంలో ఎక్కువగా జరుగుతుండటంతో ప్రభుత్వానికి వాటిని నిరోధించడం కష్టతరంగా మారుతోంది. ఈ నెల మొదట్లో పేపర్లను లీక్ చేసిన కొంతమంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో నేషనల్ ఎడ్యుకేషన్ ఆఫీసులకు, ఫ్రింటర్లకు సంబంధించిన వారు ఉన్నారు. 2016 హైస్కూల్ ఎగ్జామ్స్ పేపర్లు సోషల్ మీడియాలో లీక్ పై విచారణ కొనసాగుతోంది.