శాన్‌ఫ్రాన్సిస్కో: చైనా టెలికాం దిగ్గజం హువావేకు మరో ఎదురు దెబ్బ తగిలింది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. హువావే కొత్త ఫోన్లలో ఫేస్‌బుక్ సహా, తమ యాప్‌లు వాట్సాప్, ఇన్‌స్ట్రామ్ ప్రీ-ఇన్‌స్టాల్‌గా లభించవని ప్రకటించింది. మార్కెట్లోకి రానున్న హువావే స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులు వీటిని తప్పక డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందే. అయితే ఇప్పటికే హువావే ఫోన్లు వినియోగిస్తున్న వారికి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. అన్ని అప్‌డేట్స్ ఇస్తామని ఫేస్‌బుక్ తెలిపింది. ఫేస్‌బుక్ నిర్ణయంపై ట్విటర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే తాజా పరిణామంపై స్పందించేందుకు హువావే నిరాకరించింది.
హుహావేపై అమెరికా ఆంక్షల కొరడా ఝుళిపిస్తున్న సంగతి తెలిసిందే. హువావేకు ఎలాంటి సాయం చేయొద్దని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించిన నేపథ్యంలో గూగుల్ సహా పలు టెక్ కంపెనీలు భవిష్యత్‌లో తమ సేవలను అందించబోమని ఇప్పటికే ప్రకటించింది. ముఖ్యంగా ఇటీవల గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం 90 రోజుల తర్వాత హువావే కొత్త ఫోన్లకు గూగుల్ సేవలు ఏవీ అందుబాటులో ఉండవు. దీంతో గూగుల్ ప్లే స్టోర్ నుంచి వారు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కానీ, 90రోజుల తర్వాత గూగుల్ ప్లేస్టోర్ యాక్సెస్‌ను కూడా హువావే కొత్త ఫోన్లకు ఉండదు.
కాగా సాధారణంగా ఫేస్‌బుక్, ట్విటర్‌లాంటి సోషల్ మీడియా యాప్‌లు ప్రీ-ఇన్‌స్టాల్‌గా ప్రస్తుత స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి వస్తాయి. ఇందుకు ముందుగానే ఒప్పందం చేసుకుంటాయి. సోషల్ మీడియాకు చిన్నా పెద్ద దాసోహం అంటున్న ప్రస్తుత తరుణంలో ఈ యాప్‌లు లేని స్మార్ట్‌ఫోన్లపై కొనుగోలు దారుల ఆసక్తి ఏ మేరకు ఉంటుందనేది ఊహించుకోవచ్చు. ఈ నేపథ్యంలో హువావే స్మార్ట్‌ఫోన్ విక్రయాలు భారీగా ప్రభావితం కానున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు అమెరికా ఆంక్షల ఎత్తుగడలను ధీటుగా ఎదుర్కొనే సత్తా తమ వద్ద ఉందని హువావే ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment