మార్కెట్లకు ‘ఫెడ్’ ఫీవర్! | Fed fever to Markets in Interest rates declaration | Sakshi
Sakshi News home page

మార్కెట్లకు ‘ఫెడ్’ ఫీవర్!

Published Mon, Dec 14 2015 9:13 AM | Last Updated on Sun, Sep 3 2017 1:59 PM

మార్కెట్లకు ‘ఫెడ్’ ఫీవర్!

మార్కెట్లకు ‘ఫెడ్’ ఫీవర్!

- అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల నిర్ణయంపై దృష్టి...
- జీఎస్‌టీ బిల్లుపై ముందడుగు కూడా కీలకమే...
- ఈ వారం మార్కెట్ గమనంపై విశ్లేషకులు...
 
న్యూఢిల్లీ: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు నిర్ణయం, ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ వారం మార్కెట్‌కు కీలకం కానున్నాయని నిపుణులంటున్నారు. ఈ రెండు అంశాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల పోకడ, జీఎస్‌టీ తదితర మరికొన్ని అంశాల కారణంగా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఒడిదుడుకులమయంగా సాగుతుందని వారంటున్నారు. నేడు (సోమవారం) నవంబర్ నెలకు సంబంధించి టోకు ధరల, వినియోగదారుల ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్నాయి. శుక్రవారం వెలువడిన పారిశ్రామికోత్పత్తి గణాంకాలకు కూడా మార్కెట్ స్పందిస్తుందని విశ్లేషకులంటున్నారు. అక్టోబర్‌లో పారిశ్రామికోత్పత్తి ఐదేళ్ల గరిష్ట స్థాయికి చేరిన విషయం తెలిసిందే.
 
 క్షీణత కొనసాగుతుంది..
 భారత స్టాక్ మార్కెట్ పతనం కొనసాగుతుందన్న అంచనాలున్నాయని మోతిలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ (మిడ్ క్యాప్స్ రీసెర్చ్) రవి షెనాయ్ పేర్కొన్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల నిర్ణయం, ద్రవ్యోల్బణ గణాంకాలు, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల పోకడ ఈ వారం మన స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. జీఎస్‌టీ బిల్లు ఆమోదం పొందుతుందా లేదా అన్న ఉత్కంఠ ఇన్వెస్టర్లలో నెలకొన్నదని పేర్కొన్నారు.  ఫెడ్ నిర్ణయం కీలకం కానుండడం, జీఎస్‌టీ బిల్లు ఆమోదంపై నీలినీడలు కమ్ముకోవడం నిఫ్టీపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని, కొత్త గరిష్ట స్థాయిలకు ఒడిదుడుకులు చేరతాయని ఆయన అంచనా వేస్తున్నారు.
 
 విదేశీ నిధులు తరలిపోతాయ్ !
 బుధ, గురు ఈ రెండు రోజుల్లో జరిగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశ ఫలితంపైననే ఇన్వెస్టర్ల కళ్లన్నీ ఉన్నాయని సింఘానియా చెప్పారు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచడం ప్రారంభిస్తే, భారత్ వంటి వర్ధమాన దేశాల నుంచి భారీగా నిధులు తరలిపోతాయని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. కాగా గత వారంలో  బీఎస్‌ఈ సెన్సెక్స్ 594 పాయింట్లు(2.3 శాతం), ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 172 పాయింట్లు(2.2 శాతం)చొప్పున నష్టపోయాయి. సెన్సెక్స్ 25,044 పాయింట్ల వద్ద, నిఫ్టీ 7,610 పాయింట్ల వద్ద ముగిశాయి.
 
 కొనసాగుతున్న విదేశీ విక్రయాలు...
 విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ అమ్మకాలను కొనసాగిస్తున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు పెంచుతుందన్న అంచనాల నేపథ్యంలో ఈ నెలలో విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్‌లో  రూ.5,500 కోట్ల నికర అమ్మకాలు జరిపారు. డెట్ మార్కెట్ నుంచి రూ.368 కోట్లు నికర పెట్టుబడులు ఉపసంహరించారు. గత నెలలో స్టాక్‌మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు రూ.7,074 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. అక్టోబర్‌లో మాత్రం విదేశీ ఇన్వెస్టర్లు రూ.6,650 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. కాగా, ఇప్పటిదాకా విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో రూ.15,136 కోట్లు, డెట్ మార్కెట్లో 50,976 కోట్ల చొప్పున నికర పెట్టుబడులు పెట్టారు.  
 
   దేశీ ఫండ్స్ షేర్ల కొనుగోళ్ల జోరు..
 న్యూఢిల్లీ: విదేశీ ఇన్వెస్టర్లు వారి పెట్టుబడులను వెనక్కి ఉపసంహరించుకుంటున్నప్పటికీ.. దేశీ మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు మాత్రం ఈ ఏడాదిలో ఇప్పటి దాకా దాదాపు రూ.69,000 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. ఇదే సమయంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) నికర పెట్టుబడులు రూ.15,136 కోట్లుగా ఉన్నాయి. గడచిన మూడేళ్లలో విదేశీ ఫండ్ సంస్థలు సగటున భారతీయ స్టాక్ మార్కెట్‌లో 20 బిలియన్ డాలర్లమేర  ఇన్వెస్ట్ చేశాయి. తాజా సెబీ గణాంకాల ప్రకారం.. మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు ఈ ఏడాదిలో ఇప్పటిదాకా రూ.68,924 కోట్లను ఈక్విటీ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేశారు.
 
 గతేడాది నికర మొత్తం రూ.23,842 కోట్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌తో సహా ఈక్విటీ ఎంఎఫ్‌లలోకి వచ్చిన నికర పెట్టుబడులు ఈ ఏడాది నవంబర్ నాటికి రూ.87,000 కోట్లుగా ఉన్నాయి. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు పెరగడం, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశీ మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు స్టాక్ మార్కెట్‌పై ఆశావహంగా ఉండటం వంటి అంశాలు ఈక్విటీ షేర్ల కొనుగోళ్ల జోరుకు కారణంగా కనిపిస్తున్నాయని క్వాంటమ్ ఏఎంసీ మేనేజింగ్ డెరైక్టర్, చీఫ్ ఇన్‌ఫర్మేషన్ ఆఫీసర్ ఐ.వి.సుబ్రమణియన్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement