ఆరో రోజూ అదే తీరు..
కొనసాగుతున్న పతనం
274 పాయింట్ల నష్టంతో 25,036కు సెన్సెక్స్
89 పాయింట్ల నష్టంతో 7,612కు నిఫ్టీ
స్టాక్ మార్కెట్ పతనం కొనసాగుతోంది. జీఎస్‌టీ బిల్లు ఆమోదంపై నీలినీడలు కమ్ముకోవడం, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగుతుండడంతో బుధవారం రోజు స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. వరుసగా ఆరో ట్రేడింగ్ సెషన్‌లోనూ స్టాక్ సూచీలు క్షీణించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 274 పాయింటు నష్టపోయి 25,036 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 89 పాయింట్లునష్టపోయి 7,612 పాయింట్ల వద్ద ముగిశాయి. లోహ, వాహన, ఫార్మా, బ్యాంక్, ఆర్థిక సేవల రంగ షేర్లకు అమ్మకాల ఒత్తిడి కనిపించింది. నేషనల్ హెరాల్డ్ వివాదం కారణంగా పార్లమెంట్‌లో రగడ జరగడంతో జీఎస్‌టీ బిల్లు ఆమోదం కష్టమేనని ఇన్వెస్టర్లు భావిస్తున్నారని, అందుకే వారు లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నారని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు పెంచనున్నదన్న అంచనాల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు విక్రయాలకు పాల్పడుతుండడం ప్రతికూల ప్రభావం చూపిస్తోందని నిపుణులంటున్నారు. గత ఆరు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1,133 పాయింట్లు నష్టపోయింది. ఈ ఆరు ట్రేడింగ్ సెషన్లలో స్టాక్ సూచీలు 4 శాతం చొప్పున నష్టపోయాయి.
ఎన్‌ఎస్‌ఈలో వాటా విక్రయానికి ఎస్‌బీఐ రెడీ!
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్‌ఎస్‌ఈ)లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తనకున్న 15 శాతం వరకూ వాటాను విక్రయించే ప్రక్రియను మొదలుపెట్టింది. ఎన్‌ఎస్‌ఈలో తమకున్న వాటాకు సరైన ధర కోసం చూస్తున్నామని ఎన్‌ఎస్‌ఈ చైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్య చెప్పారు. వీలైనంత త్వరగా ఎన్‌ఎస్‌ఈ లిస్ట్ కావాలని కోరుకుంటున్నట్లు ఆమె ఎకనామిక్ టైమ్స్ పత్రికకు తెలిపారు. ఈ వాటా విక్రయం వల్ల ఎస్‌బీఐకు రూ.17,500 కోట్ల నిధులు లభిస్తాయని బ్యాంకు అధికారుల అంచనా. ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు కీలకం కాని ఆస్తుల విక్రయం ద్వారా తమ పెట్టుబడులను పెంచుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంట్లో భాగంగానే ఎన్‌ఎస్‌ఈలో తన వాటాను విక్రయించాలని ఎస్‌బీఐ ప్రయత్నాలు చేస్తోంది. కాగా ఎన్‌ఎస్‌ఈ లిస్టింగ్ ప్రక్రియను వేగవంతం చేసే ప్రక్రియలో భాగంగా ఇటీవలనే ఎస్‌బీఐ ఒక సమావేశాన్ని నిర్వహించింది.