నిన్నటిదాకా కొనలేరు.. ఇప్పుడు అమ్మలేరు!
సర్క్యూట్లలో చిక్కుకున్న బోద్ ట్రీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బోద్ ట్రీ కన్సల్టింగ్ లిమిటెడ్!!. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ చిన్న స్మాల్ క్యాప్ ఐటీ కంపెనీ... కొద్దిరోజులుగా స్టాక్ మార్కెట్లో హల్ చల్ చేస్తోంది. ఎందుకంటే ఈ నెల 8న బో«ద్ ట్రీ సంస్థ ఓ కీలక ప్రకటన చేసింది. జీఎస్‌టీ అమలు కానున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన జీఎస్‌టీ సువిధ ప్రొవైడర్ల జాబితాలో తాము కూడా ఉన్నామని, అంతేకాకుండా ఇన్ఫోసిస్ క్లయింట్లకు తాము జీఎస్‌టీ సొల్యూషన్స్ అందించబోతున్నామని, ఈ మేరకు ఇన్ఫీతో ఒప్పందం కూడా కుదిరిందని సంస్థ ప్రకటించింది. ఈ రూ.200 కోట్ల ఒప్పందం మూడేళ్లలో అమలవుతుందని కూడా సంస్థ తెలిపింది.
2016–17లో మొత్తం క్లయింట్ల నుంచి దాదాపు 80 కోట్ల టర్నోవర్ నమోదు చేసిన బో«ద్ ట్రీకి... ఇపుడు ఆ టర్నోవర్ ఒకే క్లయింట్ నుంచి రావటం చిన్న విషయమేమీ కాదు. దీంతో కంపెనీ షేరు పెరగటం మొదలైంది. నిజానికి కంపెనీ ఈ సమాచారాన్ని ప్రకటించటానికి నాలుగు రోజుల ముందు నుంచే సంస్థ షేరు అప్పర్ సర్క్యూట్‌లో లాక్ అవటం ఆరంభించింది. అంటే... కంపెనీ ఈ ప్రకటన చేయటానికి నాలుగు రోజుల ముందు నుంచే ఈ షేరులో కొనుగోళ్లు మొదలయ్యాయి.
అమ్మేవారు మాత్రం లేరు. దీంతో అప్పర్ సర్క్యూట్ పడుతూ వచ్చింది. కంపెనీ ఈ ప్రకటన చేసేనాటికి షేరు ధర దాదాపు రూ.50–52 మధ్య ఉంది. ఇక ఈ ప్రకటన చేశాక రోజూ అప్పర్ సర్క్యూట్‌లో లాక్ అవటం మొదలెట్టింది. చివరికి ఎక్సే్ఛంజీ ఈ షేరును 10 శాతం సర్క్యూట్ నుంచి 5 శాతం సర్క్యూట్‌లోకి మార్చింది. అంటే ఈ షేరు ధర రోజుకు 5 శాతంకన్నా పెరిగే వీలుండదు. దీంతో రోజూ 5 శాతం పెరుగుతూ... మంగళవారానికి ఏకంగా రూ.78 రూపాయలకు చేరింది. అయితే అప్పటికే షేర్లు బాగా కొనుగోలు చేసి ఉన్నవారు మంగళవారం ఒక్కసారిగా గరిష్ట ధర వద్ద విక్రయించటంతో షేరు వెంటనే లోయర్ సర్క్యూట్‌ను తాకి రూ.74.90కి పడిపోయింది. చివరికి రూ.74.90 వద్ద లక్షకు పైగా షేర్లు విక్రయించటానికి ఆర్డర్లున్నాయి గానీ వాటిని కొనేవారు మాత్రం లేకపోవటం గమనార్హం.
కంపెనీ విభజన నిర్ణయం వాయిదా!!
బోద్ ట్రీ సంస్థ మొదట్లో ఈ–పేపర్ సొల్యూషన్స్ అందించేది. తరవాత ఇతర టెక్నాలజీల్లోకి వచ్చింది. ప్రస్తుతం జీఎస్‌టీ సొల్యూషన్స్‌తో పాటు ‘ఉడూ’ వంటి ఓపెన్‌సోర్స్ ఈఆర్‌పీ, సీఆర్‌ఎం సొల్యూషన్స్ కూడా అందిస్తోంది. ఇటీవల షేరు బాగా పెరుగుతుండటంతో రూ.10 ముఖ విలువ కలిగిన షేర్లను విభజించాలని కూడా అనుకుంది. ఈ మేరకు ఈ నెల 15న సమావేశమై నిర్ణయం తీసుకుంటామని స్టాక్ ఎక్సే్ఛంజీలకు కూడా సమాచారమిచ్చింది. అయితే ఎందుకనో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. పలు అంశాలపై నిర్ణయం తీసుకోవటానికి వచ్చేనెల 22న బోర్డు సమావేశం జరగనున్నట్లు తాజాగా ఎక్సే్ఛంజీలకు తెలిపింది.