జైట్లీతో ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్
ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ
• అధిక పన్ను వసూళ్లు, డిజిన్వెస్ట్‌మెంట్ దన్ను
న్యూఢిల్లీ: ద్రవ్యలోటు కట్టడి లక్ష్యాలను కేంద్రం సాధిస్తుందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. 2017–18 సంవత్సరానికి 3.2 శాతం, 2018–19 సంవత్సరానికి 3 శాతంగా బడ్జెట్‌లో ద్రవ్యలోటు లక్ష్యాలను నిర్దేశించిన సంగతి తెలిసిందే. పన్ను వసూళ్ల మెరుగుదల, పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వెస్ట్‌మెంట్) ద్వారా దీన్ని సాధిస్తామన్నారు. నోట్ల రద్దు నేపథ్యంలో అప్పటివరకూ వెల్లడించని ఆదాయంపై పన్నుల రూపంలో వచ్చే మొత్తాలను బడ్జెట్ పూర్తి స్థాయిలో పరిగణనలోకి తీసుకోలేదని జైట్లీ తెలిపారు. పారిశ్రామిక మండళ్లు ఇక్కడ నిర్వహించిన బడ్జెట్ అనంతర సమావేశంలో జైట్లీ శుక్రవారం మాట్లాడారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం.. వ్యయాల మధ్య వ్యత్యాసమే ద్రవ్యలోటు.
ఇంకా ఆయన ఏమన్నారంటే...
⇔ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంచనాలకన్నా అధికంగా పన్ను వసూళ్లు ఉంటాయని భావిస్తున్నాం. వచ్చే ఏడాది కూడా ఇదే ధోరణి కొనసాగుతుందన్న ఆశాభావంతో మేము ఉన్నాము.
⇔ పెట్టుబడుల ఉపసంహరణలకు సంబంధించి అధిక లక్షాలను నిర్దేశించుకున్నాం. ఇందుకు అనుగుణంగా సాధారణ బీమా కంపెనీలు సహా పలు పీఎస్‌యూ కంపెనీలను లిస్ట్ చేస్తాం. అలాగే లిస్టింగ్ అవసరాలకు అనుగుణంగా వాటాల ఉపసంహరణ జరుగుతుంది. ఆయా అంశాలు ప్రభుత్వానికి ఆదాయం పెంచుతాయని భావిస్తున్నాం.
⇔ అనవసర అడ్డంకులు, ఉన్నతాధికారుల అలసత్వం వంటి అంశాల నివారణకే విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డ్ (ఎఫ్‌ఐబీపీ)ని రద్దు చేయాలన్న నిర్ణయం తీసుకున్నాం. ఆటోమేటిక్ రూట్ ద్వారానే భారీ పెట్టుబడులు రావాలన్నది ప్రభుత్వ సంకల్పం. ఇందుకు తగిన రోడ్‌మ్యాప్ తయారీ ఉంటుంది.
⇔ బ్యాంకుల మొండిబకాయిల సమస్య పరిష్కారానికి సంబంధించి ప్రభుత్వమే ఒక అసెట్ రీహాబిలిటేషన్ సంస్థను ఏర్పాటు చేయాలన్న ఆర్థిక సర్వే ప్రతిపాదన చర్చల దశలో ఉంది. త్వరలో దీని అమలు దిశగా అడుగులు పడతాయి. బ్యాడ్ బ్యాం క్‌కు కూడా ఇదే వర్తిస్తుంది.
సంపన్నులపై పన్నేస్తే తప్పేమీలేదు
సంపన్నులపై పన్నులకు సంబంధించి 10 శాతం సర్‌చార్జ్ విధించడంలో తప్పేమీలేదని ఆర్థికమంత్రి ఈ సందర్భంగా అన్నారు. అనేకమంది పన్ను ఎగవేతలకు పాల్పడుతున్న సందర్భాలు ఉన్నాయన్నారు. పన్ను చెల్లింపుదారుల సమాచారం ప్రకారం, 56 లక్షల మంది వేతన జీవుల మినహా, ఏడాది రూ.5 లక్షలపైన తమ ఆదాయాన్ని తమకుతాముగా వెల్లడిస్తున్నవారు దేశంలో కేవలం 20 లక్షల మందే ఉన్నారన్నారు. పన్నులు సరిగా సకాలంలో చెల్లించడం ద్వారా దేశాభివృద్ధికి దోహదపడే సమాజాన్ని ఆవిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమలుతో నల్లడబ్బును పోగుచేసుకోడానికి అవకాశాలు సైతం సన్నగిల్లుతాయని జైట్లీ అన్నారు.