
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫిబ్రవరి 1న ఆర్థ్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ఉద్యోగ అవకాశాల సృష్టికి ఉపయోగపడేదిగా ఉండవచ్చని కార్వీ గ్రూప్ చైర్మన్ సి.పార్థసారథి అంచనా వేశారు. జనాకర్షక బడ్జెట్ 2019లో ఉండవచ్చని, ఈ ఏడాది మాత్రం ఉద్యోగ సృష్టి చర్యలను చేపట్టే అవకాశముందని అభిప్రాయపడ్డారు. అయితే ఈ ఉద్యోగ అవకాశాలనేవి కార్పొరేట్లకు పన్ను రాయితీలు కల్పించటం ద్వారా మాత్రమే సాధ్యమవుతాయని, కాబట్టి ఈ బడ్జెట్‌లో దీనిపై దృష్టిసారించే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఫినాపోలిస్ నాలెడ్జ్ సిరీస్ ఆధ్వర్యంలో ‘‘2018 కేంద్ర బడ్జెట్; అభివృద్ధి, ఎంప్లాయిమెంట్‌కు ఊతమిస్తుందా?’ అనే అంశంపై జరిగిన చర్చాగోష్టిలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గాంధీ అండ్ గాంధీ చార్టర్ట్ అకౌంట్ పార్టనర్ అజయ్ గాంధీ మాట్లాడుతూ.. ఈ బడ్జెట్‌లో వేతనజీవులకు కొంత పన్ను రాయితీలు ఇచ్చే అవకాశాలున్నాయన్నారు. ‘‘రూ.10 లక్షలు, రూ.20 లక్షల పన్ను శ్లాబులను పొడిగించడమో లేక అదనంగా మరో శ్లాబ్ పెట్టడమో చేయవచ్చని అంచనా వేశారు.
‘‘2019లో ఎన్నికలుండటం మూలంగా ఆ బడ్జెట్‌లోనే జనాకర్షక పథకాలుండే అవకాశముంది. ఈసారి సామాన్యులకు నిరాశే మిగలవచ్చు’’ అని చర్చలో పాల్గొన్న బిజినెస్ స్టాండర్డ్ ఎడిటోరియల్ డైరెక్టర్ ఏకే భట్టాచార్య చెప్పారు. ప్రభుత్వం ఆర్థికపరమైన జాగ్రత్తలకు కట్టుబడి ఉన్నా... వ్యయం ద్వారానే ఉద్యోగాలను సృష్టించటం, వృద్ధిని వేగవంతం చేయటం సాధ్యమవుతుందని చార్టెడ్ అకౌంటెంట్ ఎంఆర్ విక్రమ్ అభిప్రాయపడ్డారు.