ఐహెచ్‌హెచ్‌ చేతికే ఫోర్టిస్‌.. | Fortis gets a ₹4000 crore lifeline from IHH Health | Sakshi
Sakshi News home page

ఐహెచ్‌హెచ్‌ చేతికే ఫోర్టిస్‌..

Published Sat, Jul 14 2018 1:40 AM | Last Updated on Sat, Jul 14 2018 1:40 AM

Fortis gets a ₹4000 crore lifeline from IHH Health - Sakshi

న్యూఢిల్లీ: దేశీయంగా రెండో అతిపెద్ద హాస్పిటల్‌ చెయిన్‌ ’ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌’ టేకోవర్‌ కోసం నెలల తరబడి వివిధ సంస్థల మధ్య కొనసాగిన యుద్ధం ఎట్టకేలకు ముగిసింది. మలేషియాకి చెందిన ఐహెచ్‌హెచ్‌ హెల్త్‌కేర్‌ ప్రతిపాదనను ఆమోదించినట్లు ఫోర్టిస్‌  బోర్డు వెల్లడించింది. టేకోవర్‌ ప్రతిపాదన ప్రకారం ప్రిఫరెన్షియల్‌ షేర్ల కొనుగోలు ద్వారా రూ. 4,000 కోట్లు సమకూర్చాల్సి ఉంటుంది. షేరు ఒక్కింటికి రూ. 170 చొప్పున ప్రిఫరెన్షియల్‌ అలాట్‌మెంట్‌ ద్వారా ఫోర్టిస్‌లో ఐహెచ్‌హెచ్‌కి 31 శాతం వాటాలు దక్కుతాయి.

అదే ధరకు మరో 26 శాతం వాటాల కొనుగోలుకు ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించాల్సి ఉంటుంది. ఇందుకోసం మరో రూ. 3,300 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. గురువారం నాటి ఫోర్టిస్‌ షేరు ముగింపు ధరతో పోలిస్తే ఆఫర్‌ ధర 20 శాతం అధికం. షేరు ఒక్కింటికి రూ. 170 లెక్కన ఫోర్టిస్‌ ఈక్విటీ వేల్యుయేషన్‌ మొత్తం రూ. 8,800 కోట్లుగా ఉంటుందని అంచనా.   

 ఫోర్టిస్‌ను కొనుగోలు చేసేందుకు పోటీపడిన టీపీసీ–మణిపాల్‌ కన్సార్షియం రూ. 2,100 కోట్లు సమకూర్చేలా, మణిపాల్‌ హాస్పిటల్స్‌ను ఫోర్టిస్‌లో విలీనం చేసేలా ప్రతిపాదన చేసిన సంగతి తెలిసిందే. ఏడాది వ్యవధిలో ఫోర్టిస్‌ ఆమోదించిన ఆఫర్లలో ఐహెచ్‌హెచ్‌ ప్రతిపాదన మూడోది. ఐహెచ్‌హెచ్‌ హెల్త్‌కేర్‌ బెర్హాద్‌కి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది దేశాల్లో 49 ఆస్పత్రులు, 10,000 పైచిలుకు బెడ్స్‌ ఉన్నాయి. ఫోర్టిస్‌కి 45 హెల్త్‌కేర్‌ సెంటర్లు, 368 డయాగ్నోస్టిక్‌ సెంటర్లు ఉన్నాయి.  

మరో రెండు నెలల్లో ఓపెన్‌ ఆఫర్‌..
షేర్‌హోల్డర్లు, కాంపిటీషన్‌ కమిషన్‌ (సీసీఐ) ఆమోదం వచ్చాక .. 7 రోజుల్లో లావాదేవీ పూర్తి కావొచ్చని ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ పేర్కొంది. దీనంతటికీ 60–75 రోజుల సమయం పట్టొచ్చని వివరించింది. ఐహెచ్‌హెచ్‌ ప్రతిపాదన వ్యూహాత్మకంగా, ఆర్థికంగాను మెరుగైనదిగా ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ చైర్మన్‌ రవి రాజగోపాల్‌ పేర్కొన్నారు.  డీల్‌ స్వరూపం సరళతరంగా ఉండటం, అవసరమయ్యే అనుమతులు తక్కువే ఉండటం, స్వల్ప వ్యవధిలో పూర్తి కానుండటం సానుకూలాంశాలని తెలిపారు. 

భారత ఉపఖండంలో కార్యకలాపాలు మరింతగా విస్తరించేందుకు ఈ కొనుగోలు తోడ్పడగలదని ఐహెచ్‌హెచ్‌ ఎండీ టాన్‌ సీ లెంగ్‌ తెలిపారు. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించే అవకాశం ఉందని వివరించారు. దీర్ఘకాలంలో తమ అంతర్జాతీయ బ్రాండ్‌ ’గ్లెన్‌ఈగిల్స్‌’ చెయిన్‌ కింద ఫోర్టిస్‌ను చేర్చే అవకాశం ఉందని లెంగ్‌ వివరించారు. అవసరమైతే మరిన్ని నిధులను కూడా ఇన్వెస్ట్‌ చేసేందుకు సిద్ధమని ఆయన చెప్పారు.

‘ప్రస్తుతం ఫోర్టిస్‌కి రూ. 5,800–6,000 కోట్లు అవసరమవుతాయని భావిస్తున్నాం. ముందుగా రూ. 4,000 కోట్లు సమకూరుస్తున్నాం. అవసరమైతే మిగతా వాటాదారులతో సంప్రదించి మరిన్ని నిధులను కూడా సమకూర్చే అవకాశం ఉంది‘ అని లెంగ్‌ తెలిపారు.  


హోరాహోరీ పోటీ..
రుణ వివాదంలో వ్యవస్థాపకులు మల్వీందర్‌ సింగ్, శివీందర్‌ సింగ్‌ కంపెనీ నుంచి తప్పుకోవాల్సి రావడంతో ఫోర్టిస్‌కు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. వ్యవస్థాపకులిద్దరూ నిధులు కూడా మళ్లించారన్న ఆరోపణలూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఫోర్టిస్‌ టేకోవర్‌పై దిగ్గజ సంస్థలు కన్నేశాయి. ముందుగా మణిపాల్‌ హెల్త్‌ ఎంటర్‌ప్రైజెస్, అమెరికన్‌ ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ టీపీజీ సంయుక్తంగా ఇచ్చిన ఆఫర్‌ను ఫోర్టిస్‌ బోర్డు ఆమోదించింది.

అయితే, ఆ తర్వాత మరో నాలుగు సంస్థలు బరిలోకి దిగడంతో టేకోవర్‌ యుద్ధం రసవత్తరంగా మారింది. ఈ క్రమంలో ముంజాల్‌–బర్మన్‌ కుటుంబాల కన్సార్షియం సంయుక్తంగా ఇచ్చిన రూ. 1,800 కోట్ల ఆఫర్‌ను రెండో విడతలో ఫోర్టిస్‌ ఆమోదించింది. కానీ, దీన్ని షేర్‌హోల్డర్లు ఆమోదించలేదు. దీంతో బిడ్డింగ్‌ ప్రక్రియ మళ్లీ ప్రారంభించాల్సి వచ్చింది. మొత్తం మీద ముగ్గురు బిడ్డర్లు (ఐహెచ్‌హెచ్, టీపీజీ–మణిపాల్‌ కన్సార్షియం, ముంజాల్‌–బర్మన్‌ కన్సార్షియం)తో పాటు రేడియంట్‌–కేకేఆర్‌ కన్సార్షియం కూడా ఫోర్టిస్‌ కోసం పోటీపడగా చివరికి ఐహెచ్‌హెచ్‌హెచ్‌ దక్కించుకుంది.

ఐహెచ్‌హెచ్‌ బిడ్‌ ఆమోదం వార్తల నేపథ్యంలో శుక్రవారం ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ షేర్లు 4 శాతం పెరిగాయి. బీఎస్‌ఈలో 3.97 శాతం పెరిగి రూ. 147.80 వద్ద క్లోజయ్యింది. ఒక దశలో 5.10 శాతం కూడా ఎగిసింది. మరోవైపు, ఎన్‌ఎస్‌ఈలో ఫోర్టిస్‌ షేరు 3.93 శాతం పెరిగి రూ. 147.80 వద్ద ముగిసింది. సంస్థ మార్కెట్‌ విలువ రూ. 293 కోట్ల మేర ఎగిసి రూ. 7,666.13 కోట్లకు చేరింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement