IHH
-
ఫోర్టిస్ హెల్త్‌కేర్ మాజీ ప్రమోటర్లకు ఆరు నెలల జైలు
న్యూఢిల్లీ: జపాన్ సంస్థ దైచీ సాంక్యోకు ర్యాన్‌బాక్సీ విక్రయ వ్యవహారంలో పలు అంశాలను దాచిపెట్టడం, ఈ కేసు విచారణలో ఉండగా.. కోర్టు ధిక్కరణకు పాల్పడుతూ తమ ఫోర్టిస్ షేర్లను మలేసియాకు చెందిన ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్‌కు విక్రయించిన కేసులో ఫోర్టిస్ హెల్త్‌కేర్ మాజీ ప్రమోటర్లు మల్వీందర్ సింగ్, శివిందర్ సింగ్‌లకు సుప్రీంకోర్టు గురువారం 6 నెలల జైలు శిక్ష విధించింది. ఫోర్టిస్ హెల్త్‌కేర్‌లో 26 శాతం వాటా కోసం ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్ బెర్హాద్ ఇచ్చిన ఓపెన్ ఆఫర్‌పై విధించిన స్టే ఎత్తివేసేందుకూ ప్రధాన న్యాయమూర్తి ఉదయ్ ఉమేష్ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. 2018 ఫోర్టిస్–ఐఐహెచ్ ఒప్పందంపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని కూడా అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. అలాగే కేసును తిరిగి ఢిల్లీ హైకోర్టుకు విచారణ నిమిత్తం రిమాండ్ చేసింది. దైచి– ఫోర్టిస్ హెల్త్‌కేర్ మాజీ ప్రమోటర్ల మధ్య చట్టపరమైన పోరాటం కారణంగా ఐహెచ్‌హెచ్–ఫోర్టిస్ ఒప్పందం నిలిచిపోయింది. ఫోర్టిస్–ఐహెచ్‌హెచ్ షేర్ డీల్‌ను దైచీ సాంక్యో సవాలు చేసింది. జపనీస్ డ్రగ్ మేకర్ దైచీ 2008లో ఫోర్టిస్ హెల్త్‌కేర్ మాజీ యజమానులైన సింగ్ సోదరుల నుండి ర్యాన్‌బాక్సీ కొనుగోలు చేసింది. అయితే పలు అంశాలు దాచిపెట్టి ఈ ఒప్పందం చేసుకున్నారని దైచీ ఆరోపిస్తూ, సింగ్ సోదరులపై న్యాయపోరాటాన్ని జరిపింది. సింగ్ సోదరులకు వ్యతిరేకంగా సింగపూర్ ట్రిబ్యునల్‌లో రూ.3,600 కోట్ల ఆర్బిట్రేషన్ అవార్డు అమలుకు దైచీ న్యాయపోరాటం చేస్తోంది. షేర్ భారీ పతనం..: కాగా, ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్‌కు షేర్ అమ్మకాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలన్న సుప్రీం ఆదేశాల అనంతరం ఫోర్టిస్ ఒక ప్రకటన చేస్తూ, దీనిపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఫోర్టీస్ హెల్త్‌కేర్ షేర్ 15% పడిపోయి రూ.265.55 వద్ద ముగిసింది. -
చెరో 1,170 కోట్లు కట్టండి!
న్యూఢిల్లీ: దైచీ కేసులో ర్యాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు మాల్విందర్ సింగ్, శివిందర్ సింగ్‌లు (సింగ్ సోదరులు) కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పు ఇచ్చింది. తమ ఆదేశాలను ఉల్లంఘించి ఫోర్టిస్ హెల్త్‌కేర్‌లోని తమ నియంత్రిత షేర్లను మలేషియా సంస్థ– ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్‌కు విక్రయించడం కోర్టు ధిక్కార అంశంగానే పరిగణించడం జరుగుతుందని స్పష్టం చేసింది. తప్పును సరిదిద్దుకునే క్రమంలో సింగ్ సోదరులు ఇరువురు రూ.1,170.95 కోట్ల చొప్పున మొత్తం రూ.2,341.90 కోట్లను సుప్రీంకోర్టులో డిపాజిట్ చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇందుకు ఎనిమిది వారాల గడువు ఇచ్చింది. డిపాజిట్ తర్వాతే కోర్టు ధిక్కారానికి సంబంధించిన శిక్ష విషయంలో ‘కొంత వెసులుబాటు’ అంశాన్ని పరిశీలించడం జరుగుతుందని సుప్రీం స్పష్టం చేసింది. ‘‘కేసుకు సంబంధించి ఈ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సింగ్ సోదరులు తెలిసీ, ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించారు. కనుక వీరు ఇరువురూ కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లుగానే ఈ కోర్టు భావిస్తోంది’’ అని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. మొత్తంమీద తాజా రూలింగ్ ఫోర్టిస్–ఐహెచ్‌హెచ్ ఒప్పందంపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేసు పూర్వాపరాలు... ► సింగ్ సోదరులు 2008లో ర్యాన్‌బాక్సీని జపాన్ సంస్థ దైచీ శాంక్యోకి విక్రయించారు. తర్వాత ఈ కంపెనీని దైచీ నుంచి భారత్‌కే చెందిన సన్‌ఫార్మా 3.2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ► అయితే ర్యాన్ బాక్సీ అమ్మకం వ్యవహారానికి సంబంధించి సింగ్ సోదరులపై దైచీ సింగపూర్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌తో పలు రెగ్యులేటరీ సమస్యలను ర్యాన్‌బాక్సీ ఎదుర్కొంటోందని, అయితే విక్రయ ఒప్పందాల సమయంలో ఈ అంశాలను సింగ్ సోదరులు వెల్లడించలేదన్నది దైచీ ఆరోపణల్లో ప్రధానమైనది. ఈ కేసులో 2016లో రూ. 2,562 కోట్ల పరిహారాన్ని (అవార్డు) ట్రిబ్యునల్ నుంచి పొందింది. ట్రిబ్యునల్ ఉత్తర్వులను సింగ్ సోదరులు భారత్, సింగ్‌పూర్ కోర్టుల్లో సవాలు చేసినా ఫలితం దక్కలేదు. ఢిల్లీ హైకోర్టులో సింగ్ సోదరులకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అంతర్జాతీయ ఆర్బిట్రల్ అవార్డును హైకోర్టు సమర్థించింది. ► దీనితో ఆయా అంశాలపై సింగ్ సోదరులు సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. ఇక్కడ కూడా వారికి వ్యతిరేకంగానే తీర్పు వచ్చింది. గత ఏడాది ఫిబ్రవరి 16న వారి అప్పీల్‌ను సుప్రీం తోసిపుచ్చింది. ఫోర్టిస్‌లో తమకు ఉన్న వాటాలను విక్రయించరాదని సుప్రీంకోర్టు సింగ్ సోదరులను ఆదేశించింది. ► అయితే ఈ ఆదేశాలను ధిక్కరిస్తూ, ఫోర్టిస్‌లో వాటాలను సింగ్ సోదరు లు మలేషియా సంస్థ– ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్‌కు అమ్మేశారు. ► ఈ విషయాన్ని దైచీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చింది. దీనితో గత ఏడాది డిసెంబర్ 14న ఫోర్టిస్–ఐహెచ్‌హెచ్ ఒప్పం దంపై సుప్రీంకోర్టు ‘యథాతథ స్థితి’ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ► మార్చిలో దైచీ సుప్రీంకోర్టులో సింగ్ సోదరులపై కోర్టు ధిక్కరణ కేసును కూడా దాఖలు చేసింది. ► ఫోర్టిస్‌కు వ్యతిరేకంగా కూడా సుప్రీంకోర్టు ‘ధిక్కరణ’ విచారణను చేపట్టింది. ఫోర్టిస్‌కు సంబంధించి ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్ ఓపెన్ ఆఫర్‌పై ఇచ్చిన స్టేను తొలగించడానికి నిరాకరించింది. ఈ ఓపెన్ ఆఫర్‌పై విచరణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 3న చేపడతామని సుప్రీంకోర్టు పేర్కొంది. -
ఐహెచ్‌హెచ్ చేతికే ఫోర్టిస్..
న్యూఢిల్లీ: దేశీయంగా రెండో అతిపెద్ద హాస్పిటల్ చెయిన్ ’ఫోర్టిస్ హెల్త్‌కేర్’ టేకోవర్ కోసం నెలల తరబడి వివిధ సంస్థల మధ్య కొనసాగిన యుద్ధం ఎట్టకేలకు ముగిసింది. మలేషియాకి చెందిన ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్ ప్రతిపాదనను ఆమోదించినట్లు ఫోర్టిస్ బోర్డు వెల్లడించింది. టేకోవర్ ప్రతిపాదన ప్రకారం ప్రిఫరెన్షియల్ షేర్ల కొనుగోలు ద్వారా రూ. 4,000 కోట్లు సమకూర్చాల్సి ఉంటుంది. షేరు ఒక్కింటికి రూ. 170 చొప్పున ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ద్వారా ఫోర్టిస్‌లో ఐహెచ్‌హెచ్‌కి 31 శాతం వాటాలు దక్కుతాయి. అదే ధరకు మరో 26 శాతం వాటాల కొనుగోలుకు ఓపెన్ ఆఫర్ ప్రకటించాల్సి ఉంటుంది. ఇందుకోసం మరో రూ. 3,300 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. గురువారం నాటి ఫోర్టిస్ షేరు ముగింపు ధరతో పోలిస్తే ఆఫర్ ధర 20 శాతం అధికం. షేరు ఒక్కింటికి రూ. 170 లెక్కన ఫోర్టిస్ ఈక్విటీ వేల్యుయేషన్ మొత్తం రూ. 8,800 కోట్లుగా ఉంటుందని అంచనా. ఫోర్టిస్‌ను కొనుగోలు చేసేందుకు పోటీపడిన టీపీసీ–మణిపాల్ కన్సార్షియం రూ. 2,100 కోట్లు సమకూర్చేలా, మణిపాల్ హాస్పిటల్స్‌ను ఫోర్టిస్‌లో విలీనం చేసేలా ప్రతిపాదన చేసిన సంగతి తెలిసిందే. ఏడాది వ్యవధిలో ఫోర్టిస్ ఆమోదించిన ఆఫర్లలో ఐహెచ్‌హెచ్ ప్రతిపాదన మూడోది. ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్ బెర్హాద్‌కి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది దేశాల్లో 49 ఆస్పత్రులు, 10,000 పైచిలుకు బెడ్స్ ఉన్నాయి. ఫోర్టిస్‌కి 45 హెల్త్‌కేర్ సెంటర్లు, 368 డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉన్నాయి. మరో రెండు నెలల్లో ఓపెన్ ఆఫర్.. షేర్హోల్డర్లు, కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) ఆమోదం వచ్చాక .. 7 రోజుల్లో లావాదేవీ పూర్తి కావొచ్చని ఫోర్టిస్ హెల్త్‌కేర్ పేర్కొంది. దీనంతటికీ 60–75 రోజుల సమయం పట్టొచ్చని వివరించింది. ఐహెచ్‌హెచ్ ప్రతిపాదన వ్యూహాత్మకంగా, ఆర్థికంగాను మెరుగైనదిగా ఫోర్టిస్ హెల్త్‌కేర్ చైర్మన్ రవి రాజగోపాల్ పేర్కొన్నారు. డీల్ స్వరూపం సరళతరంగా ఉండటం, అవసరమయ్యే అనుమతులు తక్కువే ఉండటం, స్వల్ప వ్యవధిలో పూర్తి కానుండటం సానుకూలాంశాలని తెలిపారు. భారత ఉపఖండంలో కార్యకలాపాలు మరింతగా విస్తరించేందుకు ఈ కొనుగోలు తోడ్పడగలదని ఐహెచ్‌హెచ్ ఎండీ టాన్ సీ లెంగ్ తెలిపారు. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో ఓపెన్ ఆఫర్ ప్రకటించే అవకాశం ఉందని వివరించారు. దీర్ఘకాలంలో తమ అంతర్జాతీయ బ్రాండ్ ’గ్లెన్ఈగిల్స్’ చెయిన్ కింద ఫోర్టిస్‌ను చేర్చే అవకాశం ఉందని లెంగ్ వివరించారు. అవసరమైతే మరిన్ని నిధులను కూడా ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధమని ఆయన చెప్పారు. ‘ప్రస్తుతం ఫోర్టిస్‌కి రూ. 5,800–6,000 కోట్లు అవసరమవుతాయని భావిస్తున్నాం. ముందుగా రూ. 4,000 కోట్లు సమకూరుస్తున్నాం. అవసరమైతే మిగతా వాటాదారులతో సంప్రదించి మరిన్ని నిధులను కూడా సమకూర్చే అవకాశం ఉంది‘ అని లెంగ్ తెలిపారు. హోరాహోరీ పోటీ.. రుణ వివాదంలో వ్యవస్థాపకులు మల్వీందర్ సింగ్, శివీందర్ సింగ్ కంపెనీ నుంచి తప్పుకోవాల్సి రావడంతో ఫోర్టిస్‌కు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. వ్యవస్థాపకులిద్దరూ నిధులు కూడా మళ్లించారన్న ఆరోపణలూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఫోర్టిస్ టేకోవర్‌పై దిగ్గజ సంస్థలు కన్నేశాయి. ముందుగా మణిపాల్ హెల్త్ ఎంటర్ప్రైజెస్, అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టీపీజీ సంయుక్తంగా ఇచ్చిన ఆఫర్‌ను ఫోర్టిస్ బోర్డు ఆమోదించింది. అయితే, ఆ తర్వాత మరో నాలుగు సంస్థలు బరిలోకి దిగడంతో టేకోవర్ యుద్ధం రసవత్తరంగా మారింది. ఈ క్రమంలో ముంజాల్–బర్మన్ కుటుంబాల కన్సార్షియం సంయుక్తంగా ఇచ్చిన రూ. 1,800 కోట్ల ఆఫర్‌ను రెండో విడతలో ఫోర్టిస్ ఆమోదించింది. కానీ, దీన్ని షేర్హోల్డర్లు ఆమోదించలేదు. దీంతో బిడ్డింగ్ ప్రక్రియ మళ్లీ ప్రారంభించాల్సి వచ్చింది. మొత్తం మీద ముగ్గురు బిడ్డర్లు (ఐహెచ్‌హెచ్, టీపీజీ–మణిపాల్ కన్సార్షియం, ముంజాల్–బర్మన్ కన్సార్షియం)తో పాటు రేడియంట్–కేకేఆర్ కన్సార్షియం కూడా ఫోర్టిస్ కోసం పోటీపడగా చివరికి ఐహెచ్హెచ్హెచ్ దక్కించుకుంది. ఐహెచ్‌హెచ్ బిడ్ ఆమోదం వార్తల నేపథ్యంలో శుక్రవారం ఫోర్టిస్ హెల్త్‌కేర్ షేర్లు 4 శాతం పెరిగాయి. బీఎస్ఈలో 3.97 శాతం పెరిగి రూ. 147.80 వద్ద క్లోజయ్యింది. ఒక దశలో 5.10 శాతం కూడా ఎగిసింది. మరోవైపు, ఎన్ఎస్ఈలో ఫోర్టిస్ షేరు 3.93 శాతం పెరిగి రూ. 147.80 వద్ద ముగిసింది. సంస్థ మార్కెట్ విలువ రూ. 293 కోట్ల మేర ఎగిసి రూ. 7,666.13 కోట్లకు చేరింది. -
మలేషియా కంపెనీ చేతికి గ్లోబల్!
గ్లోబల్ హాస్పిటల్స్‌లో 73.4 శాతం వాటా కొంటున్న ఐహెచ్‌హెచ్ ♦ డీల్ విలువ రూ.1,280 కోట్లు; 3 నెలల్లో పూర్తి ♦ దేశంలో 1,800 పడకలకు చేరనున్న ఐహెచ్‌హెచ్ సామర్థ్యం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల సంస్థ గ్లోబల్ హాస్పిటల్స్... మలేషియా కంపెనీ పరమవుతోంది. ‘రవీంద్రనాథ్ జీఈ మెడికల్ అసోసియేట్స్’ పేరిట ఉన్న ఈ సంస్థలో 73.4 శాతం వాటాను ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్ కైవసం చేసుకుంటోంది. డీల్ విలువ దాదాపు 1,280 కోట్ల రూపాయలు. మూడు నెలల్లో డీల్ పూర్తి కానున్నట్టు సమాచారం. ఆరోగ్య సేవల రంగంలో మార్కెట్ విలువ పరంగా ఐహెచ్‌హెచ్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద సంస్థ. దక్షిణాదిలో నాలుగు ఆసుపత్రులతో పాటు ముంబైలోనూ ఆసుపత్రిని కలిగి ఉన్న గ్లోబల్‌ను కొనుగోలు చేయటం ద్వారా దేశంలో ఐహెచ్‌హెచ్ విస్తరించడానికి దోహదం చేయనుంది. అంతర్జాతీయంగా ఐహెచ్‌హెచ్‌కు ఉన్న అనుభవం, తమకున్న సామర్థ్యం కలిసి భారత్‌తోపాటు విదేశాల నుంచి వచ్చే రోగులకు సైతం మరింత మెరుగైన సేవలందించడానికి ఈ డీల్ దోహదపడనున్నట్లు గ్లోబల్ హాస్పిటల్స్ వ్యవస్థాపకులు డాక్టర్ కె.రవీంద్రనాథ్ ఈ సందర్భంగా తెలిపారు. ఇక సంస్థలో ఎవర్‌స్టోన్ క్యాపిటల్‌కు 54 శాతం, రవీంద్రనాథ్, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులకు 27 శాతం, ఆనంద్ రాఠి ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు 10 శాతం, వైద్యులు, ఇన్వెస్టర్లకు 9 శాతం వాటా ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో ఎవరి నుంచి ఎంత వాటా కొనుగోలు చేయనున్నదీ వెల్లడి కాకపోయినా... మొత్తమ్మీద 73.4 శాతం వాటాను ఐహెచ్‌హెచ్ కొనుగోలు చేయనున్నట్లు మాత్రం ధ్రువపడింది. గ్లోబల్ హాస్పిట ల్స్ విలువను రూ.1,744 కోట్లుగా లెక్క కట్టారు. వివిధ కంపెనీల్లో ఐహెచ్‌హెచ్.. భారత్‌లో అగ్రశ్రేణి హాస్పిటల్స్ గ్రూప్‌లలో ఒకటిగా తమను ఈ డీల్ నిలుపుతుందని ఐహెచ్‌హెచ్ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ టాన్ సీ లెంగ్ వ్యాఖ్యానించారు. ఈ డీల్‌కు సీఐఎంబీ సెక్యూరిటీస్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌లు ఫైనాన్షియల్ అడ్వైజర్స్‌గా వ్యవహరించాయి. హైదరాబాద్‌కు చెందిన కాంటినెంటల్ హాస్పిటల్స్‌లో 51 శాతం వాటాను ఈ ఏడాది మార్చిలో ఐహెచ్‌హెచ్ కొనుగోలు చేసింది. ఇందుకోసం సుమారు రూ.280 కోట్లు వెచ్చించింది. ప్రముఖ హాస్పిటల్స్ చైన్ అపోలో హాస్పిటల్స్‌లో సైతం దీనికి 10.85 శాతం వాటా ఉంది. గ్లోబల్ హాస్పిటల్స్ డీల్‌తో ఐహెచ్‌హెచ్ సామర్థ్యం భారత్‌లో 1,800 పడకలకు పెరుగుతుంది. 2020 నాటికి ఈ సామర్థ్యాన్ని 4,000 పడకలకు చేర్చాలని సంస్థ లక్ష్యంగా నిర్ధేశించుకుంది. ఐహెచ్హెచ్మొత్తం సామర్థ్యం 10 దేశాల్లో 45 ఆసుపత్రుల్లో 8,000 పడకలకు పైనే. కాగా, దేశంలో వైద్య రంగంలోకి ప్రైవేట్ ఈక్విటీ(పీఈ) పెట్టుబడులు 2013లో రూ.4,880 కోట్లు రాగా, 2014లో రూ.3,420 కోట్లు వచ్చినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇదీ గ్లోబల్ ప్రస్థానం.. గ్లోబల్ హాస్పిటల్స్ 1999లో ప్రారంభమైంది. కె.రవీంద్రనాథ్ సీఎండీగా తొలుత 50 పడకలతో లక్డీకాపూల్‌లో ఆసుపత్రి ఏర్పాటైంది. దీనిని 200 పడకలతో మల్టీ సూపర్ స్పెషాలిటీ స్థాయికి చేర్చారు. ఎల్బీ నగర్ ఆసుపత్రి పడకల సామర్థ్యం 300. చెన్నై, బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా గ్లోబల్ హాస్పిటల్స్ అడుగు పెట్టింది. ఏటా 3 లక్షల మంది ఔట్ పేషెంట్లు, 50 వేల మంది ఇన్ పేషంట్లకు వైద్య సేవలందిస్తోంది. ఏడాదికి 18 వేల శస్త్ర చికిత్సలు నిర్వహిస్తోంది. టెలి మెడిసిన్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది. ఔట్రీచ్ క్లినిక్స్ పేరుతో చిన్న నగరాలకూ వైద్య సేవలను పరిచయం చేస్తోంది.