మలేషియా కంపెనీ చేతికి గ్లోబల్! | Global company into the hands of Malaysia! | Sakshi
Sakshi News home page

మలేషియా కంపెనీ చేతికి గ్లోబల్!

Published Sat, Aug 29 2015 12:19 AM | Last Updated on Sun, Sep 3 2017 8:18 AM

మలేషియా కంపెనీ చేతికి గ్లోబల్!

మలేషియా కంపెనీ చేతికి గ్లోబల్!

గ్లోబల్ హాస్పిటల్స్‌లో 73.4 శాతం వాటా కొంటున్న ఐహెచ్‌హెచ్

♦ డీల్ విలువ రూ.1,280 కోట్లు; 3 నెలల్లో పూర్తి
♦ దేశంలో 1,800 పడకలకు చేరనున్న ఐహెచ్‌హెచ్ సామర్థ్యం
 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల సంస్థ గ్లోబల్ హాస్పిటల్స్... మలేషియా కంపెనీ పరమవుతోంది. ‘రవీంద్రనాథ్ జీఈ మెడికల్ అసోసియేట్స్’ పేరిట ఉన్న ఈ సంస్థలో 73.4 శాతం వాటాను ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్ కైవసం చేసుకుంటోంది. డీల్ విలువ దాదాపు 1,280 కోట్ల రూపాయలు. మూడు నెలల్లో డీల్ పూర్తి కానున్నట్టు సమాచారం. ఆరోగ్య సేవల రంగంలో మార్కెట్ విలువ పరంగా ఐహెచ్‌హెచ్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద సంస్థ. దక్షిణాదిలో నాలుగు ఆసుపత్రులతో పాటు ముంబైలోనూ ఆసుపత్రిని కలిగి ఉన్న గ్లోబల్‌ను కొనుగోలు చేయటం ద్వారా దేశంలో ఐహెచ్‌హెచ్ విస్తరించడానికి దోహదం చేయనుంది.

అంతర్జాతీయంగా ఐహెచ్‌హెచ్‌కు ఉన్న అనుభవం, తమకున్న సామర్థ్యం కలిసి భారత్‌తోపాటు విదేశాల నుంచి వచ్చే రోగులకు సైతం మరింత మెరుగైన సేవలందించడానికి ఈ డీల్ దోహదపడనున్నట్లు గ్లోబల్ హాస్పిటల్స్ వ్యవస్థాపకులు డాక్టర్ కె.రవీంద్రనాథ్ ఈ సందర్భంగా తెలిపారు. ఇక సంస్థలో ఎవర్‌స్టోన్ క్యాపిటల్‌కు 54 శాతం, రవీంద్రనాథ్, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులకు 27 శాతం, ఆనంద్ రాఠి ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు 10 శాతం, వైద్యులు, ఇన్వెస్టర్లకు 9 శాతం వాటా ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో ఎవరి నుంచి ఎంత వాటా కొనుగోలు చేయనున్నదీ వెల్లడి కాకపోయినా... మొత్తమ్మీద 73.4 శాతం వాటాను ఐహెచ్‌హెచ్ కొనుగోలు చేయనున్నట్లు మాత్రం ధ్రువపడింది. గ్లోబల్ హాస్పిట ల్స్ విలువను రూ.1,744 కోట్లుగా లెక్క కట్టారు.

 వివిధ కంపెనీల్లో ఐహెచ్‌హెచ్..
 భారత్‌లో అగ్రశ్రేణి హాస్పిటల్స్ గ్రూప్‌లలో ఒకటిగా తమను ఈ డీల్ నిలుపుతుందని ఐహెచ్‌హెచ్ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ టాన్ సీ లెంగ్ వ్యాఖ్యానించారు. ఈ డీల్‌కు సీఐఎంబీ సెక్యూరిటీస్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌లు ఫైనాన్షియల్ అడ్వైజర్స్‌గా వ్యవహరించాయి. హైదరాబాద్‌కు చెందిన కాంటినెంటల్ హాస్పిటల్స్‌లో 51 శాతం వాటాను ఈ ఏడాది మార్చిలో ఐహెచ్‌హెచ్ కొనుగోలు చేసింది. ఇందుకోసం సుమారు రూ.280 కోట్లు వెచ్చించింది. ప్రముఖ హాస్పిటల్స్ చైన్ అపోలో హాస్పిటల్స్‌లో సైతం దీనికి 10.85 శాతం వాటా ఉంది.

 గ్లోబల్ హాస్పిటల్స్ డీల్‌తో ఐహెచ్‌హెచ్ సామర్థ్యం భారత్‌లో 1,800 పడకలకు పెరుగుతుంది. 2020 నాటికి ఈ సామర్థ్యాన్ని 4,000 పడకలకు చేర్చాలని సంస్థ లక్ష్యంగా నిర్ధేశించుకుంది. ఐహెచ్‌హెచ్‌మొత్తం సామర్థ్యం 10 దేశాల్లో 45 ఆసుపత్రుల్లో 8,000 పడకలకు పైనే. కాగా, దేశంలో వైద్య  రంగంలోకి ప్రైవేట్ ఈక్విటీ(పీఈ) పెట్టుబడులు 2013లో రూ.4,880 కోట్లు రాగా, 2014లో రూ.3,420 కోట్లు వచ్చినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
 
 ఇదీ గ్లోబల్ ప్రస్థానం..
 గ్లోబల్ హాస్పిటల్స్ 1999లో ప్రారంభమైంది. కె.రవీంద్రనాథ్ సీఎండీగా తొలుత 50 పడకలతో లక్డీకాపూల్‌లో ఆసుపత్రి ఏర్పాటైంది. దీనిని 200 పడకలతో మల్టీ సూపర్ స్పెషాలిటీ స్థాయికి చేర్చారు. ఎల్‌బీ నగర్ ఆసుపత్రి పడకల సామర్థ్యం 300. చెన్నై, బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా గ్లోబల్ హాస్పిటల్స్ అడుగు పెట్టింది.  ఏటా 3 లక్షల మంది ఔట్ పేషెంట్లు, 50 వేల మంది ఇన్ పేషంట్లకు వైద్య సేవలందిస్తోంది. ఏడాదికి 18 వేల శస్త్ర చికిత్సలు నిర్వహిస్తోంది. టెలి మెడిసిన్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది. ఔట్‌రీచ్ క్లినిక్స్ పేరుతో చిన్న నగరాలకూ వైద్య సేవలను పరిచయం చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement