భారీ జరిమానాతో కుదేలైన షేర్లు
ముంబై: ఢిల్లీ సర్కార్ విధించిన భారీ జరిమానా నేపథ్యంలో ఫోర్టిస్ హెల్త్ కేర్ షేర్లు భారీగా నష్టపోయాయి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అతి తక్కువ ధరలకే వైద్య సేవలు అందించడం లేదని ఆరోపిస్తూ ఫోర్టిస్ హెల్త్ కేర్ అనుబంధ సంస్థ పై 503 కోట్ల రూపాయల భారీ జరిమానా విధించడంతో సోమవారం నాటి స్టాక్ మార్కెట్ లో నష్టాలను మూటగట్టుకుంది. ఈ మొత్తం సొమ్మును డిపాజిట్ చేయాలని హెల్త్ సర్వీసెస్ డైరెక్టరేట్ జనరల్ (డీహెచ్ ఎస్) ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఫోర్టిస్ హెల్త్కేర్ షేర్లు 5 శాతం నష్టాలను చవిచూసింది. భూ కేటాయింపుల సందర్భంగా చేసుకున్న లీజు ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ ఫోర్టిస్ ఆసుపత్రిపై ఆప్ సర్కార్ కన్నెర్ర చేసింది. 1984-07 సంవత్సరాలకు సంబంధించిన ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్సిస్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆర్జించిన అసహజ లాభాల్లో 503 కోట్ల రూపాయలను జమ చేయాలని డీహెచ్ఎస్ ఆదేశించింది. దీంతో బీఎస్ఈ ఫోర్టిస్ హెల్త్కేర్ షేర్లు భారీగా నష్టపోయాయి. ముగింపులో కోలుకొని రూ 165 దగ్గర నిలదొక్కుకుంది. అయితే ఈ ఆదేశాలపై ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేయనున్నట్టు ఫోర్టిస్ ప్రతినిధులు తెలిపారు.
కాగా ఆర్థికంగా బలహీనమైన సెక్షన్ల రోగులకు సబ్సీడిపై చికిత్సను అందించడంలో విఫలమైనందుకు పలు ప్రయివేటు ఆసుపత్రులపై ఢిల్లీ సర్కార్ కొరడా ఝళిపించింది. పేదలకు అతి తక్కువ ధరలకు వైద్య సేవలను అందించాలన్న నిబంధనకు అంగీకరించి, తక్కువ ధరలకు విలువైన స్థలాలను పొంది, అనంతరం ఆ నిబంధనను తుంగలో తొక్కిన నగరంలోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇనిస్టిట్యూట్, మాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, శాంతి ముకంద్ హాస్పిటల్, ధర్మషీలా క్యాన్సర్ హాస్పిటల్, పుష్పవతి సింఘానియా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లపై రూ.600 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.