విమాన టిక్కెట్ల బుకింగ్‌కు కొత్త నిబంధనలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయంగా విమాన ప్రయాణీకులకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను అమలు చేయనుంది. దేశీయ సర్వీసులపై కూడా తప్పనిసరి నిబంధనలను తీసుకురానుంది. ముఖ్యంగా దేశీయ విమాన టికెట్ల బుకింగ్ కోసం ఏదో ఒక ఐడి కార్డు జతచేయడం మాండేటరీ చేయనుంది. దీనికి సంబంధించి నో ఫ్లై లిస్ట్ (ఎన్‌ఎఫ్‌ఎల్)ను ఈ శుక్రవారం ప్రకటించనుంది. వచ్చే ఏడాది జులై నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
కేంద్రం ప్రకటించనున్న ఈ కొత్త నిబంధనల ప్రకారం దేశీయ విమానం టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఏదో ఒక గుర్తింపు కార్డు జతచేయాల్సిందే. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఓటర్ ఐడి లాంటి గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి తప్పనిసరి అని పౌర విమానయాన శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా తెలిపారు. మంగోలియాలో జరిగిన విమానయాన భద్రత సదస్సులో పాల్గొని తిరిగొచ్చిన సందర్భంగా మంత్రి 'నో ఫ్లయ్' జాబితాపై నిబంధనలను రూపొందించినట్లు పేర్కొన్నారు. తుది నియమాలను శుక్రవారం నాడు విడుదల చేయనున్నామని తెలిపారు.
ఎన్‌ఎఫ్‌ఎల్ అమలు ఖరారైన తరువాత ఈ జాబితాలోని వారు మారు పేర్లతో టికెట్లను కొనుగోలు చేయకుండా చూసేందుకు సాధ్యమైనంత త్వరలో డిజిటల్ బోర్డింగ్ కార్డులను ప్రవేశపెట్టనున్నామన్నారు. దీని కోసం ఆధార్ కార్డులతో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. విమానాల భద్రత, అవాంఛనీయ ఘటనల నివారణ లక్ష్యంగా నో ఫ్లయ్ జాబితా నిబంధనలను తయారు చేసినట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ చీఫ్ బీఎస్ భుల్లార్ వెల్లడించారు.
కాగా ఇప్పటివరకూ అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు పాస్ పోర్టు తప్పనిసరి, కానీ దేశీయ విమానాల టిక్కెట్ బుకింగ్‌కు ఎలాంటి గుర్తింపు కార్డు అవసరం లేదు. అయితే ఇకపై నిబంధనలో మార్పులు చోటుచేసుకోబోతున్నాయి.