
సాక్షి, న్యూఢిల్లీ : రోజువారీ ధరల సమీక్ష ప్రారంభించినప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ ఇంధన ధరల ప్రభావంతో, దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పైకి ఎగుస్తున్నాయని, త్వరలోనే తగ్గుతాయంటూ ప్రకటనల మీద ప్రకటనలు ఇచ్చేస్తోంది. జూన్ మధ్య కాలం నుంచి అంటే రోజువారీ ధరల సమీక్ష ప్రారంభించినప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు 8 శాతం పైకి జంప్ చేసినట్టు రేటింగ్ ఏజెన్సీ ఐక్రా పేర్కొంది. ఈ ధరలు ఇలా భారీగా పెరగడం, డిమాండ్ వృద్ధిపై ప్రభావం చూపుతుందని, అంతేకాక ద్రవ్యోల్బణ ఒత్తిడికి దారితీస్తుందని ఐక్రా ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అంతర్జాతీయంగా డీజిల్, పెట్రోల్ ధరలు 14 శాతం పెరగడం వల్ల, దేశీయంగా ఇంధన రేట్లు పెరుగుతున్నాయని, అంతేకాక పెట్రోల్ పంపు డీలర్లకు ఇచ్చే కమిషన్ పెంచడం కూడా వీటిపై ప్రభావం చూపుతున్నాయని ఈ రేటింగ్ ఏజెన్సీ రిపోర్టు తెలిపింది. డీలర్లకు ఇచ్చే కమిషన్ 40 శాతం ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. అంతకముందు రూ.2.55గా ఉన్న కమిషన్‌ను రూ.3.57కు పెంచింది.
దీంతో వారి మార్కెటింగ్ మార్జిన్లు కూడా పెరుగుతున్నాయి. జూన్ 17 నుంచి ఢిల్లీలో పెట్రోల్ ధరలు 7.9 శాతం పెరిగి లీటరుకు రూ.70.41గా నమోదయ్యాయి. కొంతమంది డీలర్లు, వినియోగదారులు ధరల మార్పులను ముందుగానే అంచనావేసి, బల్క్ మొత్తంలో కొనుగోళ్లు చేపడుతున్నారని ఐక్రాకు చెందిన అధికారి కే. రవిచంద్రన్ పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల ఆయిల్ కంపెనీలు మార్జిన్లు కోల్పోతున్నాయని చెప్పారు. అదేవిధంగా తక్కువ రాజకీయ ప్రమేయం, ఎక్కువ స్వయం ప్రతిపత్తితో ఆయిల్ సంస్థలు తమ మార్కెటింగ్ మార్జిన్లను పెంచుకుంటున్నాయని కూడా తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వ జోక్యం చేసుకుంటే, ధరల సమీక్షలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల స్వతంత్ర తగ్గి, ధరల పెరుగుదలను అరికట్టవచ్చని చెప్పారు.