పిల్లల ప్రగతికి పెట్టుబడి ఎలా? | Funds And Policy Fotr Children Future | Sakshi
Sakshi News home page

పిల్లల ప్రగతికి పెట్టుబడి ఎలా?

Published Mon, Nov 26 2018 12:02 PM | Last Updated on Mon, Nov 26 2018 12:02 PM

Funds And Policy Fotr Children Future - Sakshi

పిల్లల భవిష్యత్తు లక్ష్యాలు సఫలం కావాలంటే వారు చిన్నగా ఉన్నప్పటి నుంచే తల్లిదండ్రులు తగిన శ్రద్ధ తీసుకోవడం అవసరం. ఇందుకోసం తగిన పెట్టుబడి సాధనాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. విద్య, వివాహం అన్నవి పిల్లలకు సంబంధించి అత్యంత ముఖ్యమైన, పెద్దవైన లక్ష్యాలు. విద్యా వ్యయం విపరీతంగా పెరిగిపోతున్న క్రమంలో వీటికి ఏ విధంగా సన్నద్ధులు కావాలి, ఏ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేయాలన్నది తల్లిదండ్రులు తప్పకుండా తెలుసుకోవాలి. వేటిల్లో ఇన్వెస్ట్‌ చేస్తే, మీ పిల్లల లక్ష్యాలను సాకారం చేసేందుకు సరిపడా నిధులు సమకూరతాయి అన్నవి గమనించాలి. యులిప్‌లు తీసుకోవాలా లేక సుకన్య సమృద్ధి యోజన, లేక రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడి... ఇవేవీ కాకుండా అంతా ఎఫ్‌డీల్లో పెట్టేయడం... ఎలా అడుగులు వేస్తే అది మీరు ఆశించిన లక్ష్యాలను నెరవేరుస్తుందో తెలుసుకోవాలి.    – సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం

మీ పిల్లల విద్య, వివాహాల వంటి లక్ష్యాలకు తగినంత నిధిని సమకూర్చుకోవాలంటే దానికంటే ముందు లక్ష్యాల్లో స్పష్టత తెచ్చుకోవాలి. అలాగే, కొన్నేళ్ల తర్వాత విద్య కోసం ఎంత ఖర్చవుతుంది, అందుకు ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే అదనంగా ఎంత మేర సమకూర్చుకోవాలన్నవి పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. దీనికితోడు ఈ లక్ష్యాలకు కాల వ్యవధులను నిర్ణయించుకోవాలి. ఆ తర్వాత వీటి కోసం తగిన పెట్టుబడి సాధనాలను ఎంపిక చేసుకోవడం కీలకం అవుతుంది. అంటే ఈక్విటీ, డెట్, రియల్‌ ఎస్టేట్, బంగారం వంటి వాటిల్లో రాబడుల వృద్ధితో పాటు పెట్టుబడికి భద్రత ఉండేలా పెట్టుబడుల కేటాయింపు ఉండాలి.  కొన్ని ఈక్విటీ సాధనాలు, డెట్‌ సాధనాలను వేర్వేరుగా ఎంచుకోవచ్చు. లేదా రెండింటితో కూడిన బ్యాలెన్స్‌డ్‌ ఫండ్స్‌ను అయినా ఎంపిక చేసుకోవచ్చు. వీటి పట్ల ఓ స్పష్టత వస్తే అప్పుడు మీ ప్రయాణం సులువుగా సాగిపోతుంది.

చిన్నారుల లక్ష్యాలకు ఏ ఫండ్స్‌?
చాలా మంది పెట్టుబడి ప్రారంభంలో చూపించినంత శ్రద్ధ, కట్టుబాటు ఆ తర్వాత కొనసాగించలేరు. ‘‘తమ లక్ష్యానికి అనుగుణంగా ఈక్విటీ, డెట్‌ మిశ్రమంగా పోర్ట్‌ఫోలియో ఏర్పాటు చేసుకోవడం మంచిది. దీర్ఘకాలానికి అయితే ఈక్విటీలు అనుకూలం. స్వల్పకాల లక్ష్యాలు అయితే డెట్‌ నయం’’ అని అర్థయంత్ర సీఈవో నితిన్‌ వ్యాకరణం తెలిపారు. 8–10 ఏళ్ల కాలం కోసం ఈక్విటీ ఫండ్స్‌ లేదా ఈక్విటీల్లో 80 శాతం వరకు ఇన్వెస్ట్‌ చేసే డైవర్సిఫైడ్‌ ఫండ్స్‌ ఎంచుకోవచ్చు. ఇవి 12 శాతం వరకు రాబడులను ఇస్తాయి. ఇక పదేళ్ల కాలంలో రిస్క్‌ దాదాపుగా తక్కువే. లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చని 5నాన్స్‌ సహ వ్యవస్థాపకుడు దినేష్‌ రోహిరా తెలిపారు. మధ్యకాల లక్ష్యాల కోసం బ్యాలెన్స్‌డ్‌ లేదా హైబ్రిడ్‌ ఫండ్స్‌ ఎంచుకోవచ్చని సూచించారు. ఇవి ఈక్విటీ, డెట్‌లో 60:40 శాతం మేర ఇన్వెస్ట్‌ చేస్తాయి. 2–3 ఏళ్ల కాలం కోసం షార్ట్‌ డ్యూరేషన్‌ ఫండ్స్‌ తగినవి. ఇవి బ్యాంకు ఖాతా కంటే అధిక రాబడులను ఇస్తాయి. వీటిల్లో భద్రత కూడా ఎక్కువే.  

విద్యారుణం
పిల్లల ఉన్నత విద్యావసరాలను అధిగమించడం అన్నది చాలా మంది తల్లిదండ్రులకు నిజంగా ఆందో ళన కలిగించే విషయమే. అయితే ఎక్కువ మంది చేసే పొరపాటు ఏమిటంటే సరైన సమయంలో పెట్టుబడి ఆరంభించకపోవడమే. దీంతో అవసరం ఎదురయ్యే నాటికి తగినంత నిధి ఉండదు. దీంతో తల్లిదండ్రులు ఇతర అవసరాల కోసం సమకూర్చుకున్నవాటిని ఖర్చు చేసే పరిస్థితి ఎదురవుతుంది. తమ పేరిట ఉన్న ఇళ్లను తనఖా పెట్టడం, చివరికి పదవీ విరమణ అనంతరం జీవన అవసరాల కోసం సమకూర్చుకునే వాటినీ ఖర్చే చేసేవారు ఉన్నారు. ‘‘ఒకవేళ పిల్లలు స్థిరపడిన తర్వాత తల్లిదండ్రులకు మద్దతుగా నిలవలేకపోతే ఏంటి పరిస్థితి? రిటైర్‌మెంట్‌ కోసం ఇచ్చే రుణం అంటూ ఏదీ లేదు. కనుక వీటికి బదులు విద్యారుణం తీసుకోవడం మంచి ఆప్షన్‌ అవుతుంది. దీనివల్ల రిటైర్మెంట్‌ కోసం ఏర్పా టు చేసుకున్న నిధి సురక్షితంగా ఉంటుంది. విద్యా రుణం తీసుకోవడం వల్ల పన్ను ప్రయోజనాలు కూడా ఉన్నాయి’’ అని దినేష్‌ రోహిరా తెలిపారు. 

రియల్‌ ఎస్టేట్‌ సరైనదేనా?
చాలా కారణాల రీత్యా చిన్నారుల భవిష్యత్తు లక్ష్యాల కోసం రియల్‌ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌ చేయడం సరైనది కాదని పీక్‌ ఆల్ఫా ఇన్వెస్ట్‌మెంట్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ ప్రియా సుందర్‌ పేర్కొన్నారు. ‘‘గత దశాబ్ద కాలం లో తక్కువ రాబడుల రేటు ఉన్న దృష్ట్యా  భవిష్యత్తులో ఏ విధంగా పెరుగుతుందన్నది తెలియదు. దీంతో డబ్బులు అవసరం పడినప్పుడు ధరలు సహేతుకంగా లేకుంటే అమ్మలేని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రాపర్టీ ట్యాక్స్, మెయింటెనెన్స్‌ చార్జీలు, లావాదేవీ రుసుములు, క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ వంటివి ఉం టాయి’’ అని సుందర్‌ వివరించారు. రియల్‌ ఎస్టేట్‌ కంటే బ్యాలెన్స్‌డ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా అధిక రాబడులు అందుకోవచ్చని సూచించారు. 

యులిప్‌ లేక ఎండోమెంట్‌ ప్లాన్‌
వాస్తవం మాట్లాడుకోవాలంటే చిన్నారికి సంబంధించిన భవిష్యత్తు లక్ష్యాల విషయంలో ఈ రెండూ కూడా ఉపయోగమైనవి కావు. ‘‘తల్లిదండ్రులు బీమాను పెట్టుబడిగా చూస్తున్నట్టయితే ఈ రెండూ సూచనీయం కాదు. ఈ రెండింటినీ కలగలపకూడదు’’ అని నితిన్‌ వ్యాకరణం తెలిపారు. ‘‘ఎండోమెంట్, మనీ బ్యాక్‌ పాలసీలు ఈ రెండింటికీ దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి 4–6 శాతం రాబడులను మించి ఇవ్వలేవు. కనుక తల్లిదండ్రులు పిల్లల ఆధారిత బీమా ఉత్పత్తులు, ప్లాన్ల ఆకర్షణలో పడొద్దు’’అని హ్యాపీనెస్‌ ఫ్యాక్టరీ వ్యవస్థాపకుడు అమర్‌ పండిట్‌ తెలిపారు. చిన్నారులకు బీమా అవసరం ఉండదు. ఇది కావాల్సింది వారిని సంరక్షించే తల్లిదండ్రులకేనన్న విషయాన్ని తెలుసుకోవాలి. టర్మ్‌ప్లాన్, మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులను ఎంచుకోవడం మంచి ఆప్షన్‌ అని దాదాపు అందరు ఫైనాన్షియల్‌ అడ్వైజర్లు సూచించేదే. పిల్లల ప్లాన్లతో పోలిస్తే... మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లో పారదర్శకత ఎక్కువ. ఏ పథకంలో రాబడులు ఏ మేరకు ఉన్నాయో సులభంగా తెలుసుకోవచ్చు. మరింత పరిశోధన సమాచారం అందుబాటులో ఉంటుంది. మ్యూచువల్‌ ఫండ్స్‌కు అదనంగా పిల్లల దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటే అప్పుడు యులిప్‌ను ఎంచుకోవచ్చు. ఎందుకంటే తల్లిదండ్రులు లేకపోయినా, వారి పేరిట పెట్టుబడి ఈ ప్లాన్లలో కొనసాగుతుంది.

సుకన్య సమృద్ధి/ పీపీఎఫ్‌/ ఎఫ్‌డీ
సుకన్య సమృద్ధి లేదా పీపీఎఫ్‌ లేదా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఇవన్నీ కూడా డెట్‌ సాధనాలు. ఇవి పెట్టుబడుల పరంగా రిస్క్‌ను తగ్గిస్తాయి. ముఖ్యంగా వీటిల్లో సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్‌ అన్నవి మంచి సాధనాలు అవుతాయి. మీ లక్ష్యానికి అనువైనది ఎంచుకోవడమే మీరు చేయాల్సింది. 10 ఏళ్లలోపు కుమార్తెలు ఉన్నట్టయితే వారి వివాహానికి 21 ఏళ్ల వ్యవధి ఉంటుంది. ‘‘ఇందులో పెట్టుబడి, దానిపై వడ్డీ, గడువు తీరిన తర్వాత వచ్చే మొత్తం కూడా సుకన్య నమృద్ధి యోజన పథకంలో పన్ను మినహాయింపు ఉంది. దీంతో గడువు తీరిన తర్వాత వచ్చే మొత్తం ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ద్రవ్యోల్బణంతో చూస్తే భారీ రాబడులు ఏమీ కాదు. పైగా ఆర్థిక వృద్ధి మరింత పెరిగి, వడ్డీ రేట్లు పడిపోతే ఇప్పుడున్న 8.5 శాతం వడ్డీ రేటు స్థిరంగా ఉండదు’’అని సుందర్‌ తెలిపారు. ఇక, చిన్నారి 9 ఏళ్ల వయసులో ఇందులో పెట్టుబడి ఆరంభిస్తే, ఆమెకు 18 ఏళ్లు వచ్చిన తర్వాత పెట్టుబడిలో కేవలం 50 శాతమే వెనక్కు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది కనుక పెద్దగా సమకూరకపోవచ్చు. పీపీఎఫ్‌ పథకం 15 ఏళ్ల కాల వ్యవధితో ఉంటే, ఏడేళ్ల తర్వాత కొద్దిమేరే ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఇక ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు అన్నవి స్వల్ప కాల లక్ష్యాల కోసమే ఎంచుకోవాలి. ఎందుకంటే వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. పైగా వడ్డీ పన్ను పరిధిలోకి వస్తుంది.

ఆభరణాల్లో పెట్టుబడి?
భౌతిక బంగారంలో పెట్టుబడికి ఎన్నో ప్రతికూలతలు ఉన్నాయి. అందుకే నిపుణులు ఎవరూ పెట్టుబడి కోసం ఆభరణాలను సూచించరు. ‘‘మీ పిల్లల వివాహానికి బంగారు ఆభరణాలను కానుకలుగా ఇవ్వదలిస్తే అది మంచిదే. కానీ, బంగారంలో ఇన్వెస్ట్‌ చేయ డాన్ని నేను సిఫారసు చేయను. ప్రాక్టికల్‌గా చూస్తే సార్వభౌమ బంగారం బాండ్లలో ఇన్వెస్ట్‌ చేయడం ఉత్తమమైన ఆప్షన్‌ అవుతుంది’’ అని యూనోవెస్ట్‌ వ్యవస్థాపకుడు విపిన్‌ ఖండేల్‌వాల్‌ తెలిపారు. బాండ్లను విక్రయించే సమయంలో నాటి బంగారం మార్కెట్‌ ధర పొందడమే కాకుండా, అదనంగా ఏటా 2.5 శాతం వడ్డీ కూడా సార్వభౌమ బంగారం బాండ్లలో లభిస్తుంది. ఇక భౌతిక బంగారాన్ని భద్రంగా ఉంచుకునేందుకు వెచ్చించాల్సిన ఖర్చులు కూ డా తప్పుతాయి. బాండ్లను కాల వ్యవధి తీరే వరకు ఉంచుకుంటే క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement