సాధారణ బీమా పరిశ్రమ ప్రీమియంలో 16 శాతం వృద్ధి
ముంబై: ముగిసిన ఏప్రిల్ నెలలో సాధారణ బీమా పరిశ్రమ ప్రీమియం వసూళ్లలో 16 శాతం వృద్ధి సాధించింది. ఇది గతేడాది ఇదేనెలలో పోలిస్తే రూ. 10,500 కోట్ల నుంచి రూ. 12,206 కోట్లకు పెరిగినట్లు ఐఆర్‌డీఏ డేటా వెల్లడిస్తోంది. 2017 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రీమియం వసూళ్లు 30 శాతం వృద్ధిచెందాయి. అయితే ఏప్రిల్ నెల గణాంకాల్లో పంట బీమా విభాగం లేనందున వృద్ధి తక్కువగా కన్పిస్తోంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగం నుంచి రూ. 18,000 కోట్ల ప్రీమియం వసూళ్లు జరిగాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్ సీజన్ మొదలయ్యాక, పంట బీమా ప్రీమియం వసూళ్లు జరుగుతాయి. ఇక ఏప్రిల్ నెల ప్రీమియం వసూళ్లకు సంబంధించి ప్రైవేటు రంగ సాధారణ బీమా కంపెనీల వృద్ధి ప్రభుత్వ కంపెనీలను దాటింది. ముగిసిన నెలలో ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీల ప్రీమియం వసూళ్లు 5.42 శాతం వృద్ధితో రూ. 5,906 కోట్లకు చేరగా, ప్రైవేటు రంగ కంపెనీల వసూళ్లు 27.88 శాతం వృద్ధిచెంది రూ. 6,302 కోట్లకు పెరిగాయి.
ఏప్రిల్ 1 నుంచి థర్డ్‌పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియం పెరిగిన నేపథ్యంలో ఈ వసూళ్లు అత్యధికంగా 23 శాతం వృద్ధిచెందాయి. ఆరోగ్య బీమా ప్రీమియం వసూళ్లు 9 శాతం పెరగ్గా, ఏవియేషన్, మెరైన్ విభాగాలు ప్రతికూల వృద్ధిని నమోదుచేసినట్లు ఐఆర్‌డీఏ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.