టాటా మోటార్స్ తొలి స్పోర్ట్స్‌కారు ‘రేస్‌మో’
జెనీవా ఆటో షోలో ఆవిష్కరణ
జెనీవా: టాటా మోటార్స్ కంపెనీ తన తొలి స్పోర్ట్స్ కారు, రేస్‌మోను జెనీవా మోటార్ షోలో ఆవిష్కరించింది. టాటా సన్స్ ఎమిరిటస్ రతన్‌టాటా, టాటా సన్స్ కొత్త చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్‌ల సమక్షంలో ఈ ఆవిష్కరణ జరిగింది. తన ఉపబ్రాండ్ టామో కింద ఈ రేస్‌మో స్పోర్ట్స్‌కారును టాటా మోటార్స్ మార్కెట్లోకి తెస్తోంది. టామో బ్రాండ్ కింద వస్తున్న తొలి మోడల్– ఈ రెండు సీట్ల స్పోర్ట్స్ కూపేతో పాటు సెడాన్ టైగర్, ఎస్‌యూవీ నెక్సన్, యూరప్ మార్కెట్ కోసం ఉద్దేశించిన పిక్సెల్ కారు మోడళ్లను కూడా ఈ ఆటో షోలో టాటా మోటార్స్ ప్రదర్శించింది.
యూత్‌ఫుల్ బ్రాండ్‌గా టాటా మోటార్స్...
టాటా మోటార్స్‌ను యూత్‌ఫుల్‌బ్రాండ్‌గా మార్చే ప్రయత్నాల్లో భాగంగా రేస్‌మో పేరుతో స్పోర్ట్స్ కారును అందిస్తున్నామని టాటా మోటార్స్ సీఈఓ, ఎండీ, గుంటర్ బుశ్చక్ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ కారును మార్కెట్లోకి తెస్తామని పేర్కొన్నారు. అడ్వాన్స్‌డ్ నావిగేషన్, రిమోట్ మానిటరింగ్, ఇంటర్నెట్ ఆఫ్ ధింగ్స్, మైక్రోసాఫ్ట్ అజూర్ పవర్‌తో కూడిన మెషీన్ లర్నింగ్ తదితర అధునాతన, వినూత్న ఫీచర్లతో ఈ కారును అందిస్తున్నామని పేర్కొన్నారు. మరోవైపు ఈ కంపెనీ సాంకేతిక భాగస్వామి, మైక్రోసాఫ్ట్ రేస్‌మోప్లస్ పేరుతో ఒక వీడియో గేమ్‌ను ఆఫర్ చేస్తోంది. మరో 22 రోజుల్లో టైగర్ మోడల్‌ను భారత్‌లోకి తెస్తామన్నారు.
విలువైన యాత్ర...: రతన్ టాటా
20 ఏళ్ల క్రితం ఇండికా కారుతో తమ యాత్ర ప్రారంభమైందని రతన్ టాటా చెప్పారు. తాజాగా అందిస్తున్న రేస్‌మో దాకా తమ యాత్ర విలువైనదిగా సాగుతోందని సంతృప్తి వ్యక్తం చేశారు. తమ కంపెనీ డిస్‌ప్లే చేసిన మోడల్స్ అద్భుతంగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. నానో కారుపై వ్యాఖ్యానించమని కోరగా ఆయన నిరాకరించారు. జెనీవాలో జరుగుతున్న ఈ ఆటో షోకు మంగళవారం మీడియాను ప్రత్యేకంగా అనుమతించారు. ఈ నెల 9–19 మధ్య ప్రజలను అనుమతిస్తారు.