గీతాంజలి జెమ్స్(ఫైల్ ఫోటో)
పంజాబ్ నేషనల్ బ్యాంకులో చోటుచేసుకున్న కుంభకోణం దెబ్బకు గీతాంజలి జెమ్స్ షేర్లు పాతాళానికి పడిపోయాయి. వరుసగా ఏడు సెషన్ల నుంచి తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. గత వారం నుంచి ఇప్పటి వరకు గీతాంజలి జెమ్స్ షేర్లు దాదాపు 58.5 శాతం కుప్పకూలాయి. దీంతో గీతాంజలి జెమ్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్కసారిగా రూ.435.41 కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. నేటి ట్రేడింగ్‌లోనే బీఎస్‌ఈలో ఈ స్టాక్ 4.92 శాతం కిందకి పడిపోయింది. ఎన్‌ఎస్‌ఈలో కూడా 4.92 శాతం కిందకి పడిపోయి రూ.26.05 వద్ద ట్రేడవుతోంది.
పంజాబ్ నేషనల్ బ్యాంకులో వెలుగుచూసిన రూ.11,400 కోట్ల కుంభకోణంలో ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, ఆయన కుటుంబానికి చెందిన ప్రమేయమున్నట్టు తెలిసింది. దీంతో వారికి చెందిన గీతాంజలి జెమ్స్‌పై సీబీఐ, ఈడీ అధికారులు భారీ ఎత్తున్న తనిఖీలు చేస్తున్నారు. కొన్ని షోరూంలను సీజ్ కూడా చేశారు. ఐటీ కూడా గీతాంజలి జెమ్స్‌కు చెందిన కొన్ని ఆస్తులను సీజ్ చేసింది. మరోవైపు గీతాంజలి జెమ్స్ మూతపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగులకు సైతం వార్నింగ్ లేఖలు వెళ్లాయి. ఈ పరిణామాల నేపథ్యంలో గీతాంజలి జెమ్స్ షేరు విలువ భారీగా పతనమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment