పీఎన్‌బీ - నీరవ్ మోదీ స్కాం (ఫైల్ ఫోటో)
తనను సర్వనాశనం చేశారంటూ పంజాబ్ నేషనల్ బ్యాంకుకు నీరవ్ మోదీ రాసిన లేఖపై, బ్యాంకు ఆగ్రహం వ్యక్తంచేసింది. తన కంపెనీలకు జారీచేసిన లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్ అక్రమమైనవని, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ ఉల్లంఘనకు పాల్పడుతున్నాయని, అందుకే ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని గట్టి చురకలే అందించింది. ఈ నేపథ్యంలోనే స్కాంను బయటికి వెల్లడించామని పేర్కొంది. నీరవ్ పొందిన మొత్తం రుణ ప్రక్రియ 'మనీ లాండరింగ్' కిందకి వస్తుందంటూ పీఎన్‌బీ స్పష్టంచేసింది. ''మీరు ఎల్‌ఓయూలను అక్రమంగా పొందారు. కొందరు బ్యాంకు అధికారుల ద్వారా అనధికారిక మార్గంలో వీటిని ఉపయోగించుకున్నారు. ఇలాంటి వాటిని బ్యాంకు ఉపేక్షించదు. ఈ అక్రమ కార్యకలాపాలు ఎఫ్‌ఈఎంఏ, మనీ లాండరింగ్ ఉల్లంఘనల కిందకి వస్తాయి'' అని నీరవ్ మోదీ లేఖకు స్పందిస్తూ పీఎన్‌బీ జనరల్ మేనేజర్ అశ్విని వాట్స్ తిరిగి లేఖ రాశారు.
ఈ కార్యకలాపాలను లా అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల దృష్టికి తీసుకురావాలని బ్యాంకు నిర్ణయించిందని తెలిపారు. బ్యాంకు యాజమాన్యం అత్యుత్సాహంతో వ్యవహరించి, తన దారులన్నింటినీ మూసివేసిందని ఆరోపిస్తూ బ్యాంకు యాజమాన్యానికి నీరవ్ మోదీ ఒక లేఖ రాసిన సంగతి తెలిసిందే. తన బ్రాండును దెబ్బతీసిందని ఆరోపించారు. పీఎన్‌బీ తనపై అన్నీ తప్పుడు ఆరోపణలు చేసిందనీ, ఇప్పటికైనా ఫైర్‌స్టార్ గ్రూపునకు చెందిన విలువైన ఆస్తులను విక్రయించి, బకాయిలు తీర్చే అవకాశం ఇవ్వాలని కోరాడు. ఈ లేఖపై పీఎన్‌బీ ఈ విధంగా స్పందించింది.
Comments
Please login to add a commentAdd a comment