ప్రపంచ మార్కెట్ల బాటలో...
♦ బ్రిటన్ ఎగ్జిట్ భయాలు
♦ 201 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్
♦ నిఫ్టీ 66 పాయింట్లు డౌన్
ఒక రోజు విరామం తర్వాత భారత్ మార్కెట్ తిరిగి డౌన్‌ట్రెండ్‌లోకి జారిపోయింది. ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో గురువారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 201 పాయింట్లు క్షీణించి 26,525 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఒక దశలో 400 పాయింట్లకుపైగా పతనం కాగా, కనిష్టస్థాయిలో షార్ట్ కవరింగ్ జరగడంతో నష్టాలు తగ్గాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 66 పాయింట్లు పతనమై 8,141 వద్ద క్లోజ య్యింది.
అంతర్జాతీయ అంశాల ప్రభావం...యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలా, వద్దా అనే అంశమై ఈ నెల 23న జరగనున్న రిఫరెండం పట్ల ప్రపంచ మార్కెట్లలో భయాలు నెలకొన్నాయని విశ్లేషకులు చెప్పారు. దీనికి తోడు బ్యాంక్ ఆఫ్ జపాన్ ఆర్థిక వ్యవస్థకు మరింత ఉద్దీపన ఇచ్చేందుకు విముఖత చూపడం, అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఆ దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అంచనాల్ని తగ్గించడం వంటి అంశాలు ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపాయని విశ్లేషకులు వివరించారు. బుధవారం ముగిసిన ఫెడ్ సమీక్షలో వడ్డీ రేట్లను యధాతథంగా అట్టిపెట్టినప్పటికీ, అమెరికా వృద్ధి రేటు అంచనాల్ని 2.2 శాతం నుంచి 2 శాతానికి తగ్గించింది.
మారుతి 3 శాత ం డౌన్...జపాన్ కరెన్సీ యెన్ బలపడిన ప్రభావంతో మారుతి సుజుకి షేరు 3 శాతం పతనమై రూ. 4,084 వద్ద ముగిసింది. సెన్సెక్స్ షేర్లలో అధికంగా క్షీణించిన షేరు ఇదే.