మార్కెట్ లాభాలకు బ్రేక్
Published Wed, Dec 11 2013 2:07 AM | Last Updated on Sat, Sep 2 2017 1:27 AM
ముంబై: ఎన్నికల ఫలితాల ఊతంతో మూడు సెషన్ల పాటు లాభపడిన స్టాక్‌మార్కెట్లు మంగళవారం క్షీణించాయి. లాభాల స్వీకరణతో సెన్సెక్స్ నాలుగు రోజుల్లో తొలిసారిగా నష్టాలు నమోదు చేసింది. 71 పాయింట్లు క్షీణించి 21,255 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ సైతం 31 పాయింట్లు తగ్గి 6,333 వద్ద ముగిసింది. సెన్సెక్స్ క్రితం మూడు సెషన్లలో ఏకంగా 618 పాయింట్లు (సుమారు 2.98 శాతం) మేర ఎగిసింది. తాజాగా మంగళవారం విద్యుత్ రంగ స్టాక్స్ పతనం కావడంతో పాటు క్యాపిటల్ గూడ్స్, బ్యాంక్, రియల్టీ సూచీలు క్షీణించాయి. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, మెటల్ స్టాక్స్ కొంత పెరగడంతో మార్కెట్ భారీ క్షీణతకు కాస్త అడ్డుకట్ట పడింది.
ఎన్‌టీపీసీ షాక్..
కేంద్ర విద్యుత్ రంగ నియంత్రణ కమిషన్ (సీఈఆర్‌సీ) 2015-19 మధ్య కాలానికి రూపొందించిన టారిఫ్‌ల ముసాయిదా విద్యుత్ కంపెనీలకు ప్రతికూలంగా ఉండొచ్చన్న అంచనాలతో ఎన్‌టీపీసీ షేర్లు 11 శాతం మేర క్షీణించాయి.
తగ్గిన టర్నోవర్..
బీఎస్‌ఈలో 1,461 స్టాక్స్ నష్టాల్లోనూ, 983 షేర్లు లాభాల్లోనూ ముగిశాయి. మొత్తం టర్నోవరు రూ. 2,224 కోట్ల నుంచి రూ .2,186 కోట్లకు తగ్గింది. మరోవైపు, ఎన్‌ఎస్‌ఈలో స్టాక్స్‌లో టర్నోవరు రూ. 13,991 కోట్లుగాను, డెరివేటివ్స్‌లో రూ. 1,21,504 కోట్లుగాను నమోదైంది. కాగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహాయక ప్యాకేజీలను ఉపసంహరించవచ్చనే అంచనాలతో ఆసియా మార్కెట్లు మళ్లీ క్షీణించాయి. చైనా, హాంకాంగ్, సింగపూర్, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ సూచీలు తగ్గాయి. యూరప్‌లో ఫ్రాన్స్, జర్మనీ మార్కెట్లు కాస్త బలపడ్డాయి.
Advertisement
Advertisement