ముంబై : పసిడిపై దిగుమతి సుంకాలను 10 శాతం స్థాయి నుంచి 12.5 శాతానికి పెంచిన నేపథ్యంలో దేశీయంగా బంగారానికి డిమాండ్ తగ్గే అవకాశాలు ఉన్నాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) పేర్కొంది. ఇది 2.4 శాతం దాకా తగ్గొచ్చని ఒక నివేదికలో వివరించింది. ఒకవేళ అధిక స్థాయి సుంకాలను శాశ్వత ప్రాతిపదికన కొనసాగించిన పక్షంలో దీర్ఘకాలికంగా వినియోగదారుల నుంచి డిమాండ్ తగ్గుదల ఒక మోస్తరుగా 1% స్థాయిలో వివరించింది. 2018లో భారత్‌లో పసిడి డిమాండ్ 760.4 టన్నులుగా ఉండగా... చైనాలో 994.3 టన్నులు.
ఇక ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో చైనాలో డిమాండ్ 255.3 టన్నులుగా ఉండగా.. భారత్‌లో 159 టన్నులుగా ఉంది. మరోవైపు, భారత్, చైనా దేశాలు విస్తృతంగా వ్యవస్థాగత ఆర్థిక సంస్కరణలను అమలు చేస్తుండటం దీర్ఘకాలికంగా పసిడి డిమాండ్‌కు ఊతమివ్వగలవని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వివరించింది. ఆర్థిక మార్కెట్లలో అనిశ్చితి, అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహా వివిధ సెంట్రల్ బ్యాంకుల ఉదార ఆర్థిక విధానాలతో వచ్చే ఆరు నుంచి పన్నెండు నెలల కాలంలో పసిడిలో పెట్టుబడులకు కొంత మద్దతు లభించగలదని గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. ఈ ఏడాది జూన్ 30 దాకా గణాంకాలను పరిశీలిస్తే పసిడిపై రాబడులు 10.2 శాతం మేర ఉన్నాయని వెల్లడించింది, అమెరికన్ బాండ్లు (5.2 శాతం), అంతర్జాతీయ బాండ్లు (5 శాతం), వర్ధమాన దేశాల స్టాక్ మార్కెట్లపై (9.2 శాతం) రాబడులతో పోలిస్తే ఇదే అత్యధికమని డబ్ల్యూజీసీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment