అమెరికా ఫెడ్ వైపు పసిడి చూపు!
వడ్డీరేట్ల పెంపు అంచనాలు తగ్గితే... పరుగే: నిపుణులు
అమెరికా ఫెడ్ ఫండ్ రేటు నిర్ణయం వైపు పసిడి చూస్తుంది. ప్రస్తుతం 0.50 శాతంగా ఉన్న ఫండ్ రేటును మరింత పెంచడంపై ఈ నెల 14-15 తేదీల్లో అమెరికా సెంట్రల్ బ్యాంక్- ఫెడరల్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకోనుంది. రేటు పెంపు అవకాశాలు లేకపోతే... రానున్న కొద్ది రోజుల్లో నెమైక్స్ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో పసిడి కాంట్రాక్ట్ ఔన్స్ (31.1 గ్రా) తిరిగి 1,300 డాలర్లకు చేరుతుందని కొందరు నిపుణుల వాదన. నెల రోజుల క్రితం ఈ స్థాయికి చేరిన పసిడి... అమెరికా ఆర్థిక వ్యవస్థ మెరుగుదల అంచనాల వార్తలకు లోబడి తిరిగి 1,200 డాలర్ల దిగువ స్థాయికి పడిపోయింది.
అయితే శుక్రవారం రాత్రి ఎంసీఎక్స్ ట్రేడింగ్‌లో ఒక్కసారిగా 2 శాతంపైగా పెరిగింది. మూడు నెలల్లో ఒకేరోజు ఈ స్థాయిలో పసిడి ధర పెరగడం ఇదే తొలిసారి. మేలో ఉపాధి అవకాశాలు తగ్గడం, నాన్-మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ పడిపోవడంసహా... అమెరికా ఆర్థిక వ్యవస్థ నుంచి తాజాగా వెలువడిన ‘మందగమన’ వార్తలు, దీనితో ఇప్పట్లో ఫెడ్ రేటు పెరగదన్న ఊహాగానాలు, డాలర్ బలహీనత వంటి అంశాలు పసిడి ఒక్కసారిగా పుంజుకోడానికి కారణం.
ఆయా అంశాలు డాలర్ ను సైతం ప్రధాన కరెన్సీల బాస్కెట్‌లో మూడు వారాల కనిష్ట స్థాయికి బలహీనపరిచాయి. మే 12 కనిష్ట స్థాయి 93.86కు డాలర్ విలువ పడిపోయింది. ఇవన్నీ పసిడికి శుక్రవారం కలిసి వచ్చాయి. ఒక్కరోజే 2.5 శాతం (దాదాపు 30 డాలర్లు) ఎగసింది. 1,243 డాలర్ల వద్ద ముగిసింది. మొత్తంమీద వారంలో 26 డాలర్లు పెరిగింది. వెండి ఔన్స్ ధర సైతం స్వల్పంగా పెరిగి 16 డాలర్లు దాటింది.
భారత్‌ను చూస్తే...
శనివారం ముంబై బులియన్ మార్కెట్‌కు సెలవు. అందువల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి పెరుగుదల ప్రభావం ఇక్కడలేకపోయినా, ఢిల్లీ మార్కెట్‌లో 99.9 స్వచ్ఛత ధర ఒక్కసారిగా శనివారం భారీగా 10 గ్రాములకు రూ.550 ఎగసి రూ. 29,225కు పెరిగింది. ఇక వారం వారీగా శుక్రవారంనాటికి ముంబై ప్రధాన బులియన్ మార్కెట్‌ను చూస్తే.. పసిడి వరుసగా మూడవవారమూ నష్టపోయింది. 10 గ్రాములు 99.9 స్వచ్ఛత, 99.5 స్వచ్ఛత ధరలు స్వల్పంగా రూ.100 చొప్పన తగ్గి వరుసగా రూ.28,805, రూ.28,655 వద్ద ముగిశాయి. వెండి ధర కేజీకి రూ.410 తగ్గి రూ.38,945కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావానికి అనుగుణంగా సోమవారం ముంబైలో బులియన్ ధర పెరిగే అవకాశం ఉంది.