
సాక్షి, న్యూఢిల్లీ : బంగారం, వెండి ధరలు మరింత కిందకి పడిపోయాయి. గురువారం రూ.200లు తగ్గిన బంగారం ధర, శుక్రవారం ట్రేడింగ్‌లో మరో రూ.200 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ.29,750గా నమోదైంది. బలహీనమైన అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు తగ్గడం వంటి కారణాల వల్ల బంగారం ధర పడిపోయినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. అటు వెండి ధరలు కూడా రూ.38 వేల మార్కుకు కిందకి పడిపోయాయి. రూ.425 క్షీణించడంతో కేజీ వెండి రూ.37,700గా నమోదైంది.
వెండికి కూడా పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల దగ్గర నుంచి కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ధర పడిపోయినట్లు ట్రేడర్లు చెప్పారు. బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలే మెటల్ ధరలు తగ్గడానికి ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. మే నుంచి బంగారం ధరలు అత్యధిక వార పతనాన్ని నమోదుచేస్తున్నాయి. అమెరికా వడ్డీరేట్లు పెంచుతుందనే సంకేతాలు బంగారాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ వారంలో బంగారం 2.5 శాతం దిగజారింది. అంతర్జాతీయంగా బంగారం ధర 1.27శాతం తగ్గడంతో ఔన్సు 1,247.80 డాలర్లు పలికింది. వెండి 1.41శాతం తగ్గడంతో ఔన్సు 15.70డాలర్లుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment