
సాక్షి, న్యూఢిల్లీ : బంగారం ధరల పతనానికి బ్రేక్ పడింది. వరుసగా పది రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు గురువారం ఒక్కసారిగా పైకి ఎగిశాయి. నేటి మార్కెట్‌లో బంగారం ధర రూ.230 పెరిగి పది గ్రాములకు రూ.29,665గా నమోదైంది. అంతర్జాతీయ పరిస్థితులతోపాటు స్థానిక జువెల్లర్స్ నుంచి కొనుగోళ్లు పెరగడంతో బంగారం ధరలు పెరిగినట్లు బులియన్ ట్రేడింగ్ వర్గాలు వెల్లడించాయి. గత వారం బంగారు ఆభరణాల కొనుగోళ్లు భారీగా తగ్గడంతో 12రోజుల్లో రూ.1,551 వరకు తగ్గింది.
వెండి కూడా రూ.680 పెరిగి రూ.38వేల మార్కు పైకి చేరుకుంది. నేటి మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.38,280గా ఉంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి భారీగా కొనుగోళ్లు జరగడంతో వెండి ధర పెరిగినట్లు ట్రేడర్లు చెబుతున్నారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లను పెంచడం, డాలర్ విలువ మారకపోవడం బంగారం ధర పెరుగుదలకు దోహదం చేసిందని ట్రేడర్లు తెలిపారు. అంతర్జాతీయంగా బంగారం ధర 0.17శాతం పెరిగి ఔన్సు 1,257.50 డాలర్లు పలికింది. దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు రూ.230 చొప్పున పెరిగి రూ.29,665, రూ.29,515గా నమోదయ్యాయి.