తగ్గినా... ఇది లాభాల స్వీకరణే!
పసిడిపై నిపుణుల అంచనా
ముంబై/న్యూయార్క్: అటు అంతర్జాతీయంగా, ఇటు దేశీయంగా శుక్రవారంతో ముగిసిన వారంలో పసిడి స్పీడ్‌కు కొంత బ్రేక్ పడింది. రెండు వారాల కనిష్ట స్థాయి రికార్డయ్యింది. అంతర్జాతీయంగా న్యూయార్క్ కమోడిటీ ఎక్సే్ఛంజ్ నైమెక్స్‌లో పసిడి శుక్రవారం ముగిసిన వారంలో ఔ న్స్ (31.1గ్రా)కు 20 డాలర్లు తగ్గి, 1,190 వద్ద ముగిసింది. దేశీయంగానూ ఇదే ధోరణి కనబడింది. ముంబై ప్రధాన స్పాట్ మార్కెట్‌లో 99.9 స్వచ్ఛత పసిడి ధర 10 గ్రాములకు శుక్రవారంతో ముగిసిన వారంలో రూ.345 తగ్గి రూ.28,855 వద్ద ముగిసింది. ఇక వెండి కేజీ ధర రూ.595 తగ్గి రూ.40,890కి దిగివచ్చింది. కాగా భవిష్యత్తుకు సంబంధించి అంచనాల ప్రకారం– తాజా సమీక్షా వారంలో నష్టాలు తాత్కాలికమైనవేనని, మూడు వారాలుగా పెరుగు తున్న పసిడి నుంచి లాభాల స్వీకరణగా దీనిని భావించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
అమెరికా ఆర్థిక పరిస్థితుల దిక్సూచి...
మున్ముందు డాలర్ కదలికలు, అమెరికా ఆర్థిక వ్యవస్థ వంటి అంశాలు పసిడికి మార్గనిర్దేశం చేస్తాయని వారు పేర్కొంటున్నారు. ప్రత్యేకించి శుక్రవారమే వెలువడిన అమెరికా నాల్గవ త్రైమాసిక వృద్ధి గణాంకాలు అంచనాలకన్నా తక్కువగా 1.9 శాతంగా ఉన్న విషయాన్ని నిపుణులు ప్రస్తావిస్తూ... పసిడి భవిష్యత్తుకు ఇది శుభసూచికమని పేర్కొంటున్నారు. మూడవ త్రైమాసికంలో వృద్ధి రేటు 3.5 శాతం కాగా, నాల్గవ త్రైమాసికంలో కనీసం 2.2 శాతం వృద్ధి రేటు నమోదవుతుందని ఆర్థికవేత్తలు భావించారు. ఆమెరికా ఆర్థిక అనిశ్చితి పరిస్థితులే పసిడికి మున్ముందు బలోపేతమన్నది ఈ రంగంలో నిపుణుల మాట.
అమెరికా ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు, అస్పష్ట ప్రకటనల నేపథ్యంలో పెట్టుబడులకు సురక్షితమైన మెటల్‌గా స్వల్పకాలంలో పసిడి కొనసాగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. బంగారానికి 1,170 డాలర్ల వద్ద మద్దతు ఉందని, 1,241 డాలర్ల వద్ద తొలి నిరోధం ఉండొచ్చనే సంకేతాలున్నాయి.